బిహారీ మార్కు కిరికిరి!
ABN , Publish Date - Feb 28 , 2026 | 05:56 AM
‘మా వాళ్లు ఎక్కడ, ఏ రాష్ట్రంలో, ఎలాంటి కేసులో ఇరుక్కున్నా సరే! మా వాళ్లు కాబట్టి మేం అండగా ఉంటాం’ అని బిహార్ సర్కారు తేల్చేసింది. ఏకంగా భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎ్‌సఎస్) సెక్షన్లకే సవరణలు చేసేసింది. డిప్యూటీ స్పీకర్...
సునీల్ నాయక్‌కు ‘చట్టపరమైన’ రక్షణ
అరెస్టు చేయాలంటే అనుమతి కావాల్సిందే
ఏకంగా బీఎన్‌ఎ్‌సఎస్ చట్టానికే సవరణ
కేంద్ర బలగాల కోసం కేంద్రం తెచ్చిన సెక్షన్
అందులోని వెసులుబాటు వాడుకున్న బిహార్
రాష్ట్ర పోలీసు బలగాలకూ వర్తించేలా మార్పు
‘మా వాళ్లు ఎక్కడ, ఏ రాష్ట్రంలో, ఎలాంటి కేసులో ఇరుక్కున్నా సరే! మా వాళ్లు కాబట్టి మేం అండగా ఉంటాం’ అని బిహార్ సర్కారు తేల్చేసింది. ఏకంగా భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎ్‌సఎస్) సెక్షన్లకే సవరణలు చేసేసింది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ స్టేట్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్‌కు ఇలా అండగా నిలిచింది. ఇప్పుడు ఆయన్ను ఏపీ పోలీసులు అరెస్టు చేయాలంటే... ముందుగా బిహార్ ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే. బీఎన్‌ఎ్‌సఎ్‌సలో చట్టప్రకారం కల్పించిన చిన్న వెసులుబాటు ఆధారంగా బిహార్ ప్రభుత్వం ఈ రక్షణ కవచం ఏర్పాటు చేసింది. ఈ పరిణామం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక రాష్ట్రం తన క్యాడర్ అధికారిని కాపాడుకునేందుకు ఏకంగా చట్టంలో సవరణ చేయడం, గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పుడు సునీల్ నాయక్‌ను ట్రాన్సిట్ వారెంట్‌పై ఏపీ తీసుకురావాలన్నా, హైకోర్టు ఆదేశాలతో విచారణకు తీసుకురావాలన్నా విధిగా బిహార్ ప్రభుత్వం ముందస్తు అనుమతి ఇవ్వాల్సిందే.
తీసుకొచ్చేద్దామని...
నాడు నరసాపురం ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజును సీఐడీ అధికారులు 2021 మే 14న అరెస్టు చేసి గుంటూరులోని సీఐడీ ఆఫీసుకు తీసుకొచ్చారు. అదే రోజు సీఐడీ కార్యాలయంలో ఆయన్ను తీవ్రంగా టార్చర్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 2024 జూలై 11న రఘురామ తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్‌పై గుంటూరులోని నగరపాలెం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేస్తున్నారు. ఈ కేసులో నాటి సీఐడీ డీఐజీగా సునీల్ నాయక్ ఏ7గా ఉన్నారు. బిహార్ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ స్వస్థలం పల్నాడు జిల్లా కారంపూడి మండలం లాలిపురం తండా. జగన్ ప్రభుత్వ హయాంలో ఆయన ఏపీకి డిప్యుటేషన్‌పై వచ్చారు. ఆ సమయంలో ఆయన సీఐడీ డీఐజీగా పనిచేశారు. జగన్ సర్కారు గద్దెదిగగానే తిరిగి బిహార్ వెళ్లిపోయారు. ప్రస్తుతం బిహార్ అగ్నిమాపక విభాగం, హోమ్‌గార్డ్స్ ఐజీగా పనిచేస్తున్నారు. తన కస్టోడియల్ టార్చర్ సమయంలో ఐపీఎస్ సునీల్ నాయక్ కూడా అక్కడున్నారని రఘురామ పేర్కొన్నారు. దీంతో... ఆయననూ కేసులో చేర్చారు. ఆయనను విచారించేందుకు, అదుపులోకి తీసుకునేందుకు తాజాగా ఏపీ పోలీసు అధికారులు ప్రయత్నించారు. కానీ... అక్కడి కోర్టు ట్రాన్సిట్ వారెంట్ ఇచ్చేందుకు నిరాకరించింది. స్థానిక పోలీసులు సునీల్ నాయక్‌కు అండగా నిలిచారు. దీంతో... ఏపీ పోలీసులు కోర్టు ద్వారా అరెస్టు వారెంటు తీసుకుని సునీల్ నాయక్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఈలోపే రక్షణ...
సీఆర్‌పీసీ స్థానంలో ప్రస్తుతం భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్‌ఎ్‌సఎస్)-2023 చట్టం అమల్లోకి వచ్చింది. ఇందులోని సెక్షన్ 218లోని సబ్ సెక్షన్ 2 ‘కేంద్ర సాయుధ దళాలకు చెందిన ఏ సభ్యుడైనా తన అధికారిక విధి నిర్వహణలో ఉన్నప్పుడు, పనిచేస్తున్న సమయంలో ఏదైనా నేరం జరిగితే... కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతితోనే విచారణకు స్వీకరించాలి’’ అని చెబుతోంది. సబ్ సెక్షన్ 3 ప్రకారం.. దీనిని రాష్ట్ర బలగాలకు వర్తింపచేస్తూ రాష్ట్రాలు నోటిఫికేషన్ ద్వారా సవరణ చేసుకునే వెసులుబాటు ఉంది. దీనిని బిహార్ ప్రభుత్వం ఇప్పుడు ఉపయోగించుకుంది. తమ రాష్ట్ర అధికారులు విధి నిర్వహణలో భాగంగా ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల్లో పనిచేసినప్పుడు, వారు ఏదైనా నేరం చేసి ఉంటే, ఆ కేసు విచారణలో భాగంగా ఆ అధికారిని అరెస్టు చేయాలంటే ముందుగా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కూడా తీసుకోవాలంటూ తేల్చేసింది. ‘‘బీఎన్‌ఎ్‌సఎ్‌స-2023లోని సెక్షన్ 218లోని సబ్ సెక్షన్ 2లో నిబంధన బిహార్ పోలీసులలోని అన్ని కేటగిరీలు, క్యాడర్‌ల సభ్యులందరికి వర్తిస్తుంది. వారు ఎక్కడ విధులు నిర్వహించినా... శాంతి భద్రతలు కాపాడటమే వారి బాధ్యత. అందువల్ల బీఎన్‌ఎ్‌సఎస్ సెక్షన్ 218లోని సబ్ సెక్షన్ 2 వద్ద కేంద్ర ప్రభుత్వం అనే వ్యక్తీకరణను రాష్ట్ర ప్రభుత్వంగా కూడా అర్థం చేసుకోవాలి’’ అని బిహార్ ప్రభుత్వం గురువారం సవరణ తీసుకొచ్చింది. దీనిపై అప్పటికప్పుడు గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. వెరసి... రఘురామ టార్చర్ కేసులో బిహార్ ప్రభుత్వం అనుమతిస్తేనే సునీల్ నాయక్ అరెస్టు, విచారణ సాధ్యమవుతుంది.
ఈ వార్తలూ చదవండి
ఏఐ వల్లే 4 వేల మందిని తీసేస్తున్నాము: జాక్ డోర్సీ
కృత్రిమ మేధకు భయపడం: టీసీఎస్ సీఈఓ