బాకీపడ్డ బిహార్ ప్రభుత్వం! త్వరలో కలెక్టరేట్ భవనంలో కొంత భాగం వేలం
ABN , Publish Date - Nov 12 , 2026 | 03:28 PM
బిహార్ రాష్ట్రం పర్బనీ జిల్లా కలెక్టరేట్‌లో కొంత భాగం వేలం వేయాలని స్థానిక జిల్లా కోర్టు తాజాగా ఆదేశించింది.
ఇంటర్నెట్ డెస్క్: బిహార్ రాష్ట్రం పర్బనీ జిల్లా కలెక్టరేట్‌లో కొంత భాగం వేలం వేయాలని స్థానిక జిల్లా కోర్టు తాజాగా ఆదేశించింది. కోల్‌కతాకు చెందిన సంస్థ రాధాకృష్ణ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రభుత్వం రూ.4.17 కోట్లు బాకీ పడటంతో కలెక్టర్‌లోని కొంత భాగంతో పాటు 10 కట్టాల (13,612.5 చదరపు అడుగులు) భూమిని నవంబర్ 26న వేలం వేయాలని జిల్లా కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. వేలం వాయిదా కోసం బిహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
1982 నాటి వివాదం..
మధుబనిలో ఓ కాటన్ మిల్లు పునరుద్ధరణకు ప్రభుత్వం రాధా కృష్ణ ఎక్స్‌పోర్ట్సు ప్రైవేటు లిమిటెడ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో ఆ సంస్థ పెట్టుబడి, ముడి సరకు కోసం రూ.28.90 లక్షలను చెల్లించింది. అయితే, మిల్లు లాభాల బాటపట్టలేదు. చివరకు 2000లో మూత పడింది. ఈ క్రమంలో కంపెనీ ప్రభుత్వంపై 2012లో ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్‌ను ప్రారంభించింది. ఈ కేసులో ఆర్బిట్రర్‌గా వ్యవహరించిన పట్నా హైకోర్టు మాజీ న్యాయమూర్తి సంస్థకు రూ.33.44 లక్షలు చెల్లించాలంటూ ప్రభుత్వానికి చెప్పారు. న్యాయఖర్చులు కూడా చెల్లించాలని పేర్కొన్నారు. గడువు లోపు ఈ మొత్తం చెల్లించని పక్షంలో 18 శాతం వార్షిక వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.
తమకు రావాల్సిన మొత్తం దక్కకపోవడంతో సంస్థ 2016లో మధుబని జిల్లా సివిల్ కోర్టును ఆశ్రయించింది. వివాదం కొనసాగుతుండగా 2025 నాటికి బాకీ రూ.4.17 కోట్లకు చేరింది. ఈ క్రమంలో జిల్లా కోర్టు ఈ ఏడాది ఆగస్టులో కేసుకు సంబంధించి 10 కట్టాల ప్రభుత్వ భూమి, కలెక్టరేట్‌లోని రెండు అంతస్తుల దక్షిణ భాగాన్ని అటాచ్ చేసింది.
అయితే, ఈ తీర్పును హైకోర్టులో సవాలు చేసిన ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఈ విషయంలో సుప్రీంకోర్టులో కూడా బిహార్ ప్రభుత్వానికి నిరాశ తప్పలేదు. దీంతో, నవంబర్ 26న ప్రభుత్వం భవనం వేలం వేయాలని జిల్లా కోర్టు తాజాగా ఆదేశించింది. బిహార్ ప్రభుత్వానికి గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. ప్రభుత్వం ఆస్తులు వేయాల్సి వచ్చినప్పుడు కోర్టులు జోక్యం చేసుకోవడమో లేదా బాకీ చెల్లించడమో జరిగి వేలం ముప్పు తప్పిపోయింది.
ఈ వార్తలనూ చదవండి:
కేజ్రీవాల్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు.. రూ.7 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్..