పరువు కోసం పాపం !
ABN , Publish Date - Apr 24 , 2026 | 06:23 AM
భూమిమీద పడిన ఆ శిశువు..కళ్లు తెరవకుండానే కన్నతల్లి చేతిలో దారుణంగా హత్యకు గురైంది. పెళ్లి కాకుండానే తల్లయిన యువతి పరువుపోతుందని బిడ్డ గొంతుకోసి చెత్తసంచిలో..
ప్రసవించగానే గొంతుకోసి శిశువు హత్య
శౌచాలయ చెత్తసంచిలో మృతదేహం
పెళ్లి కాకుండా గర్భందాల్చినందుకే అంటూ పోలీసులకు వెల్లడి
దేవనహళ్లిలో ఘోరం
బెంగళూరు, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): భూమిమీద పడిన ఆ శిశువు..కళ్లు తెరవకుండానే కన్నతల్లి చేతిలో దారుణంగా హత్యకు గురైంది. పెళ్లి కాకుండానే తల్లయిన యువతి పరువుపోతుందని బిడ్డ గొంతుకోసి చెత్తసంచిలో పడేసింది. బెంగళూరు శివారులోని దేవనహళ్లి తాలూకా బీరసంద్ర పరిధిలో ఈ ఘోరం చోటుచేసుకుంది. స్థానిక అంతర్జాతీయ మొబైల్ కంపెనీలో 19 ఏళ్ల యువతి కొంతకాలంగా పనిచేస్తోంది. బుధవారం విధులలో ఉన్న సమయంలో ఆమెకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో కార్యాలయంలోని శౌచాలయానికి వెళ్లింది. అక్కడే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం బయటపడితే పరువు పోతుందని భావించిన యువతి, శిశువు గొంతుకోసి చంపేసి చెత్తవేసే సంచిలో పడేసింది. తర్వాత అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయింది. ఆ తర్వాత శౌచాలయానికి వెళ్లిన ఓ మహిళ... రక్తం, సంచిలో శిశువు మృతదేహం గుర్తించి కంపెనీ అధికారులకు తెలియజేసింది. వారు విశ్వనాథపుర పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వచ్చి శిశువు మృతదేహాన్ని పరిశీలించారు. కాసేపటికే సదరు యువతిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తనకు ఇంకా వివాహం కాలేదని, ఓ వ్యక్తితో సంబంధం కారణంగా గర్భం దాల్చానని ఆమె పోలీసులకు తెలిపింది. శౌచాలయంలో బిడ్డ పుట్టిందని, ఏంచేయాలో తోచక బిడ్డను చంపేశానని అంగీకరించింది. యువతి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
శాంతి చర్చల విషయంలో ఒత్తిడి లేదు.. మా దృష్టి దాని పైనే: డొనాల్డ్ ట్రంప్
నెతన్యాహు ప్లాన్‌ను వాళ్లు తిరస్కరించారు.. ట్రంప్ అంగీకరించారు: విదేశాంగ మాజీ కార్యదర్శి