వాట్సాప్‌లో సైబర్ మోసం.. రూ. 10 లక్షలు పోగొట్టుకున్న అటవీ అధికారి..
ABN , Publish Date - Jul 20 , 2026 | 05:49 PM
వాట్సాప్‌లో వచ్చిన వెడ్డింగ్ ఇన్విటేషన్ డౌన్‌లోడ్ చేసిన డిప్యూటీ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ 10 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
ఇంటర్‌నెట్ డెస్క్: వాట్సాప్‌లో వచ్చిన వెడ్డింగ్ ఇన్విటేషన్ డౌన్‌లోడ్ చేసిన డిప్యూటీ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ 10 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి డిప్యూటీ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. జులై 14వ తేదీన ఆయన వాట్సాప్‌కు ఓ వెడ్డింగ్ ఇన్విటేషన్ వచ్చింది. ఏపీకే ఫార్మాట్‌లో ఉన్న ఆ ఇన్విటేషన్‌ను ఆయన డౌన్‌లోడ్ చేశారు.
కొద్దిసేపటి తర్వాత ఆయనకు చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతా నుంచి వెంట వెంటనే డబ్బులు కట్ అయ్యాయి. ఆయన తన అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోగా.. 9,96,659 రూపాయలు విత్ డ్రా అయినట్లు తెలిసింది. సైబర్ మోసానికి గురయ్యానని గుర్తించిన ఆ ఫారెస్ట్ ఆఫీసర్ వెంటనే తన మొబైల్ ఫోన్‌లోని అన్ని యాప్స్ డిలీట్ చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సైబర్ అధికారులు ఈ సంఘటనపై మాట్లాడుతూ.. ‘వాట్సాప్‌లో వచ్చే ఏపీకే ఫైల్స్ క్లిక్ చేయటం ద్వారా సైబర్ నేరాల బారిన పడే అవకాశం ఉంది. వెడ్డింగ్ ఇన్విటేషన్స్, ఈవెంట్ నోటిఫికేషన్స్ లాగా ఏపీకే ఫైల్స్ మన వాట్సాప్‌లకు వస్తాయి. ఒకసారి వాటిపై క్లిక్ చేస్తే .. మాల్వేర్ మన ఫోన్ యాక్సెస్ తీసుకుంటుంది. సైబర్ నేరగాళ్లు మన వ్యక్తిగత విషయాలు, బ్యాంకింగ్ వివరాలు, మెసేజ్‌లు ఇతర సున్నితమైన వివరాలను దొంగిలిస్తారు. బ్యాంకుల నుంచి డబ్బులు దొంగిలించే అవకాశం కూడా ఉంది. గత కొన్ని నెలల నుంచి ఇలాంటి కేసులు చాలా ఎక్కువైపోయాయి. దయచేసి వాట్సాప్‌లో వచ్చే ఏపీకే ఫైల్స్ డౌన్‌లోడ్ చేయకండి’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
BRSలోనే కొనసాగుతా: MLA మల్లారెడ్డి
అయోధ్య రామమందిరం విరాళాల లెక్కింపుపై ట్రస్ట్ కీలక నిర్ణయం