పోటెత్తిన బెంగాలీలు!
ABN , Publish Date - Apr 24 , 2026 | 04:41 AM
పశ్చిమ బెంగాల్‌లో ఓటర్లు పోటెత్తారు. గురువారం జరిగిన తొలిదశ అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 91.78శాతం పోలింగ్ నమోదైంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ ఆ రాష్ట్రంలో ...
తొలిదశలో 91.78 శాతం పోలింగ్
రాష్ట్ర చరిత్రలోనే అత్యధికం
కోల్‌కతా, ఏప్రిల్ 23: పశ్చిమ బెంగాల్‌లో ఓటర్లు పోటెత్తారు. గురువారం జరిగిన తొలిదశ అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 91.78శాతం పోలింగ్ నమోదైంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ ఆ రాష్ట్రంలో ఇంత భారీస్థాయిలో పోలింగ్ శాతం నమోదు కావటం ఇదే ప్రథమం. మొత్తం 294 శాసనసభ నియోజకవర్గాలకుగాను తొలిదశలో 152 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. 16 జిల్లాల పరిధిలో జరిగిన ఎన్నికలకు ఓటర్లు తండోపతండాలుగా తరలివచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ రికార్డు స్థాయి పోలింగ్ తమకు అనుకూల సంకేతమని, వరుసగా నాలుగోసారి అధికారం తమదేనని తృణమూల్ కాంగ్రెస్ అధినాయకులు, సీఎం మమ తా బెనర్జీ ప్రకటించగా.. రాష్ట్రంలో ఈసారి మార్పు తథ్యమని, బీజేపీ ప్రభుత్వం ఏర్పడనుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తృణమూల్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దక్షిణ్ దినాజ్‌పూర్ అనే నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిపై తృణమూల్ కా ర్యకర్తలు దాడికి పాల్పడ్డారు. రాష్ట్రంలో నూతన రాజకీయ శక్తిగా ఎన్నికల బరిలోకి దిగిన హుమాయూన్ కబీర్ సారథ్యంలోని ‘ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ’, తృణమూల్ కార్యకర్తల మధ్య ముర్షీదాబాద్ జిల్లాలోని నవోడా నియోజకవర్గంలో ఘర్షణలు జరిగాయి. నవోడాలో ఓ పోలింగ్‌బూత్‌లో ఓటు వేయటానికి వచ్చిన హుమాయూన్ కబీర్‌కు వ్యతిరేకంగా తృణమూల్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తూ ‘బీజేపీ ఏజెంట్ గో బ్యాక్’ అని నినాదాలు చేయటంతో ఈ ఘర్షణలు మొదలయ్యాయి. కబీర్ అనుచరులు, కార్యకర్తలు, తృణమూల్ శ్రేణలు పరస్పరం భౌతికదాడులకు దిగాయి. అధికారులు తక్షణం స్పం దించి.. భారీ ఎత్తున పోలీసులను, కేంద్ర బలగాలను మోహరించారు. లాఠీచార్జి చేసి బలగాలు పరిస్థితులను అదుపులోకి తెచ్చాయి. కాగా, మమతా బెనర్జీ తమ పార్టీ అభ్యర్థులను డబ్బులతో కొనుగోలు చేసి 27 నియోజకవర్గాల్లో బరిలోంచి తప్పించారని హు మాయూన్ కబీఆర్ ఆరోపించారు. పోలింగ్ సరళిని మమత, అభిషేక్ బెనర్జీ తదితర తృణమూల్ నేత లు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ శ్రేణులకు దిశానిర్దేశం చేయగా.. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పార్టీ నేతలతో కలిసి ఎప్పటికప్పుడు సమీక్షించారు.
బీజేపీకి పట్టు న్న ఉత్తర బెంగాల్ మీద ప్రధానంగా దృష్టి పెట్టారు. కాగా, కొన్ని పోలింగ్‌బూత్‌లలోని ఈవీఎం యంత్రాలలో సాంకేతిక సమస్యలు తలెత్తటంతో.. పోలింగ్ ఆలస్యంగా ప్రారంభం కావటం, మధ్యలో కొద్దిసేపు నిలిచిపోవటం వంటి ఘటనలు జరిగాయి. పింగ్ల అనే నియోజకవర్గంలోని ఓ బూత్‌లో ఎన్నికల సిబ్బంది అందరూ మధ్యాహ్న భోజనానికి బయటకు వెళ్లిపోవటం, బూత్‌లో ఎవరూ లేకపోవటం వివాదం రేపింది. ఈ ఘటనపై ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. సదరు బూత్‌లోని సిబ్బంది అందరినీ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదు కావటంపై మమత స్పందిస్తూ.. తొలిదశ ఎన్నికలతోనే తమ విజయం సుస్థిరమైందని చెప్పారు. రాష్ట్రంలో విజయం తర్వాత కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించటమే లక్ష్యంగా పని చేస్తానన్నారు. అంతకుముందు, రాష్ట్రంలో తదుపరి దశ పోలింగ్ జరిగే నియోజకవర్గాలకు సంబంధించిన ఓ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. భారీ ఎత్తున జరుగుతున్న పోలింగ్.. రాష్ట్రంలో మార్పు సంభవించనుంది అనటానికి సంకేతమన్నారు. రెండో దశ పోలింగ్ ఏప్రిల్ 29వ తేదీన జరగనుంది. ఫలితాలు మే 4వ తేదీన విడుదలవుతాయి.
అధిక పోలింగ్‌కు కారణాలు
ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియతో బెంగాల్‌లో దాదాపు 90 లక్షల ఓట్లను ఈసీ తొలగించింది. బోగస్ ఓట్లను, ఒకే వ్యక్తి పేరు మీద ఉన్న పలు ఓట్లను, బంగ్లాదేశ్ నుంచి తరలివచ్చిన వారి ఓట్లను భారీగా తొలగించటంతో.. నికరంగా తేలిన ఓటర్లే మిగిలారని, వీరంతా ఓటు వేయటానికి రావటంతో.. రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైందని విశ్లేషకులు చెబుతున్నారు.
దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న బెంగాలీలు ఓటు వేయటానికి సొంత ప్రాంతాలకు భారీగా వచ్చారు. ఓటు హక్కును తొలగించి దేశ పౌరసత్వాన్నే తొలగించాలని బీజేపీ కుట్రలు పన్నుతోందంటూ మమత భారీ ఎత్తున చేసిన ప్రచారం కూడా.. వీరు భారీ గా స్వస్థలాలకు రావటానికి కారణమైంది.
పోలింగ్ సందర్భంగా రాష్ట్రంలో 2.4 లక్షల మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని మోహరించారు. పోలీసు సిబ్బంది దీనికి అదనం. సురక్షిత వాతావరణం ఉండటం కూడా పలువురు ఓటర్లు ఓటు వేయటానికి ముందుకు రావటానికి తోడ్పడింది.
ఎస్‌ఐఆర్ తర్వాత బిహార్‌లో కూడా పోలింగ్ శాతం గతంలో కంటే ఎక్కువగా నమోదైంది. ఎస్‌ఐఆర్ నేపథ్యంలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 67.13శాతం పోలింగ్ నమోదైంది. అంతకుముందు జరిగిన రెండు ఎన్నికల కంటే ఇది ఎక్కువ. బిహార్‌లో 2020లో 57.29శాతం, 2015లో 56.91శాతం పోలింగ్‌శాతం నమోదైంది.