Share News

ఎగ్జిట్‌పోల్స్‌లో సర్వే సంస్థల అంచనా.. అసోంలో బీజేపీకి హ్యాట్రిక్‌ విజయం..

ABN , Publish Date - Apr 30 , 2026 | 05:43 AM

దశాబ్దాలపాటు కమ్యూనిస్టుల పాలనలో, గత 15 ఏళ్లుగా తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినాయకురాలు మమతా బెనర్జీ పాలనలో ఉన్న పశ్చిమ బెంగాల్‌ మీద తమ...

ఎగ్జిట్‌పోల్స్‌లో సర్వే సంస్థల అంచనా.. అసోంలో బీజేపీకి హ్యాట్రిక్‌ విజయం..

కాషాయపార్టీ తొలిసారి ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం

ఎగ్జిట్‌పోల్స్‌లో సర్వే సంస్థల అంచనా.. అసోంలో బీజేపీకి హ్యాట్రిక్‌ విజయం

తమిళనాడులో స్టాలిన్‌కే మళ్లీ పట్టం.. హంగ్‌ వస్తే కింగ్‌మేకర్‌గా విజయ్‌!

కేరళ పగ్గాలు కాంగ్రెస్‌ సారథ్యంలోని యూడీఎఫ్ కు

పుదుచ్చేరి మళ్లీ ఎన్డీయేదే!

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): దశాబ్దాలపాటు కమ్యూనిస్టుల పాలనలో, గత 15 ఏళ్లుగా తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినాయకురాలు మమతా బెనర్జీ పాలనలో ఉన్న పశ్చిమ బెంగాల్‌ మీద తమ జెండాను ఎగురవేయాలన్న బీజేపీ లక్ష్యం ఈసారి దాదాపుగా నెరవేరినట్లేనని తెలుస్తోంది. బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని పలు సర్వే సంస్థలు వెల్లడించాయి. బుధవారం బెంగాల్‌లో రెండో దశ ఎన్నికలు ముగియటంతో మొత్తం నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ పర్వం పూర్తయ్యింది. దీంతో పలు మీడియా, సర్వే సంస్థలు ఎగ్జిట్‌పోల్స్‌ను విడుదల చేశాయి. అసోంలో బీజేపీ హ్యాట్రిక్‌ సాధిస్తుందని, తమిళనాడులో డీఎంకే పట్టు నిలుపుకొని వరుసగా రెండోసారి స్టాలిన్‌ నేతృత్వంలో విజయం సాధించనుందని, కేరళలో వామపక్ష కూటమి ఎల్డీఎఫ్‌ గద్దె దిగి కాంగ్రెస్‌ సారథ్యంలోని యూడీఎఫ్‌ కూటమి పగ్గాలు చేపట్టనుందని తెలిపాయి. పుదుచ్చేరిలో మళ్లీ ఎన్డీఏ కూటమికే అధికారమని పేర్కొన్నాయి. పశ్చిమ బెంగాల్‌లో 294 అసెంబ్లీ స్థానాలుండగా మ్యాజిక్‌ ఫిగర్‌ 148. ఆ రాష్ట్రంలో బీజేపీ 142 నుంచి 150 సీట్ల వరకూ గెల్చుకొని మొట్టమొదటిసారిగా అధికారంలోకి రానుందని పలు సర్వే సంస్థలు తెలిపాయి. బీజేపీ 146-161 సీట్లు గెలుచుకుంటుందని, టీఎంసీకి 125-140 సీట్లు వస్తాయని మ్యాట్రిజ్‌ సంస్థ వెల్లడించింది. బీజేపీకి 150-175 సీట్లు, టీఎంసీకి 118-138 సీట్లు లభిస్తాయని పీ-మార్క్‌ సంస్థ తెలిపింది. బీజేపీ 142-171 సీట్ల మధ్య గెలుచుకుని బెంగాల్‌లో అధికారంలోకి వస్తుందని, టీఎంసీకి 99-167 సీట్ల మధ్య లభిస్తాయని పోల్‌ డైరీ వెల్లడించింది. అయితే పీపుల్స్‌ పల్స్‌, జన్‌మత్‌ సంస్థలు తృణమూల్‌ 177-205 సీట్లు గెలుచుకుని మళ్లీ అధికారంలోకి వస్తుందని తెలిపాయి. మరోవైపు, తమిళనాడులో మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్‌ డీఎంకే కూటమి అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. ఈ రాష్ట్రంలో మొత్తం సీట్లు 234 కాగా.. కనీస మెజారిటీ 118. చాణక్య స్ట్రాటజీస్‌, పీపుల్స్‌ పల్స్‌, పీపుల్స్‌ ఇన్‌సైట్‌, ప్రజాపోల్‌, పీ-మార్క్‌, మ్యాట్రిజ్‌ సంస్థలు డీఎంకే, మిత్రపక్షాలు 120-168 సీట్ల మధ్య గెలుచుకుంటాయని పేర్కొన్నాయి. అన్నాడీఎంకే, మిత్రపక్షాలు 60-100 సీట్ల వరకు గెలుచుకోవచ్చని వెల్లడించాయి. సినీనటుడు విజయ్‌ ప్రభావం పెద్దగా ఉండబోదని సర్వే సంస్థలు తేల్చిచెప్పాయి. విజయ్‌కు 20 స్థానాలలోపే దక్కుతాయని పేర్కొన్నాయి. ఎన్‌డీటీవీ -యాక్సిస్‌ మై ఇండియా సంస్థ మాత్రం విజయ్‌ నేతృత్వంలోని టీవీకే 98-120 సీట్లతో కింగ్‌మేకర్‌గా మారుతుందని, స్వయంగా అధికారంలోకి కూడా రావచ్చని తెలిపింది. రాష్ట్రంలో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడుతుందని అంచనా వేసింది. కామాఖ్య ఎనలిటిక్స్‌ అనే సంస్థ కూడా 67-81 సీట్లతో టీవీకే కీలకపాత్ర పోషించనున్నట్లు తెలిపింది.


కేరళలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌?

మరో దక్షిణాది రాష్ట్రం కేరళలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ సారథ్యంలోని యూడీఎఫ్‌ కూటమి అధికారంలోకి రానుందని దాదాపుగా అన్ని సర్వే సంస్థలూ తెలిపాయి. ఈ రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 140 కాగా అధికారం చేపట్టాలంటే కనీసం 71 గెల్చుకోవాలి. యూడీఎఫ్‌ 75-90 స్థానాలు గెలుస్తుందని, అఽధికార ఎల్డీఎఫ్‌ 49-68 స్థానాలకు పరిమితమవుతుందని సర్వే సంస్థలు అంచనా వేశాయి. బీజేపీకి మూడు నుంచి ఐదు సీట్లకు మించి రాకపోవచ్చని పేర్కొన్నాయి. కేంద్రపాలితప్రాంతం పుదుచ్చేరిలో (మొత్తం సీట్లు 30, మెజారిటీ సంఖ్య 16) ఎన్సార్సీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి ముందంజలో ఉందని, అధికారం మళ్లీ ఆ కూటమిదేనని పలు సర్వే సంస్థలు వెల్లడించాయి. అయితే, విజయ్‌ పార్టీ టీవీకే పుదుచ్చేరిలో కూడా ఉనికిని చాటుకుంటుందని, నాలుగు సీట్ల వరకూ గెల్చుకోవచ్చని అంచనా వేశాయి. ఈశాన్య రాష్ట్రం అస్సాంలో బీజేపీ ప్రభంజనం వీస్తుందని అన్ని సర్వే సంస్థలూ తేల్చి చెప్పాయి. ఆ రాష్ట్రంలో 126 అసెంబ్లీ స్థానాలుండగా మెజారిటీ మార్కు 64. యాక్సిస్‌ మై ఇండియా, జన్‌మత్‌ పోల్స్‌, జేవీసీ, చాణక్య స్ట్రాటజీస్‌, పీపుల్‌ పల్స్‌, పల్స్‌ టుడే, సాస్‌ గ్రూప్‌, బెంచ్‌మార్క్‌ సర్వే తదితర సంస్థలు బీజేపీ 87-101 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేశాయి. కాంగ్రెస్‌ 23-36 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని వెల్లడించాయి.

ఈ వార్తలు కూడా చదవండి:

అనంతపురం మీదుగా తిరుపతికి రైలు

రైలులో మహిళపై దారుణం.. ఏసీ కోచ్‌లోకి తీసుకెళ్లి..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 30 , 2026 | 06:02 AM