Share News

ముగిసిన బెంగాల్‌ ఎన్నికలు

ABN , Publish Date - Apr 30 , 2026 | 05:49 AM

పశ్చిమ బెంగాల్‌లో బుధవారం రెండో దశ పోలింగ్‌తో ఎన్నికలు ముగిశాయి. తొలిదశతో (93.19 శాతం ) పోటీ పడుతూ ఈ దశలో కూడా భారీగా 91.66 శాతం నమోదైంది. రెండు దశల్లో కలిపి 92.47 శాతం పోలింగ్‌ జరిగిందని...

ముగిసిన బెంగాల్‌ ఎన్నికలు

రెండో దశలో 91.66 శాతం పోలింగ్‌.. నాలుగోసారీ అధికారం మాదే: తృణమూల్‌

కోల్‌కతా, ఏప్రిల్‌ 29: పశ్చిమ బెంగాల్‌లో బుధవారం రెండో దశ పోలింగ్‌తో ఎన్నికలు ముగిశాయి. తొలిదశతో (93.19ు) పోటీ పడుతూ ఈ దశలో కూడా భారీగా 91.66 శాతం నమోదైంది. రెండు దశల్లో కలిపి 92.47 శాతం పోలింగ్‌ జరిగిందని ఎన్నికల సంఘం ప్రకటించింది. స్వాతంత్ర్యానంతరం పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఎన్నికల్లో ఇదే అత్యధికమని తెలిపింది. ఈ నెల 23వ తేదీన తొలి విడత పోలింగ్‌ బీజేపీకి గట్టి పట్టున్న ఉత్తర బెంగాల్‌లో జరగగా.. మలి విడత తృణమూల్‌కు పట్టున్న దక్షిణ బెంగాల్‌లో జరిగింది. రెండో దశ ఎన్నికలు జరిగిన 142 నియోజకవర్గాల్లో ఏకంగా 123 తృణమూల్‌ సిట్టింగ్‌ స్థానాలు కావటం విశేషం. భారీగా నమోదైన పోలింగ్‌ తమకు అనుకూలం అంటే తమకు అనుకూలం అని వైరిపక్షాలు రెండూ ప్రకటించుకున్నాయి. మమత ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ పథకాలతో తమకు తిరిగి పట్టం కట్టటానికి ఓటర్లు భారీ ఎత్తున తరలివచ్చారని తృణమూల్‌ పేర్కొనగా.. ఇది మమత ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు అని, అధికారంలోకి తామే రాబోతున్నామని బీజేపీ తెలిపింది. 71 ఏళ్ల మమతా బెనర్జీ వరుసగా మూడుసార్లు తృణమూల్‌ కాంగ్రె్‌సను అధికారంలోకి తీసుకొచ్చి గత 15 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈసారి గెలిస్తే నాలుగోసారి విజయం సాధించినట్లవుతుంది.

0000000-Sliders.jpg

సీఆర్‌పీఎఫ్‌ బలగాలపై మమత ధ్వజం

ఎప్పుడూ మధ్యాహ్నం వేళల్లో పోలింగ్‌బూత్‌కు వెళ్లి ఓటు వేసే మమత ఈసారి అందుకు భిన్నంగా బుధవారం ఉదయం 8 గంటలకే తాను పోటీ చేస్తున్న భవానీపూర్‌ నియోజకవర్గంలో ఓ పోలింగ్‌బూత్‌కు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. విధుల్లో ఉన్న సీఆర్‌పీఎఫ్‌ బలగాలు తమను పోలింగ్‌ బూత్‌ల వద్ద ఉండకుండా చెదరగొడుతున్నారన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల ఫిర్యాదుల మేరకు పలు బూత్‌ల పరిధిలో మమత పర్యటించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ, బెంగాల్‌లో ఎన్నికల కోసం ఎన్నికల సంఘం భారీ ఎత్తున మోహరించిన సీఆర్‌పీఎఫ్‌ దళాల పనితీరుపై విరుచుకుపడ్డారు. రెండో దశ పోలింగ్‌కు ముందురోజు రాత్రి నుంచి తమ పార్టీ కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్నారని, కోర్టు ఆదేశాలున్నా లెక్కచేయకుండా అరెస్టులు చేశారని ఆరోపించారు. అనేక నియోజకవర్గాల్లో పోలింగ్‌ బూత్‌ల వద్ద లాఠీచార్జీ జరిపి మహిళలు, వృద్ధులు, పిల్లల మీద కూడా చేయి చేసుకున్నారని తెలిపారు. పోలింగ్‌బూత్‌ల వద్ద రాష్ట్ర పోలీసులకు డ్యూటీలు ఇవ్వకుండా.. అన్ని బూత్‌లను సీఆర్‌పీఎఫ్‌ దళాలే ఆక్రమించాయని, ఏ ఒక్క బూత్‌ కూడా సురక్షితంగా లేదన్నారు. కేంద్ర బలగాలను ఉపయోగించి బెంగాల్‌ ఎన్నికల్ని రిగ్గింగ్‌ చేయాలని బీజేపీ కుట్రలు చేస్తోందని, ప్రజాస్వామ్యంలో ఇటువంటి ఘటనలు తాను ఎన్నడూ చూడలేదని చెప్పారు. బీజేపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా మళ్లీ తామే గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.


ఈవీఎంలపై టేప్‌!

భవానీపూర్‌లో మమతపై బీజేపీ నుంచి ఆ పార్టీ కీలక నేత సువేందు అధికారి బరిలో ఉన్నారు. ఓ పోలింగ్‌ బూత్‌ వద్ద మమత ఉన్నప్పుడు సువేందు కూడా అక్కడికి వచ్చారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు, ఫాల్తా అనే నియోజకవర్గంలోని మూడు పోలింగ్‌బూత్‌లలో ఈవీఎంలపై బీజేపీ, సీపీఎం అభ్యర్థుల పేర్లు, ఎన్నికల చిహ్నలు కనిపించకుండా టేప్‌ అతికించారని బీజేపీ ఐటీ విభాగం అధిపతి, ఆ పార్టీ బెంగాల్‌ ఇంచార్జి అమిత్‌ మాలవీయ ఆరోపించారు. ఈ మేరకు ఆన్‌లైన్‌లో కొన్ని వీడియోలు కూడా కనిపించాయి. మరికొన్ని బూత్‌లలో ఈవీఎంలపై తన పేరుకు సంబంధించిన బటన్‌ పని చేయలేదని బీజేపీ అభ్యర్థి ఆరోపించారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ స్పందిస్తూ.. ఈ ఆరోపణల మీద విచారణ జరిపిస్తామని, వాస్తవమని తేలితే రీపోలింగ్‌కు ఆదేశాలు జారీ చేస్తామన్నారు.

ఎస్‌ఐఆర్‌ ప్రభావం

బెంగాల్‌లో చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా.. దక్షిణ బెంగాల్‌లోని పలు నియోజకవర్గాల్లో కొన్ని లక్షల మంది పేర్లను ఈసీ తొలగించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 25 స్థానాల్లో విజేతలకు లభించిన మెజారిటీ కన్నా ఈసారి అక్కడ తొలగించిన ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ఈసారి ఫలితాల అనంతరం విజేతల మెజారిటీ చాలా తక్కువగానే ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4వ తేదీన వెలువడనున్నాయి. కాగా, పశ్చిమ బెంగాల్‌ ఓటర్లు ఈసారి నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ప్రధాని మోదీ తెలిపారు. తుదిదశ పోలింగ్‌లో భారీ సంఖ్యలో ఓటర్లు పాల్గొనడాన్ని ఆయన ప్రస్తావించారు.

ఎగ్జిట్‌ పోల్స్‌

తమిళనాడు(మొత్తం సీట్లు 234, మ్యాజిక్‌ మార్కు 118)

సర్వే సంస్థ డీఎంకే+ ఏఐడీఎంకే+ టీవీకే+

యాక్సిస్‌ మై ఇండియా 92-110 22-23 98-120.

జేవీస 75-95 128-147 8-15

కామాఖ్య అనలిటిక్స్‌ 78-95 68-84 67-81

మాట్రిజ్‌ 122-132 87-100 10-12

పీ-మార్క్‌ 125-145 65-85 16-26

పీపుల్స్‌ ఇన్‌సైట్‌ 120-140 60-70 30-40

పీపుల్‌ పల్స్‌ 125-145 65-80 18-24

ప్రజా పోల్‌ 148-168 61-81 1-9

పోల్‌ ఆఫ్‌ పోల్స్‌ 120 77 36

పశ్చిమ బెంగాల్‌(మొత్తం సీట్లు 294, మ్యాజిక్‌ మార్కు 148)

సర్వే సంస్థ టీఎంసీ+ బీజేపీ+ కాంగ్రెస్‌+ లెఫ్ట్‌

జన్‌మత్‌ పోల్స్‌ 195-205 80-90 1-3 0-1

జేవీసీ 131-152 138-159 0-2 0-1

మాట్రిజ్‌ 125-140 146-161 0-0 0-0

పీ మార్క్‌ 118-138 150-175 0-0 0-1

పీపుల్స్‌ పల్స్‌ 177-187 95-110 1-3 0-1

పోల్‌ ఆఫ్‌ పోల్స్‌ 142 143 1 1

పుదుచ్చేరి(మొత్తం సీట్లు 30, మ్యాజిక్‌ మార్కు 16)

సర్వే సంస్థ ఎన్‌ఆర్‌సీ+ కాంగ్రెస్‌+ టీవీకే+ ఇతరులు

యాక్సిస్‌ మై ఇండియా 16-20 6-8 2-4 1-3

కామాఖ్య అనలిటిక్స్‌ 17-24 4-7 1-2 0-1

పీపుల్స్‌ పల్స్‌ 16-19 10-12 0-0 1-2

ప్రజా పోల్‌ 19-25 6-10 0-0 0-0

పోల్‌ ఆఫ్‌ పోల్స్‌ 20 8 1 1

కేరళం(మొత్త సీట్లు 140, మ్యాజిక్‌ మార్కు 71)

సర్వే సంస్థ ఎల్డీఎఫ్‌ యూడీఎఫ్‌ బీజపీ+ ఇతరులు

యాక్సిస్‌ మై ఇండియా 49-62 78-90 0-3 0-0

పీపుల్స్‌ ఇన్‌సైట్‌ 58-68 66-76 10-14 0-1

పీపుల్స్‌ పల్స్‌ 55-65 75-85 0-3 0-0

పోల్‌ ఆఫ్‌ పోల్స్‌ 60 75 4 1


అస్సాం(మొత్తం సీట్లు 126, మ్యాజిక్‌ మార్కు 64)

సర్వే సంస్థ బీజేపీ కాంగ్రెస్‌ ఏఐయూడీఎఫ్‌+ ఇతరులు

యాక్సిస్‌ మై ఇండియా 88-100 24-36 0-0 0-3

జన్‌మత్‌ పోల్స్‌ 87-98 29-30 0-0 0-0

జేవీసీ 88-101 23-33 2-5 0-0

పోల్‌ ఆఫ్‌ పోల్స్‌ 92 29 1 4

ఎగ్జిట్‌పోల్స్‌ పోల్‌ ఆఫ్‌ ద పోల్స్‌ ఫలితాలు

తమిళనాడు డీఎంకే+ అన్నాడీఎంకే+ టీవీకే+

120 77 36

బెంగాల్‌ టీఎంసీ+ బీజేపీ+ కాంగ్రెస్‌+

142 143 1

కేరళ ఎల్డీఎఫ్‌ యూడీఎఫ్‌ బీజేపీ+

60 75 4

అస్సాం బీజేపీ కాంగ్రెస్‌

92 29

పుదుచ్చేరి ఎన్‌ఆర్‌సీ+ కాంగ్రెస్‌+ టీవీకే+

20 8 1

ఈ వార్తలు కూడా చదవండి:

అనంతపురం మీదుగా తిరుపతికి రైలు

రైలులో మహిళపై దారుణం.. ఏసీ కోచ్‌లోకి తీసుకెళ్లి..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 30 , 2026 | 05:57 AM