Share News

బీసీఐ చైర్మన్ మిశ్రా రాజీనామా చేయాలి: కో చైర్మన్ సదాశివరెడ్డి డిమాండ్

ABN , Publish Date - Aug 22 , 2026 | 03:59 PM

ఆర్థిక అవకతవకలతోపాటు ఇతర ఆరోపణల నేపథ్యంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) చైర్మన్ పదవికి మనన్ కుమార్ మిశ్రా వెంటనే రాజీనామా చేయాలని బీసీఐ కో చైర్మన్, సీనియర్ న్యాయవాది వైఆర్ సదాశివ రెడ్డి డిమాండ్ చేశారు.

బీసీఐ చైర్మన్ మిశ్రా రాజీనామా చేయాలి: కో చైర్మన్ సదాశివరెడ్డి డిమాండ్
BCI Chairman Manan Mishra

న్యూఢిల్లీ, ఆగస్టు 22: ఆర్థిక అవకతవకలతోపాటు ఇతర ఆరోపణల నేపథ్యంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) చైర్మన్ పదవికి మనన్ కుమార్ మిశ్రా వెంటనే రాజీనామా చేయాలని బీసీఐ కో చైర్మన్, సీనియర్ న్యాయవాది వైఆర్ సదాశివ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ రాజ్యాంగ పదవికి వెంటనే రాజీనామా చేయాలంటూ ఎం.కె. మిశ్రాకు ఆయన స్పష్టం చేశారు. శనివారం బీసీఐ చైర్మన్‌కు సదాశివరెడ్డి లేఖ రాశారు. ఆ లేఖలో ఆయనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన ఎనిమిది అంశాలను సదాశివరెడ్డి వివరించారు.


బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టబద్ధమైన సంస్థ అని సదాశివ రెడ్డి గుర్తు చేశారు. ఈ సంస్థను మిశ్రా తన వ్యక్తిగత ఆస్తిగా భావించారని ఆరోపించారు. ఈ సంస్థను ఉద్దేశపూర్వకంగానే నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. అందులో భాగంగానే మిశ్రా ఎంపిక చేసిన ట్రస్టీలతో బీసీఐ ట్రస్ట్ పెర్ల్ ఫస్ట్ అనే కొత్త ట్రస్టును 2020, సెప్టెంబర్‌లో రిజిస్టర్ చేయించారని విమర్శించారు. అనంతరం బార్ కౌన్సిల్‌ నిధులను భారీగా ఈ ట్రస్ట్‌కు బదిలీ చేసేందుకు తీర్మానం చేశారని గుర్తు చేశారు. కానీ ఈ తీర్మానాన్ని తనతోపాటు ఇతర సభ్యుల అభ్యంతరం చెప్పామన్నారు. కానీ వాటిని ఆయన తోసిపుచ్చారని వివరించారు.


బీసీఐ అప్రూవల్, రెన్యువల్ కోసం న్యాయ కళాశాలలు చాలా పెద్ద మొత్తంలో నగదు చెల్లించవలసి వస్తుందని బీసీఐ కో చైర్మన్ సదాశివరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా బీసీఐ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొవలసి వస్తుందని అన్నారు. కౌన్సిల్‌తోపాటు న్యాయ విద్యాసంస్థల్లో ఎం.కె. మిశ్రా బంధువులు, అయినవారే ఉన్నారని ఆరోపించారు. ఆయా సంస్థల్లో నియామకాల కోసం ఒక్క ప్రకటన వెలువడలేదన్నారు.


అలాగే బీసీఐ కౌన్సిల్ ముందుకు ఒక్క నియామక పత్రం కూడా రాలేదని చెప్పారు. ఈ దేశ ప్రతినిధులు తనపై ఉంచిన నమ్మకాన్ని తాను నిర్లక్ష్యం చేస్తే అది నిష్పలమవుతుందన్నారు. ఈ లేఖను తాను తీవ్ర వేదనతో రాసినట్లు సీనియర్ న్యాయవాది సదాశివరావు తెలిపారు. అయితే పాలక నిబంధనలు ఉల్లంఘించిన మిశ్రా పదవీకాలం దశాబ్దానికి పైగా కొనసాగిందని ఆరోపిస్తూ.. ఆయన బీసీఐ చైర్మన్‌గా కొనసాగడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో ఈ లేఖను విడుదల చేశారు.

Updated Date - Aug 22 , 2026 | 04:18 PM