రుతుపవనాల్లో మళ్లీ కదలిక!
ABN , Publish Date - Jul 15 , 2026 | 06:13 AM
ఎల్‌నినో ప్రభావంతో భారత్‌లో ప్రస్తుతం వర్షాకాలం కూడా వేసవిని తలపిస్తోంది. కొద్ది రోజులుగా తీవ్రమైన ఎండ, ఉక్కపోత అల్లాడిస్తున్నాయి. రుతుపవనాలు నిస్తేజంగా మారడమే దీనికి కారణం. అయితే..
బంగాళాఖాతంలో కొత్త వాతావరణ పరిస్థితులు
త్వరలో అల్పపీడనం.. విస్తారంగా వర్షాలు?
న్యూఢిల్లీ, జూలై 14: ఎల్‌నినో ప్రభావంతో భారత్‌లో ప్రస్తుతం వర్షాకాలం కూడా వేసవిని తలపిస్తోంది. కొద్ది రోజులుగా తీవ్రమైన ఎండ, ఉక్కపోత అల్లాడిస్తున్నాయి. రుతుపవనాలు నిస్తేజంగా మారడమే దీనికి కారణం. అయితే.. దేశవ్యాప్తంగా పొడి వాతావరణం నెలకొన్న తరుణంలో.. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న కొత్త వాతావరణ పరిస్థితులు రుతుపవనాలకు కొత్త ఊపిరిలూదుతూ.... వర్షాలపై ఆశలు రేపుతున్నాయి. పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడిన కొన్ని వాతావరణ పరిస్థితులు బంగాళాఖాతం వైపునకు పయనిస్తున్నాయి. వీటి ప్రభావంతో దేశంలో కొంతకాలంగా బలహీనపడిన రుతుపవనాలు మళ్లీ పుంజుకోనున్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో జరుగుతున్న ఈ మార్పుల వల్ల సముద్రపు గాలులు బలంగా వీస్తూ, దట్టమైన మేఘాలు అలముకుంటున్నాయి. రెండు, మూడు రోజుల్లో ఈ పరిస్థితి మరింత బలపడి అల్పపీడనంగా మారనుంది. ఈ అల్పపీడనం క్రమంగా ఒడిశా, పశ్చిమబెంగాల్ వైపు పయనించి తూర్పు భారతంలో విస్తారంగా వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత దీని ప్రభావం మధ్య, ఉత్తర భారతంపైనా ఉంటుంది. దీంతో తూర్పు, మధ్య, ఉత్తర భారతంలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ రుతుపవనాల సీజన్‌లో బంగాళాఖాతంలో రెండో అల్పపీడనం ఏర్పడుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఈ పరిస్థితి ఇప్పటికే బలహీనపడిన రుతుపవనాలకు కొత్త ఊతమిస్తుందని తెలిపింది. ఈ అల్పపీడనం రుతుపవనాలను మరింత చురుకుగా కదిలేలా చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు విస్తరిస్తుందనేది దాని బలం, మార్గం, తీవ్రత, కాలపరిమితిపై ఆధారపడి ఉంటుందని భావిస్తున్నారు. వాస్తవానికి బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడన పరిస్థితులు.. పశ్చిమ పసిఫిక్‌లో వాతావరణ అవాంతరాల వల్ల ఏర్పాడ్డాయి. దీనివల్ల తైవాన్‌ను దాటుకుని దక్షిణ చైనా మీదుగా వెళ్లిన బావి తుఫాన్.. కొరియా తీరంవైపు కదులుతూ ఆ ప్రాంతంలో భారీ వర్షాలకు కారణమవుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి
తిరుగుబాటు ఎంపీలకు శివసేన ( (UBT) లీగల్ నోటీసులు
రామ్ మందిర్ సీఈఓ రేసులో మాజీ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్!