బ్యాంకులకు ఎండీఆర్ పంట
ABN , Publish Date - Sep 18 , 2026 | 03:32 AM
యూపీఐ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) విఽధింపు బ్యాంకులు, యూపీఐ యాప్స్, ఆర్థిక సంస్థలకు లాభాల పంట పండించనుందని తెలుస్తోంది. రూ.2,000 పైన చేసే చెల్లింపులకు 0.4 శాతం ఎండీఆర్ చార్జీలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే.
ఏటా ఎండీఆర్ చార్జీల రాబడి 15,000 కోట్లు.. ఇదంతా బ్యాంకులు, యూపీఐ యాప్స్, ఆర్థిక సంస్థలకే
యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్ చార్జీలు సరైన నిర్ణయం అంటున్న ఆర్థికశాఖ
వాణిజ్య బ్యాంకుల లాభాల్లో
ఇవి 4 శాతమేనని వెల్లడి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 17: యూపీఐ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) విధింపు బ్యాంకులు, యూపీఐ యాప్స్, ఆర్థిక సంస్థలకు లాభాల పంట పండించనుందని తెలుస్తోంది. రూ.2,000 పైన చేసే చెల్లింపులకు 0.4 శాతం ఎండీఆర్ చార్జీలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ మొత్తం చార్జీల విలువ ఏటా రూ.15,000 కోట్లకు పైగానే ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ అధికారులను ఉటంకిస్తూ ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తా సంస్థ పేర్కొంది. ఈ మొత్తాన్ని బ్యాంకులు, యూపీఐ యాప్స్, యూపీఐ పేమెంట్స్‌తో సంబంధం ఉన్న ఇతర ఆర్థిక సంస్థలే పంచుకుంటాయని ఆ అధికారులు తెలిపారు. యూపీఐ చార్జీలపై విధించే జీఎస్టీ కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుండగా.. చార్జీల రూపంలో వచ్చే రాబడి మాత్రం ఆయా ఆర్థిక సంస్థలకే చెందుతుంది. రూ.2,000 లోపు చెల్లింపులపై ఎండీఆర్ ఉండదని, మొత్తం యూపీఐ చెల్లింపుల్లో 96 శాతం ఇవే ఉంటున్నాయని కేంద్రం చెబుతోంది. అయితే, 4 శాతమే ఉంటున్న రూ.2,000లకు మించిన యూపీఐ చెల్లింపుల విలువ మొత్తం యూపీఐ లావాదేవీల విలువలో ఏకంగా 67 శాతం ఉంటోందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఉదాహరణకు ఈ ఏడాది ఆగస్టులో దేశంలో 2,451 కోట్ల యూపీఐ లావాదేవీలు నమోదయ్యాయి. వీటి మొత్తం విలువ రూ.29.9 లక్షల కోట్లు. ఈ రూ.29.9 లక్షల కోట్లలో రూ.2,000లకు పైన విలువైన లావాదేవీల మొత్తమే 67ు... అంటే రూ.20 లక్షల కోట్లకుపైగా ఉంది. ప్రభుత్వం దీనిపైనే ఎండీఆర్ విధించటంతో ఆర్థిక సంస్థలు భారీగా లాభపడనున్నాయని ఆర్థికవేత్తలు అంటున్నారు.
బ్యాంకుల లాభాలతో పోల్చితే
ఇది తక్కువ మొత్తమే: కేంద్రం
ఎండీఆర్ చార్జీల రూపంలో ఆర్థిక సంస్థలకు భారీగా లాభాలు వస్తాయన్న వాదన ను కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు తోసిపుచ్చారు. దేశంలోని స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయిన మొత్తం వాణిజ్య బ్యాంకుల వార్షిక లాభాలతో పోల్చితే ఈ మొత్తం 4 శాతమేనని ఒక అధికారి తెలిపారు. దేశంలోనే పెద్ద బ్యాంకులైన ఎస్‌బీఐ, హెచ్‌డీఎ్‌ఫసీ, ఐసీఐసీఐ బ్యాంకులు 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.2.13 లక్షల కోట్ల లాభాలను ఆర్జించాయని.. ఎండీఆర్ చార్జీల ద్వారా వచ్చే ఆదాయం ఇందులో కేవలం 7 శాతానికి సమానమని చెప్పారు. ఎండీఆర్ చార్జీల విధింపు సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయమని ఆ అధికారి పేర్కొన్నారు. ఈ విధానపరమైన మార్పుతో యూపీఐ విధానంలో సమూల మార్పులు రాబోతున్నాయని చెప్పారు. 2020కి ముందు పర్సన్ టు మర్చంట్ (పీ2ఎం) లావాదేవీలపై ఎండీఆర్ 0.30 శాతం ఉండేది. యూపీఐ వినియోగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ఆ ఏడాది జనవరిలో కేంద్రం ఈ చార్జీలను ఎత్తేసింది. ఈ నిర్ణయంతో దేశంలో యూపీఐ లావాదేవీలు అసాధారణ రీతిలో పెరిగాయి. ఇప్పుడు మళ్లీ చార్జీలు విధించటంతో యూపీఐ లావాదేవీలు తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
స్టాండింగ్ కమిటీలోఎండీఆర్‌పై చర్చించనే లేదు: కాంగ్రెస్
యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్ విధించే అంశంపై ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘంలో గతంలోనే చర్చించామని, అందులో సభ్యులుగా ఉన్న ఐదుగురు కాంగ్రెస్ నేతలు అందుకు అంగీకరించారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ కమిటీలో కాంగ్రెస్ నేతలు పీ చిదంబరంతోపాటు మనీశ్‌తివారీ, గౌరవ్‌గొగోయ్, కిషోర్‌లాల్, కే గోపీనాథ్ సభ్యులుగా ఉన్నారు. ఆగస్టు 12న ఈ కమిటీ నివేదిక ఇచ్చింది. ఎండీఆర్ చార్జీలపై సభ్యులు అభ్యంతరం తెలిపినట్లు ఈ నివేదికలో ఎక్కడా లేదని కేంద్రం పేర్కొంది. దీనిపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎండీఆర్ అంశం స్టాండింగ్ కమిటీలో ఎప్పుడూ చర్చకే రాలేదని గౌరవ్ గొగోయ్, మనీశ్ తివారీ గురువారం స్పష్టంచేశారు. ఇంత ముఖ్యమైన అంశంపై పార్లమెంటులో ఎలాంటి చర్చ లేకుండానే మోదీ సర్కారు సొంతంగా నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ఎండీఆర్ చార్జీల విధింపుపై ప్రజల నుంచి వస్తున్న విమర్శల నుంచి తప్పించుకొనేందుకే తమకు అందులోకి లాగుతోందని మండిపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి
కేసీఆర్ కుటుంబ ఆస్తులపై విచారణ జరగాల్సిందే.. టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్