బంగ్లాదేశ్‌లో హిందువుల నిరసన.. ఢాకాలో భారీ ర్యాలీ
ABN , Publish Date - Jun 20 , 2026 | 12:19 PM
బంగ్లాదేశ్‌లో హిందువులు శుక్రవారం పెద్ద ఎత్తున నిరసనకు తెరతీశారు. శ్రీరాముడి చిత్రాన్ని అవమానించారంటూ ఢాకాలో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్‌లో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగాయి. శ్రీరాముడి చిత్రంపై చెప్పు ఉంచి తమ మతవిశ్వాసాలను అవమానించారంటూ రాజధాని ఢాకాలో హిందువులు కాగడాలు, కొవ్వొత్తులతో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. జై శ్రీరామ్ అంటూ పెద్ద ఎత్తున నినదించారు. ఉత్తర గాయిబంద జిల్లాలో శ్రీశ్రీ రాధాగోవింద దేవాలయ కమిటీ 81 అడుగుల శ్రీరాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు రంగంలోకి దిగింది. అయితే, అతివాదుల నుంచి బెదిరింపులు రావడంతో కార్యక్రమం వాయిదా పడింది. ఈ నేపథ్యంలో తాజాగా కొందరు అవమానకర చర్యలకు దిగడంతో పరిస్థితి మరోసారి ఉద్రిక్తంగా మారినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో ఢాకాలో వేల మంది హిందువులు నిరసనకు దిగారు. పలు హిందూ సంఘాల ఆధ్వర్యంలో జై శ్రీరామ్ అని నినదిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు.
ర్యాలీకి తరలి రావాలన్న హిందూ మహాజ్యోత్ సంస్థ పిలుపు మేరకు శుక్రవారం సామాన్య ప్రజలు, ఇతర హిందూ సంఘాలు షహబాగ్ కూడలికి పెద్ద సంఖ్యలో వచ్చారు. అక్కడి నుంచి నేషనల్ ప్రెస్ క్లబ్ వరకూ ర్యాలీగా వెళ్లారు. ప్రెస్‌క్లబ్ ముందు భారీ మానవహారంతో నిరసన తెలిపారు. మరికొంత మంది ఢాకా రిపోర్టర్స్ యూనిటీ భవనం ముందు నిరసన చేపట్టారు. రంగపూర్‌లో నిరసన తెలిపిన వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. మైనారిటీలు ఇన్ని ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం మౌనంగా ఉంటోందని నిరసనకారులు ఆరోపించారు. తమ మతవిశ్వాసాలను అవమానించిన వారిని 72 గంటల్లోగా అరెస్టు చేయాలని అల్టిమేటమ్ జారీ చేశారు. లేని పక్షంలో నిరసనలు మరింత తీవ్రమవుతాయని హెచ్చరించారు.
ఈ వార్తలనూ చదవండి:
విద్యార్థి నాగ్‌పూర్‌లో.. నీట్ పరీక్ష కేంద్రం యూఏఈలో..
హీరోయిన్ రుక్మిణి వసంత్ ఫిర్యాదు.. ముగ్గురి అరెస్ట్..