Share News

బంగ్లాదేశ్‌లో హిందూ కుటుంబం హత్య

ABN , Publish Date - Aug 24 , 2026 | 06:54 AM

బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్‌లో ఓ హిందూ రిటైర్డ్‌ టీచర్‌ కుటుంబం దారుణ హత్యకు గురైంది. తన ఇంటి పైకప్పుపై డ్రగ్స్‌ తీసుకుంటున్న వారిని ప్రశ్నించినందుకు నలుగురు...

బంగ్లాదేశ్‌లో హిందూ కుటుంబం హత్య

నలుగురు రిటైర్డ్‌ టీచర్‌ కుటుంబ సభ్యులను చంపిన దుండగులు

  • తన ఇంటిపై డ్రగ్స్‌ తీసుకుంటుండడాన్ని ప్రశ్నించినందుకు కిరాతకం

  • 20న హత్యలు.. 22న వెలుగులోకి

రంగ్‌పూర్‌, ఆగస్టు 23: బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్‌లో ఓ హిందూ రిటైర్డ్‌ టీచర్‌ కుటుంబం దారుణ హత్యకు గురైంది. తన ఇంటి పైకప్పుపై డ్రగ్స్‌ తీసుకుంటున్న వారిని ప్రశ్నించినందుకు నలుగురు కుటుంబ సభ్యులను దుండగులు హత్య చేశారు. గురువారం (ఈ నెల 20న) రాత్రి జరిగిన ఈ హత్యలు శనివారం రాత్రి వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే.. రంగ్‌పూర్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైరైన గణపతి చక్రవర్తి(65) ఏడాది క్రితమే స్థానికంగా దస్‌పారా ప్రాంతంలో ఇల్లు నిర్మించుకొని.. భార్య ప్రీతిలత(50), కుమార్తె అగామీ(23), కుమారుడు ప్రియమ్‌(12)తో కలిసి ఉంటున్నారు. ఉద్యోగం నుంచి రిటైరయ్యాక గణపతి చక్రవర్తి హోమియోపతి వైద్యాన్ని ప్రాక్టీస్‌ చేస్తున్నారు. అయితే శనివారం (ఈ నెల 22న) ప్రీతిలత చెల్లెలు పూజ తన అక్కతో మాట్లాడేందుకు ఫోన్‌ చేయగా స్విచాఫ్‌ వచ్చింది. ఇతర కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసినా కలవకపోవడంతో సాయంత్రం పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఇంటికి వేసి ఉన్న తాళాన్ని పగలగొట్టి లోపలికి వెళ్లారు. నలుగురు కుటుంబ సభ్యులు ఇంట్లోనే హత్యకు గురైన విషయాన్ని గుర్తించారు. ఇంటి పైకప్పు మీద గణపతి మృతదేహం, భార్య ప్రీతిలత, కుమార్తె అగామీ మృతదేహాలు మెట్ల మీద, కుమారుడు ప్రియమ్‌ మృతదేహం పడక గదిలో బెడ్‌ కింద పడి ఉన్నాయి. గురువారం రాత్రి ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ముగ్దో, సిద్ధార్థ్‌ అనే ఇద్దరు వ్యక్తులను నిందితులుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. వరుసకు సోదరులైన వీరిద్దరు డ్రగ్స్‌ తీసుకునేందుకు పక్క ఇంటి మిద్దె పైనుంచి గణపతి ఇంటిపైకి చేరుకున్నారని, వీరి అలికిడిని విన్న గణపతి పైకి వెళ్లి వారిని ప్రశ్నించగా.. తమను గుర్తుపట్టారనే ఉద్దేశంతో ఆయన మెడకు టవల్‌ బిగించి హత్య చేశారని వెల్లడించారు. ఈ శబ్దం విని గణపతి భార్య ప్రీతిలత అక్కడికి వెళ్లగా ఆమెను కూడా హత్య చేశారని, అనంతరం వారి పిల్లలను కూడా చంపారని తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

అమెరికాలో భారతీయ వ్యాపారి హత్య.. నిందితుడి చిత్రాలు విడుదల..

అమెరికా ఒత్తిడికి తలవంచబోం.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు..

Updated Date - Aug 24 , 2026 | 06:54 AM