Share News

అయోధ్యలో కమీషన్లకు ఉద్యోగాలు!

ABN , Publish Date - Jul 02 , 2026 | 06:24 AM

అయోధ్య రామాలయంలో విరాళాల స్వాహాపై సిట్‌ విచారణలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. మాజీ ట్రస్టీ ఒకరు కమీషన్లు తీసుకుని ఆలయంలో ఉద్యోగులను నియమించినట్లు గుర్తించారు...

అయోధ్యలో కమీషన్లకు ఉద్యోగాలు!

విరాళాల స్వాహాపై విచారణలో వెలుగులోకి.. సిట్‌ విచారణ మరో 15 రోజులు పొడిగింపు

లక్‌నవూ, అయోధ్య, వారాణసీ, జూలై 1 : అయోధ్య రామాలయంలో విరాళాల స్వాహాపై సిట్‌ విచారణలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. మాజీ ట్రస్టీ ఒకరు కమీషన్లు తీసుకుని ఆలయంలో ఉద్యోగులను నియమించినట్లు గుర్తించారు. విరాళాల స్వాహా విషయంలో రాజీనామా చేసిన అనిల్‌ మిశ్రా అనే మాజీ ట్రస్టీ వ్యవహారాల గురించి సిట్‌ విచారణలో ఒక నిందితుడు చెప్పడం వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సుమారు 125 మంది ఉద్యోగులు మిశ్రా సిఫారసు మేరకు నియమితులయ్యారని, వీరిలో కొందరి నుంచి ఆయన కమీషన్లు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. నియమించినవారిలో ఆయన బంధువులు కూడా ఉన్నారని సమాచారం. అంతేగాక మిశ్రా పేర పలు ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన సిట్‌... ట్రస్టీగా ఉన్న సమయంలో ఆయన సమకూర్చుకున్న ఆస్తులపై దృష్టి సారించింది. అరెస్టయిన 8 మందిలోని అనుకల్ప్‌ మిశ్రా, లవ్‌ కుశ్‌ మిశ్రా పెద్దగా ఆదాయం లేకపోయినా భారీ భవంతులు నిర్మించుకున్నారని సమాచారం. వీరిద్దరు కూడా అనిల్‌ మిశ్రా బంధువులే. గత ఏడాది జరిగిన కుంభ్‌ మేళా సమయంలోనే విరాళా స్వాహా అధికంగా జరిగినట్లు విచారణలో గుర్తించారు. కుంభ మేళా సమయంలో అయోధ్య ఆలయానికి భారీ ఎత్తున విరాళాలు, ముడుపులు వచ్చాయి. నిందితులు ఇదే అదునుగా భారీగా స్వాహా చేశారని పోలీసులు చెప్పారు. ఈ కేసులో ఇప్పటి వరకు అవినాష్‌ శుక్లా, అనుకల్ప్‌ మిశ్రా, లవ్‌ కుశ్‌ మిశ్రా, మనీష్‌ కుమార్‌ యాదవ్‌, కరుణేష్‌ పాండే, రామశంకర్‌ మిశ్రా, సుభాష్‌ శ్రీవాస్తవ, రామ్‌శంకర్‌ యాదవ్‌ అలియాస్‌ టిన్ను యాదవ్‌ అనే 8 మందిని అరెస్టు చేశారు. సిట్‌ వీరిని మంగళవారం గంటల తరబడి ప్రశ్నించింది. కాగా బావ, బావ మరదులు అయిన లవ్‌ కుశ్‌ మిశ్రా, అనుకల్ప్‌ మిశ్రాలే విరాళాల్లో అత్యధిక మొత్తం స్వాహా చేసినట్లు విచారణలో గుర్తించారు. స్వాహా చేసిన మొత్తంతో వీరు ఆస్తులనూ కొనుగోలు చేశారు. ఈ ఇద్దరికి సంబంధించిన ఆరు ఆస్తులను ఇప్పటి వరకు గుర్తించారు. నిందితుల ఆర్థిక లావాదేవీలను, ఆస్తులను గుర్తించేందుకు సిట్‌ అధికారులు ఆదాయం పన్ను శాఖ సహాయాన్ని కూడా తీసుకుంటున్నారు. మరోవైపు ఈ వ్యవహారంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్బీఐ) ఉద్యోగుల ప్రమేయాన్ని కూడా పరిశీలిస్తున్నారు.


అయోధ్యలో నగదు విరాళాలను లెక్కించే పని ఎస్బీఐకి అప్పగించారు. ఎస్బీఐ ఇందుకు ఒక ప్రైవేటు ఏజెన్సీని నియమించింది. నగదు విరాళాలను 14 మంది సిబ్బంది లెక్కిస్తారు. వీరిలో 11 మంది బ్యాంకు సిబ్బంది కాగా ముగ్గురు ట్రస్ట్‌కు సంబంధించిన వారు. మరోవైపు నిందితుల ఆర్థిక లావాదేవీలు, స్వాహా చేసిన డబ్బు ఏమైందనే విషయంపై లోతుగా దర్యాప్తు చేసేందుకు సిట్‌ ఈడీకి లేఖ రాయనున్నట్లు సమాచారం. నిందితుల్లో అవినాష్‌ శుక్లా వద్దే అత్యధిక మొత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇతడి సోదరుడు అభిషేక్‌కి సంబంధించిన యోగా సెంటర్‌లో నాలుగు పెట్టెల్లో ఈ మొత్తాన్ని దాచారు. మరో నిందితుడు టిన్ను యాదవ్‌ ఇంటి నుంచి కూడా కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. అయోధ్య రామాలయంలో నగదును లెక్కించే గది తాళం ఒకటి టిన్ను యాదవ్‌ వద్ద, మరొకటి బ్యాంకు సిబ్బంది వద్ద ఉన్నట్లు సమాచారం. సిట్‌ నిందితులందరి బ్యాంకు ఖాతాల వివరాలు, స్థిర చరాస్తుల వివరాలు సేకరించింది. ఖాతాల్లో లావాదేవీలు వారి ఆదాయానికన్నా చాలా భారీగా ఉన్నట్లు గుర్తించారు. కాగా ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం సిట్‌ విచారణను జూలై 15 వరకు పొడిగించిందని యూపీ అధికారులు బుధవారం చెప్పారు. విచారణ మరింత లోతుగా జరిపేందుకు సిట్‌ గడువు కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఎస్బీఐకి సిబ్బందిని పంపించిన సెక్యూరిటీ ఏజెన్సీ అయోధ్య విరాళాల స్వాహాలో తమ పాత్ర ఏమీ లేదని పేర్కొంది. ఎస్బీఐ కోరిన సంఖ్యలో సిబ్బందిని పంపడం వరకే తమ పాత్ర అని పేర్కొంది. ఈ కేసులో అరెస్టయిన 8 మందిలో ఆరుగురు ఈ ఏజెన్సీ పంపిన వారే. ఎస్బీఐకి సిబ్బందిని పంపిన సైనిక్‌ సెక్యూరిటీ ఏజెన్సీ డైరెక్టర్‌ గౌరవ్‌ సింగ్‌ బుధవారం మాట్లాడుతూ.. ఎస్బీఐ అయోధ్య శాఖకు 22 మంది సిబ్బందిని ‘హౌస్‌ కీపింగ్‌’ పనులకు పంపినట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి...

దేశంలోనే అత్యధిక పెన్షన్ల పంపిణీలో ఏపీ రికార్డ్: ఎంపీ కేశినేని శివనాథ్

కృష్ణా తూర్పు డెల్టా కాలువలకు 3200 క్యూసెక్కుల నీరు విడుదల

Read Latest AP News And Telangana News And National News

Updated Date - Jul 02 , 2026 | 06:24 AM