Share News

విరాళాల లెక్కింపులో నా పాత్ర లేదు: రామ జన్మ భూమి ట్రస్టు కోశాధికారి

ABN , Publish Date - Jul 05 , 2026 | 09:35 PM

రామ మందిర విరాళాల లెక్కింపులో తనకు ఎలాంటి పాత్ర లేదని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కోశాధికారి గోవింద్ దేవ్ గిరి స్పష్టం చేశారు. ఈ ఉదంతంపై లోతైన, నిష్పాక్షిక దర్యాప్తు జరగాలని చెప్పారు.

విరాళాల లెక్కింపులో నా పాత్ర లేదు: రామ జన్మ భూమి ట్రస్టు కోశాధికారి
Ram Janma Bhoomi Teertha Kshetra Trust Treasurer

ఇంటర్నెట్ డెస్క్: అయోధ్య రామమందిర విరాళా చోరీ నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కోశాధికారి గోవింద్ దేవ్ గిరి తాజాగా కీలక ప్రకటన విడుదల చేశారు. విరాళాల లెక్కింపులో తనకు ఎలాంటి పాత్ర లేదని స్పష్టం చేశారు. ఈ ఉదంతంపై లోతైన, నిష్పాక్షిక దర్యాప్తు జరగాలని చెప్పారు.

తీర్థ ట్రస్టులో టస్ట్రీ, ట్రెజరర్ పోస్టుల కోసం తాను ఎప్పుడూ ఎలాంటి లాబీయింగ్ చేయలేదని చెప్పారు. శ్రీరాముడి సేవ చేసేందుకు ఏ రూపంలో అవకాశం లభించినా మహద్భాగ్యంగా భావించానని అన్నారు. ట్రస్టుకు సంబంధించిన పనుల కోసం తాను ప్రతి నెలా లేదా నెలన్నరకు ఒకసారి అయోధ్యకు వెళతానని చెప్పారు. ట్రెజరర్‌గా తన విధుల్లో అకౌంట్‌‌ల నిర్వహణ ఒక భాగమని చెప్పారు. అయితే, తను బిజీగా ఉంటాను కాబట్టి పుణె కార్యాలయానికి చెందిన చార్టెడ్ అకౌంటెంట్ సిబ్బంది ప్రతి నెల చివరి రోజుల్లో అయోధ్యకు అకౌంట్స్‌ను పరిశీలించేందుకు వెళుతుంటారని చెప్పారు.


రెండు పర్యాయాలు మినహా తాను వ్యక్తిగతంగా ఎప్పుడూ విరాళాలు తీసుకోలేదని అన్నారు. ఒకసారి తన సోదరి నుంచి, మరోసారి నీలమ్ గోహెచీ నుంచి విరాళం తీసుకున్నా వాటికి సంబంధించిన రసీదులు అప్పుడే జారీ చేశానని కూడా ఆయన చెప్పారు. ట్రస్టు ఖర్చులన్నీ బ్యాంకుల ద్వారా జరుగుతుంటాయని చెప్పారు. అయితే, ఇందుకు సంబంధించిన చెక్కులపై సంతకాలు చేసేందుకు తాను ఆథోరైజ్డ్ సిగ్నెటరీ కానని కూడా ఆయన అన్నారు. తన వద్ద చెక్కు బుక్ కూడా లేదని వెల్లడించారు.

విరాళాల చోరీ ఉదంతం నమ్మశక్యం కానిదని గిరి వ్యాఖ్యానించారు. శ్రీ రామ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పారు. విరాళాల చోరీ గత కొంతకాలంగా జరుగుతున్నట్టు వార్తల్లో వచ్చిందని కూడా ఆయన పేర్కొన్నారు. హుండీలో వేసిన విరాళాలు లెక్కించే ప్రాంతంతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఈ వ్యవహారాన్ని స్థానిక ట్రస్టీలే మొదటి నుంచీ పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. లెక్కింపు కోసం అనుసరించాల్సిన ప్రామాణిక పద్ధతులను (ఎస్‌ఓపీ) స్థానిక ట్రస్టీలు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్ణయించారని చెప్పారు. ఈ ఎస్‌ఓపీని తనకు గత నెలలోనే తొలిసారిగా చూపించారని చెప్పారు.


విరాళాల లెక్కింపు ఎప్పుడు, ఎలా జరుగుతోందనే అంశాలపై విచారణ జరుగుతోందని చెప్పారు. దర్యాప్తు సంస్థలపై విశ్వాసం ఉంచాలని కూడా విజ్ఞప్తి చేశారు. శిక్ష నుంచి నిందితులు తప్పించుకోలేరని కూడా విశ్వాసం వ్యక్తం చేశారు. శ్రీరాముడి దయతో ఈ సందేహాలు, చీకట్లు తొలగిపోతాయని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

ఈ వార్తలనూ చదవండి:

రేపు అయోధ్య రామమందిర ట్రస్ట్ అత్యంత కీలక సమావేశం..

'అయోధ్య ట్రైలర్ మాత్రమే.. కాశీ, మథుర దోపిడీపై భయమేస్తోంది'.. ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర విమర్శలు!

Updated Date - Jul 05 , 2026 | 09:52 PM