ఈ-20పై కేజ్రీవాల్ ఉద్యమం ఉధృతం
ABN , Publish Date - Aug 05 , 2026 | 06:04 AM
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ-20 ఇంధన విధానానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు...
ప్రధాని నివాస మార్గంలో బైఠాయింపు
ప్రజలంతా కలిసిరావాలని పిలుపు
న్యూఢిల్లీ, ఆగస్టు 4: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ-20 ఇంధన విధానానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఈ విధానాన్ని అడ్డుకోవడానికి ప్రజలంతా అధిక సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ-20 ఇంధన విధానానికి వ్యతిరేకంగా సేకరించిన 2.30 లక్షలకు పైగా ప్రజల సంతకాలతో కూడిన వినతిపత్రాలను ప్రధాని మోదీకి అందజేసేందుకు మంగళవారం ఢిల్లీలో ఆప్ నేతలు చేపట్టిన మార్చ్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సుమారు 100 మంది కార్యకర్తలు, ఈ-20 పెట్రోల్ బాధితులు, నేతలతో కలిసి ప్రధాని నివాస ముట్టడికి యత్నించిన కేజ్రీవాల్‌ను పోలీసులు మార్గమధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో వారు ఫిరోజ్ షా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘‘గోవా, గుజరాత్ రాష్ట్రాల్లో ఆప్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ కూడా ఈ-20 విధానాన్ని అడ్డుకుంటాం. ఈ విధానం వల్ల భారత రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. అమెరికా రైతులకు మాత్రమే లబ్ధి చేకూరుతుంది’’ అని ఆరోపించారు. అమెరికా నుంచి ఇథనాల్ దిగుమతి చేసుకునే విషయంలో ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ తెస్తున్న ఒత్తిడికి మోదీ తలొగ్గవద్దని, తక్షణమే ఈ దిగుమతులను నిలిపివేయాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఇక ఆ 2.30 లక్షల వినతిపత్రాలను నిరసనత తర్వాత ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించామని ఎక్స్ వేదికగా ప్రకటించారు. కాగా, ఈ-20పై కేజ్రీవాల్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ మండిపడింది. మరోవైపు, ఈ-20 పెట్రోల్ నాణ్యతపై ఆటోమొబైల్ పరిశ్రమ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇంధనంలో క్లోరైడ్స్ మోతాదు, తేమ శాతం విపరీతంగా పెరిగిపోవడంతో వాహనాల ఇంజన్ విడిభాగాలు శాశ్వతంగా దెబ్బతింటున్నాయని ‘సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్’ (సియామ్) హెచ్చరించింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖకు ఒక లేఖ రాసింది.
ఇవి కూడా చదవండి..
ఇజ్రాయెల్‌కున్న గొప్ప స్నేహితుల్లో మోదీ ఒకరు: బెంజమిన్ నెతన్యాహు
ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట.. విచారణ అనంతరం విడుదల చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశం..