Share News

ఏపీ సోషల్‌ ఆడిట్‌ సొసైటీకి ‘స్కోచ్‌ గోల్డ్‌’

ABN , Publish Date - Sep 27 , 2026 | 04:35 AM

పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజా భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇస్తూ ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పరిపాలనా సంస్కరణలకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది.

ఏపీ సోషల్‌ ఆడిట్‌ సొసైటీకి ‘స్కోచ్‌ గోల్డ్‌’

  • జాతీయ స్థాయిలో దక్కిన పురస్కారం

  • దేశంలోనే ఈ రికార్డు సాధించిన తొలి రాష్ట్రంగా గుర్తింపు

న్యూఢిల్లీ, అమరావతి, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజా భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇస్తూ ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పరిపాలనా సంస్కరణలకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్థి శాఖకు చెందిన సొసైటీ ఫర్‌ సోషల్‌ ఆడిట్‌ అకౌంటబిలిటీ అండ్‌ ట్రాన్స్‌పరెన్సీ(ఎస్ఎస్ఏఏటీ)కి ప్రతిష్ఠాత్మక ‘స్కోచ్‌ గోల్డ్‌ అవార్డు దక్కింది. దేశంలోనే ఈ పురస్కారం అందుకున్న తొలి రాష్ట్ర సోషల్‌ ఆడిట్‌ సంస్థగా ఏపీ ఎస్ఎస్ఏఏటీ రికార్డు నెలకొల్పింది. శనివారం ఇక్కడ జరిగిన 109వ స్కోచ్‌ సమ్మిట్‌లో ఏపీ సోషల్‌ ఆడిట్‌ డైరెక్టర్‌ జి.శ్రీకాంత్‌ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. స్కోచ్‌ అధికారిక రికార్డుల్లోనూ ఎస్ఎస్ఏఏటీ ప్రాజెక్ట్‌ సామాజిక తనిఖీ, పారదర్శకత, జవాబుదారీతనానికి సంబంధించిన ప్రాజెక్ట్‌గా నమోదైంది. ఈ సందర్భంగా ఏపీ సోషల్‌ ఆడిట్‌ డైరెక్టర్‌ జి.శ్రీకాంత్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు పారదర్శకమైన, జవాబుదారీపాలన అందించేందుకు ఎస్ఎస్ఏఏటీ చేస్తున్న కృషికి స్కోచ్‌ అవార్డు దక్కడం ఎంతో గర్వకారణమన్నారు. రాష్ట్రంలో ఏటా 13,396 సామాజిక తనిఖీలను నిర్వహిస్తూ ఎస్ఎస్ఏఏటీ విస్తృత స్థాయిలో కార్యకలాపాలను కొనసాగిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 8.9 లక్షల పనులపై, 2025-26లో 9.18 లక్షల పనులపై సామాజిక తనిఖీలు నిర్వహించింది. 43.4 లక్షల ఉపాధి శ్రామిక కుటుంబాలను నేరుగా కలిసి వారి సమస్యలు, సూచనలు, ఫిర్యాదులను నమోదు చేసింది. ప్రజల నుంచి నేరుగా సమాచారాన్ని సేకరించడం ద్వారా సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేస్తోంది.


పవన్‌ కల్యాణ్‌ దిశానిర్దేశంలో..

రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అందిస్తున్న మార్గదర్శకత్వం... సోషల్‌ ఆడిట్‌ వ్యవస్థను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో కీలకంగా మారింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల అమలులో పారదర్శకత ఉండేలా చూడటం, ప్రజలే పనులను పరిశీలించి తమ అభిప్రాయాలను వెల్లడించేలా సామాజిక తనిఖీలను బలోపేతం చేయడం వంటి లక్ష్యాలతో చేపట్టిన చర్యలు సోషల్‌ ఆడిట్‌ వ్యవస్థ పనితీరుకు బలం చేకూర్చాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నాయకత్వంలో సుపరిపాలనకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యానికి ఈ జాతీయ గుర్తింపు ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.

ఈ వార్తలనూ చదవండి:

మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల ఉచిత బియ్యం.. సీఎం చంద్రబాబు ఆదేశాలు

పర్యాటకం జోరు

Updated Date - Sep 27 , 2026 | 04:35 AM