Share News

బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు కాపాడలేవు.. బిగ్‌ బీకి బెదిరింపులు

ABN , Publish Date - Nov 16 , 2026 | 05:18 PM

ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌కు సోషల్ మీడియాలో బెదిరింపులు ఎదురయ్యాయి.

బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు కాపాడలేవు.. బిగ్‌ బీకి బెదిరింపులు
Goldy Dhillon Threatens Big B, Abhishek

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌కు సోషల్ మీడియాలో బెదిరింపులు ఎదురయ్యాయి. బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు మిమ్మల్ని కాపాడలేవంటూ గోల్డీ ఢిల్లాన్ పేరిట సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు ప్రత్యక్షమైంది. ముంబైలో అమితాబ్‌ను టార్గెట్ చేసిన ఇద్దరు నిందితులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో ఈ పోస్టు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. అయితే, ఈ పోస్టు గోల్డీ ఢిల్లాన్ పెట్టాడా? లేదా? అన్నది పూర్తిస్థాయిలో నిర్ధారణ కావాల్సి ఉంది.


వికాస్ ఠాకూర్, దీపక్ సింగ్‌లను అరెస్టు చేసినంత మాత్రాన తమ ప్లాన్‌పై ఎలాంటి ప్రభావం పడదనే హెచ్చరికలు ఆ పోస్టులో ఉన్నాయి. తమ గ్యాంగ్‌కు చెందిన 200 మంది ఇంకా ముంబైలో క్రియాశీలకంగానే ఉన్నారన్న వార్నింగ్ కనిపించింది. సిక్కు మతస్తులకు వ్యతిరేకంగా మాట్లాడే వారికి ఆ పోస్టులో గట్టి హెచ్చరికలు జారీ చేశారు. అమితాబ్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌ల పేర్లను ప్రత్యేకంగా పేర్కొన్నారు. బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు కూడా కాపాడలేవని హెచ్చరించారు. పోస్టులో 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల ప్రస్తావన కూడా ఉంది. నాటి హింసకు కారణమైన వారిని క్షమించే ప్రసక్తే లేదని నిందితులు హెచ్చరించారు. ‘వాళ్లు ఎన్ని బుల్లెట్ ప్రూఫ్ గదులను నిర్మించుకున్నా కాల్చిపారేస్తాం’ అన్న వార్నింగ్ కలకలం రేపుతోంది.


గత నెలలో ముంబైలోని అమితాబ్ ఇంటిని టార్గెట్ చేస్తూ మూడు ఈమెయిల్స్ వచ్చాయి. బాంబులతో పేల్చేస్తామంటూ నిందితులు బెదిరింపులకు దిగారు. ఈ క్రమంలో శనివారం ఢిల్లీ పోలీసులు బిష్ణోయ్‌గ్యాంగ్‌కు చెందిన వికాస్ ఠాకూర్, దీపక్ సింగ్‌ అనే షూటర్లను అదుపులోకి తీసుకున్నారు. అమితాబ్‌ బచ్చన్‌తో పాటు ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారిని వారు టార్గెట్ చేసుకున్నారని చెప్పారు. ఈ క్రమంలో ఇప్పటికే అమితాబ్ బచ్చన్ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.


ఈ వార్తలనూ చదవండి:

ఎన్నికల సంఘానికి 48 ప్రశ్నలు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ

హనీట్రాప్ గూఢచర్యంలో ఒక భాగం.. వాయుసేన చీఫ్ కీలక వ్యాఖ్యలు

Updated Date - Nov 16 , 2026 | 05:35 PM