సోనార్ బంగ్లా కలల సాకారం.. సువేందును శాసనసభాపక్ష నేతగా ప్రకటించిన అమిత్‌షా
ABN , Publish Date - May 08 , 2026 | 05:56 PM
పశ్చిమబెంగాల్ బీజేపీ శానససభాపక్ష నేతగా సువేందు అధికారిని కేంద్రం హోం మంత్రి అమిత్‌షా శుక్రవారంనాడు ప్రకటించారు. 'కాబోయే సీఎం'గా సువేందును అభివర్ణించారు. సోనార్ బంగ్లా కలల సాకారానికి కొత్త ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు.
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ బీజేపీ శానససభాపక్ష నేతగా సువేందు అధికారిని కేంద్రం హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) శుక్రవారంనాడు ప్రకటించారు. 'కాబోయే సీఎం'గా సువేందును అభివర్ణించారు. సోనార్ బంగ్లా కలల సాకారానికి కొత్త ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలను ఓడిస్తూ తీర్పునిచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. బెంగాల్ ఎన్నికల్లో పలు బెదిరింపుల, హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ ప్రజలు బీజేపీపై విశ్వాసం ఉంచారని, తమ ప్రభుత్వం ఏర్పాటు కాగానే చొరబాటుదారులు, గోవుల అక్రమరవాణాకు పూర్తిగా కళ్లెం వేస్తామని స్పష్టం చేశారు.
'సోనార్ బంగ్లా లక్ష్య సాధన దిశగా పనిచేయడం, బెంగాల్ ప్రజల అంచనాలను నిలబెట్టడం మన బీజేపీ కార్యకర్తలందరి బాధ్యత. కవిగురు రవీంద్రనాథ్ ఠాగూర్ కలలు గన్న భయంలేని, ఆత్మగౌరవంతో తలెత్తుకుని జీవించే బెంగాల్ వైపు నేడు మన ప్రయాణం సాగుతోంది' అని అమిత్‌షా అన్నారు.
బెంగాల్ లెజిస్లేటివ్ పార్టీ నేత ఎన్నిక ప్రక్రియను పర్యవేక్షిచేందుకు కేంద్ర పరిశీలకుడిగా అమిత్‌షా శుక్రవారంనాడు హాజరయ్యారు. ఈ సమావేశంలో సువేందు పేరు ప్రతిపాదనకు రాగా, కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో సువేందు అధికారిని బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ నేతగా అమిత్‌షా ప్రకటించారు. ఈనెల 9వ తేదీన కోల్‌కతాలోని బ్రిగేట్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే కార్యక్రమంలో బీజేపీ ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేయనుంది.