ఢిల్లీలో సత్తా చాటిన అమరావతి క్వాంటం వ్యాలీ
ABN , Publish Date - Oct 01 , 2026 | 05:22 AM
ఢిల్లీలోని అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో జాతీయ క్వాంటమ్ మిషన్ ఆధ్వర్యంలో సెప్టెంబరు 29, 30 తేదీల్లో నిర్వహించిన ప్రగతి క్యూఫౌండ్రీ-2026 సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకతను చాటుకుంది.
ప్రశంసించిన కేంద్ర మంత్రి.. అనేక స్టార్టప్ కంపెనీలతో చర్చలు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): ఢిల్లీలోని అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో జాతీయ క్వాంటమ్ మిషన్ ఆధ్వర్యంలో సెప్టెంబరు 29, 30 తేదీల్లో నిర్వహించిన ప్రగతి క్యూఫౌండ్రీ-2026 సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకతను చాటుకుంది. అమరావతి క్వాంటం వ్యాలీకి చెందిన దాదాపు 15 సంస్థలు రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న క్వాంటం సాంకేతికరంగ ప్రతిభను ప్రదర్శించాయి. కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ బుధవారం అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రదర్శనను సందర్శించి ప్రశంసించారు. ఈ వ్యాలీకి చెందిన క్యూబిట్ ఫోర్స్, సృష్టి క్వాంటమ్, క్యూ-క్లైర్వాయన్స్, క్యూబిటెక్, క్వాంటం ఎలక్ర్టానిక్స్, క్యూకృషి, సీఎ్‌సఐఆర్ ప్రయోగశాలలు ఒకే గొడుగు కింద తమ ప్రగతిని ప్రదర్శించాయి.
త్వరలో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్న క్యూబిట్ ఫోర్స్ క్వాంటమ్ కంప్యూటర్ ప్రత్యేకంగా నిలిచింది. రాష్ట్రానికి చెందిన ఏడు అండర్ గ్రాడ్యుయేట్ ప్రయోగశాలలను ప్రారంభించారు. సదస్సులో అమరావతి వ్యాలీ ప్రతినిధులు అనేక స్టార్టప్ కంపెనీలతో చర్చలు జరిపారు. ఈ బృందంలో ఐఏఎస్ అధికారి ప్రద్యుమ్న, సీఎంవో ప్రతినిధులు, ఏపీ స్టేట్ క్వాంటం మిషన్ డైరెక్టర్ సీవీ శ్రీధర్ ఉన్నారు. ‘40కి పైగా కంపెనీలు, సంస్థలతో మేం చర్చలు జరిపాం. ఈ సదస్సులో పాల్గొనడం ద్వారా అమరావతి క్వాంటం వ్యాలీని క్వాంటం టెక్నాలజీ, పరిశోధన, ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఏపీ చేస్తున్న ప్రయత్నాలకు ఎంతో గుర్తింపు వచ్చింది’ అని శ్రీధర్ వివరించారు.
ఈ వార్తలనూ చదవండి...
ఉన్నతంగా బతికి... మానసికంగా ‘చితికి’