విరాళాల చోరీ ఉదంతంపై మౌనమెందుకు? సీఎం యోగికి అఖిలేశ్ ప్రశ్న
ABN , Publish Date - Nov 08 , 2026 | 10:01 PM
అయోధ్య రామమందిర విరాళాల చోరీ ఉదంతంపై చర్యలు తీసుకోవడంలో యోగీ ప్రభుత్వం విఫలమైందని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు.
ఇంటర్నెట్ డెస్క్: అయోధ్య రామమందిర విరాళాల చోరీ ఉదంతంపై చర్యలు తీసుకోవడంలో యోగీ ప్రభుత్వం విఫలమైందని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. ఈ ఉదంతంలో పాత్ర ఉన్న వారిని కాపాడుతోంది ఎవరని ప్రశ్నించారు. ‘సీఎం ఎందుకు మౌనం వహిస్తున్నారు. ఇందుకు బాధ్యత ఎవరు తీసుకుంటారు?’ అని ఎస్పీ చీఫ్ ప్రశ్నించారు. అభివృద్ధి పేరిట అయోధ్య వాసుల నుంచి భూమి తీసుకున్నా తగిన పరిహారం ఇవ్వకుండా అవమానించారని మండిపడ్డారు.
1990లో ములాయం సింగ్ హయాంలో కరసేవకులపై కాల్పుల ఘటనకు బాధ్యులైన వారు క్షమాపణ చెప్పాలని ఇటీవల సీఎం యోగి డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. తాను త్వరలో అయోధ్య రామమందిరం దర్శనానికి వస్తానని అఖిలేశ్ చెప్పడంపై సీఎం యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. అయోధ్యను నిర్లక్ష్యం చేసిన వారు ముందుగా క్షమాపణ చెప్పి ఆపై దర్శనానికి రావాలని సీఎం అన్నారు. ఇందుకు బదులుగా ఎస్పీ అధినేత అఖిలేశ్ స్పందిస్తూ యోగి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ఇక విరాళాల చోరీ కేసులో ఇప్పటివరకూ 8 మంది అరెస్టైన విషయం తెలిసిందే. ఘటనపై దర్యాప్తునకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. నగదు విరాళాలను లెక్కించే సమయంలో డబ్బును దారి మళ్లించిన ఆరోపణలపై నిందితులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి పోలీసులు రూ.79.85 లక్షలను రికవరీ చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
టీకొట్టు నడుపుకుంటున్న సొంత సోదరి.. క్లారిటీ ఇచ్చిన సీఎం యోగి
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి