Share News

300 అడుగుల కిందకు దిగిన ఫ్లైట్‌.. పైలట్‌కు రెండోసారీ డ్రగ్‌ టెస్ట్‌లోనూ పాజిటివ్‌

ABN , Publish Date - Aug 11 , 2026 | 08:55 PM

ఫుకెట్‌ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా విమానం ప్రయాణంలో ఒక్కసారిగా 300 అడుగుల మేర ఎత్తు కోల్పోయిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విమాన పైలట్‌కు నిర్వహించిన రెండో దశ డ్రగ్‌ పరీక్షలోనూ పాజిటివ్‌ వచ్చినట్లు తెలుస్తోంది.

300 అడుగుల కిందకు దిగిన ఫ్లైట్‌.. పైలట్‌కు రెండోసారీ డ్రగ్‌ టెస్ట్‌లోనూ పాజిటివ్‌
Air India Pilot Drug Test

ఇంటర్నెట్ డెస్క్: ఫుకెట్‌ నుంచి ఢిల్లీకి వస్తున్న సమయంలో తీవ్ర కుదుపులకు గురై, ఒక్కసారిగా సుమారు 300 అడుగుల ఎత్తును కోల్పోయిన ఎయిరిండియా విమాన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విమానానికి పైలట్‌గా వ్యవహరించిన వ్యక్తికి నిర్వహించిన రెండో దశ డ్రగ్‌ పరీక్షలోనూ పాజిటివ్‌ వచ్చినట్లు తెలుస్తోంది. పైలట్‌ గంజాయి సేవించినట్లు పరీక్షలో తేలినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆగస్టు 4న జరిగిన ఈ ఘటనలో 13 మంది ప్రయాణికులు, నలుగురు విమాన సిబ్బంది గాయపడ్డారు.


ఎయిరిండియాకు చెందిన AI-2379 విమానం 137 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది సిబ్బందితో ఫుకెట్‌ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. ప్రయాణం మధ్యలో విమానం తీవ్ర కుదుపులకు లోనైంది. క్రూజ్‌ దశలో ఉన్న సమయంలో విమానం అకస్మాత్తుగా సుమారు 300 అడుగుల మేర దిగజారింది. దీంతో ప్రయాణికులు, సిబ్బందిలో పలువురు గాయపడ్డారు. నలుగురు క్యాబిన్‌ సిబ్బందిలో ఇద్దరికి వెన్నెముక కింది భాగం, మెడ ప్రాంతంలో గాయాలైనట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు వెల్లడించారు.


విమానం ఢిల్లీ చేరుకున్న అనంతరం పైలట్లకు నిబంధనల ప్రకారం డ్రగ్‌ పరీక్షలు నిర్వహించారు. పైలట్‌ మానసిక స్థితిపై ప్రభావం చూపే పదార్థాలు తీసుకున్నట్లు తొలి పరీక్షలో తేలిందని అప్పట్లో సమాచారం వెలువడింది. దీంతో నిర్ధారణ కోసం మరో పరీక్ష నిర్వహించారు. ఈ రెండో పరీక్షలోనూ పాజిటివ్‌ ఫలితం వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.


విమానం ఒక్కసారిగా 300 అడుగుల మేర కిందకు దిగిన సమయంలో పైలట్‌ తన సీటులో లేరని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ సమయంలో కో-పైలట్‌ ఎయిర్‌బస్‌ A320neo విమానాన్ని నియంత్రిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే విమానం అకస్మాత్తుగా కిందకు పడిపోవడానికి అసలు కారణం ఏమిటన్నది ఇంకా తేలియాల్సి ఉంది. పైలట్‌ చర్య వల్ల జరిగిందా? సాంకేతిక సమస్య తలెత్తిందా? లేక హైడ్రాలిక్‌ వ్యవస్థలో లోపం కారణమా? అనే అంశాలను దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు.


Also Read:

జాతీయ విపత్తు నివారణ నిధిపై పార్లమెంట్ వేదికగా కేంద్రం క్లారిటీ..

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో ఉద్యోగాలు.. రూ.1.80 లక్షల వరకు జీతం!

Updated Date - Aug 11 , 2026 | 09:29 PM