Share News

నిలువునా చీలిన AIADMK.. విజయ్‌కు మద్దతు ప్రకటించిన రెబల్ వర్గం!

ABN , Publish Date - May 12 , 2026 | 05:23 PM

విజయ్ TVK పార్టీ తన బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్న తరుణంలో AIADMK పార్టీ నిలువునా చీలిపోయింది. పార్టీ సీనియర్ నేతలు సి.వి. షణ్ముగం, ఎస్.పి. వేలుమణి నేతృత్వంలోని రెబల్ వర్గం ముఖ్యమంత్రి విజయ్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.

నిలువునా చీలిన AIADMK..  విజయ్‌కు మద్దతు ప్రకటించిన రెబల్ వర్గం!
AIADMK Rebel Faction Led by CV Shanmugam Extends Support to Vijay’s TVK

చెన్నై, మే 12: తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్ TVK పార్టీ తన బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్న తరుణంలో, AIADMK నిలువునా చీలిపోయింది. పార్టీ సీనియర్ నేతలు సి.వి. షణ్ముగం, ఎస్.పి. వేలుమణి నేతృత్వంలోని రెబల్ వర్గం ముఖ్యమంత్రి విజయ్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.

EPS పై తిరుగుబాటు:

పార్టీ జనరల్ సెక్రటరీ ఎడప్పాడి పళనిస్వామి (EPS)పై షణ్ముగం వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రత్యర్థి పార్టీ అయిన DMK సాయంతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు EPS ప్రయత్నించారని, ఇది పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధమని వారు ఆరోపించారు. 'మా పార్టీ DMK ని వ్యతిరేకించేందుకే పుట్టింది. 53 ఏళ్లుగా మేము అదే పోరాటం చేస్తున్నాం. DMK తో కలిస్తే మా పార్టీ అస్తిత్వమే దెబ్బతింటుంది. అందుకే గెలిచిన విజయ్ పార్టీ (TVK) కి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం' అని షణ్ముగం స్పష్టం చేశారు.

'మేము ఇప్పుడు ఎటువంటి ఎన్నికల ముందున్న కూటమిలో లేము. పార్టీని బలోపేతం చేసుకోవడమే మా లక్ష్యం. అందుకే విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాం.' అని సి.వి. షణ్ముగం చెప్పారు. మరోవైపు, పార్టీని విడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ రెబల్ నేతలపై EPS వర్గం మండిపడుతోంది. తమిళ రాజకీయాల్లో ఈ ఆధిపత్య పోరు ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.


ఎమ్మెల్యేల బలం:

AIADMK కు ఉన్న 47 మంది ఎమ్మెల్యేలలో దాదాపు 30 మంది షణ్ముగం, వేలుమణి వెంటే ఉన్నట్లు సమాచారం. ఇది విజయ్ ప్రభుత్వానికి పెద్ద ఊరటనిస్తోంది. విజయ్ నేతృత్వంలోని TVK కూటమికి ఇప్పటికే 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఇప్పుడు AIADMK రెబల్స్ కూడా తోడవడంతో అసెంబ్లీలో ఆయన బలం మరింత పెరగనుంది. మే 13న జరగనున్న ఫ్లోర్ టెస్ట్ (విశ్వాస పరీక్ష) విజయ్‌కు సులభం కానుంది.

నటుడు విజయ్ తన రాజకీయ రంగప్రవేశం చేసిన మొదటి ఎన్నికల్లోనే (2026) అద్భుత విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే పూర్తి మెజారిటీకి కొద్దిగా దూరంలో ఉండటంతో, ఇతర పార్టీల మద్దతు కీలకంగా మారింది. ఈ క్రమంలో AIADMK లో వచ్చిన ఈ చీలిక విజయ్‌కు వరంగా మారింది.


ఇవి కూడా చదవండి...

కొత్త వాహనాల రిజిస్ట్రేషన్.. 24 గంటల్లోనే పూర్తి: మంత్రి రాంప్రసాద్ రెడ్డి

ఇంద్రకీలాద్రిపై వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు

Read Latest AP News And Telugu News

Updated Date - May 12 , 2026 | 05:37 PM