Share News

ఇంటికి ఐటీ దెబ్బ!

ABN , Publish Date - Apr 23 , 2026 | 06:03 AM

కృత్రిమ మేధ రాకతో ఐటీ రంగంలో నెలకొన్న అనిశ్చితి రియల్‌ఎస్టేట్‌ రంగంపైనా ప్రభావం చూపుతోంది. బహుళజాతి ఐటీ కంపెనీల్లోనూ భారీగా ఉద్యోగాల కోతలు, కొత్త నియామకాల్లో...

ఇంటికి ఐటీ దెబ్బ!

  • ఏఐ రాకతో ఐటీ రంగంపై ప్రభావం

  • వరుసగా ఉద్యోగాల కోతతో అనిశ్చితి

  • దీంతో ఇళ్ల కొనుగోలు ఆలోచనను వాయిదా వేసుకుంటున్న ఉద్యోగులు

  • నైట్‌ఫ్రాంక్‌ ఇండియా నివేదికలో వెల్లడి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 22: కృత్రిమ మేధ రాకతో ఐటీ రంగంలో నెలకొన్న అనిశ్చితి రియల్‌ఎస్టేట్‌ రంగంపైనా ప్రభావం చూపుతోంది. బహుళజాతి ఐటీ కంపెనీల్లోనూ భారీగా ఉద్యోగాల కోతలు, కొత్త నియామకాల్లో మందగమనం, జీతాల పెరుగుదలపై సందేహాలతో.. చాలా మంది ఉద్యోగులు ఇళ్ల కొనుగోలు ఆలోచనను వాయిదా వేసుకుంటున్నారు. దీనితో ఐటీ హబ్‌లైన హైదరాబాద్‌, బెంగళూరు, పుణెలలో ఇళ్ల విక్రయాలపై ప్రభావం పడిందని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ముఖ్యంగా మధ్యస్థాయి ఇళ్ల విక్రయాలు బాగా పడిపోయినట్టు తెలిపింది. ఖరీదైన ఇళ్ల అమ్మకాలు మాత్రం పెరిగాయని, అధికాదాయ వర్గాలు ఇళ్లకొనుగోళ్లను కొనసాగించడమే దీనికి కారణమని పేర్కొంది. కరోనా అనంతరం సుమారు ఐదేళ్లు గృహరంగం దూసుకుపోయిందని, ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులతో కన్సాలిడేషన్‌ జరుగుతోందని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా పరిశోధక విభాగం డైరెక్టర్‌ అంకిత సూద్‌ పేర్కొన్నారు. దీనికితోడు ఐటీ రం గంలో నెలకొన్న అనిశ్చితి కూడా ప్రభావం చూపుతోందని తెలిపారు. ఈ క్రమంలోనే ఐటీ ఉద్యోగులు అప్రమత్తంగా ఉంటున్నారని.. ఇళ్ల కొనుగోలుతో రుణభారాన్ని పెంచుకోవడానికి సిద్ధంకావడం లేదని రియల్‌ ఎస్టేట్‌ వర్గాలు చెబుతున్నాయి. పుణె, హైదరాబాద్‌లలో ఇళ్ల విక్రయాల్లో బాగా తగ్గుదల ఉందని.. ఐటీతోపాటు ఇతర రంగాల ఉద్యోగులు కూడా ఎక్కువగా ఉండటంతో బెంగళూరులో మాత్రం తగ్గుదల స్వల్పంగా ఉందని వెల్లడించాయి. ఐటీలో ఉద్యోగాల కోత, కొత్త నియామకాలపై అనిశ్చితి, ఆర్థికభారం, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థి క పరిస్థితులు వంటివాటితో దేశంలోని ప్రధాననగరాల్లో గత ఏడాది ఇళ్ల విక్రయాలు 14ు తగ్గాయని ప్రాపర్టీ పిస్టల్‌ సంస్థ ఎండీ ఆశీష్‌ నరేన్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. కొనుగోలు అయ్యే ఇళ్ల సంఖ్య తగ్గినా.. విలువ పరంగా మాత్రం 6ు పెరిగిందని తెలిపారు. అయితే మార్కెట్లో పరిస్థితులు మరీ బలహీనంగా ఏమీ లేవని, ఇది తాత్కాలిక విరామం మా త్రమేనని అంచనా వేశారు. త్వరలోనే గృహాల కొనుగోళ్లు పుంజుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశా రు. ఇక ఐటీకి హబ్‌గా మారిన హైదరాబాద్‌పై ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని స్టోన్‌క్రా్‌ఫ్ట గ్రూపు ఎండీ కీర్తి చిలుకూరి చెప్పారు. కొత్త ప్రాజెక్టుల ప్రారంభాలు తగ్గాయని, అద్దె ధరల పెరుగుదలలోనూ మందగమనం నెలకొందన్నారు. అయితే హైదరాబాద్‌కు సంబంధించి ఆర్థిక, ఐటీ వ్యవస్థల పునాదులు బలంగా ఉన్నాయని.. ఇళ్ల కొనుగోళ్లు వేగంగానే పుంజుకుంటాయని పేర్కొన్నారు.


ఏఐ తుఫానులో కుప్పకూలిన ‘చెగ్‌’

అమెరికాకు చెందిన ఆన్‌లైన్‌ ఎడ్యుటెక్‌ సంస్థ.. ‘చెగ్‌’. రెండు దశాబ్దాల కంపెనీ అయినా.. కరోనా కాలంలో ఆన్‌లైన్‌ చదువులు మొదలుకావడంతో భారీగా ఎదిగింది. ఆన్‌లైన్‌ తరగతుల రారాజుగా వెలిగింది. విభిన్న కోర్సుల పుస్తకాలను అందుబాటులో ఉంచడంతోపాటు ఆన్‌లైన్‌ క్లాసుల నుంచి హోంవర్క్‌కు అవసరమైన సహాయం దాకా అందించింది. 2022లో మధ్యలో కంపెనీ షేరు ధర 113.5 డాలర్లకు పెరిగింది. సంస్థ విలువ సుమారు రూ.1.4 లక్షల కోట్ల(15బిలియన్‌ డాలర్ల)కు చేరింది. అంతటి ఎడ్యుటెక్‌ సంస్థ కూడా చాట్‌జీపీటీ, ఇతర కృత్రిమ మేధ ప్రోగ్రామ్‌ల దెబ్బకు కుప్పకూలిపోయింది. ఏఐ ప్రోగ్రామ్స్‌, చాట్‌బాట్‌లు.. హోంవర్క్‌, గణిత సమస్య ల పరిష్కారం నుంచి వ్యాసాల దాకా అన్నీ క్షణాల్లో అందిస్తుండటం, అదీ ఉచితంగా అందుతుండటం ప్రభావం చూపింది. కేవలం నాలుగేళ్లలోనే సంస్థ విలువ 99ు కరిగిపోయి.. రూ.1,460 కోట్ల (156 మిలియన్‌ డాలర్ల)కు పడిపోయింది. సంస్థ షేరు ఽఇప్పుడు కేవలం ఒక డాలరులోపే ట్రేడ్‌ అవుతోంది. గతఏడాది అక్టోబరులో చెగ్‌ సంస్థ 45ు మంది ఉద్యోగులను తొలగించింది. ఏఐ ప్రభావంతో సంస్థ ఆదాయం భారీగా తగ్గిందని, ఉద్యోగులను తొలగించక తప్పడంలేదని ఆ సమయంలో సంస్థ యాజమాన్యం ప్రకటించింది. తామూ ఏఐ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని, మెరుగైన సేవలు, కంటెంట్‌ను అందించేందుకు చర్యలు చేపడతామని తెలిపింది.

దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి

మొత్తంగా దేశవ్యాప్తంగా టాప్‌-8 నగరాల్లో 2025 తొలి త్రైమాసికంతో పోలిస్తే.. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఇళ్ల విక్రయాలు నాలుగు శాతం తగ్గిపోయినట్టు నైట్‌ఫ్రాంక్‌ తెలిపింది. కొత్తగా చేపట్టే ఇళ్ల నిర్మాణాలు కూడా రెండు శాతం తగ్గినట్టు వెల్లడించింది. నిర్మాణం పూర్తయినా అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య మూడు శాతం పెరిగి సుమారు 5.2 లక్షలకు చేరినట్టు వెల్లడించింది. ముఖ్యంగా ఢిల్లీ, నోయిడా ఇతర ప్రాంతాల సమాహారమైన జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌), పుణె నగరాల్లో ఇళ్ల మార్కెట్‌ చాలా బలహీనంగా ఉన్నట్టు పేర్కొంది.

ఇవి కూడా చదవండి..

పీఎంపై వ్యాఖ్యల వివాదం.. ఖర్గేకు ఈసీ నోటీసు

సీఎం సిద్ధరామయ్యపై చేతబడి జరిగిందేమో.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

Updated Date - Apr 23 , 2026 | 06:03 AM