Share News

అహ్మదాబాద్‌ పేలుళ్ల కేసు.. 38 మందికి మరణ శిక్ష

ABN , Publish Date - Jul 08 , 2026 | 06:59 AM

అహ్మదాబాద్‌ వరుస పేలుళ్ల ఘటనలో 38మందికి మరణశిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును మంగళవారం గుజరాత్‌ హైకోర్టు సమర్థించింది....

అహ్మదాబాద్‌ పేలుళ్ల కేసు.. 38 మందికి మరణ శిక్ష

మరో 11 మందికి జీవిత ఖైదు

ప్రత్యేక కోర్టు తీర్పును సమర్థించిన గుజరాత్‌ హైకోర్టు

అందరూ ఇండియన్‌ ముజాహిదీన్‌ సభ్యులే

ఒకేసారి ఇంతమందికి ఉరిశిక్ష ఇదే తొలిసారి

2008 నాటి దుర్ఘటనలో 56 మంది మృతి

అహ్మదాబాద్‌, జూలై 7: అహ్మదాబాద్‌ వరుస పేలుళ్ల ఘటనలో 38మందికి మరణశిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును మంగళవారం గుజరాత్‌ హైకోర్టు సమర్థించింది. 11 మందికి విధించిన యావజ్జీవ కారాగార శిక్షను కూడా ధ్రువీకరించింది. మొత్తం ఈ 49 మంది నిందితులంతా ఉగ్రవాద సంస్థ ఇండియన్‌ ముజాహిదీన్‌ సభ్యులు కావడం గమనార్హం. 2008 జూలై 26న అహ్మదాబాద్‌లో 70 నిమిషాల వ్యవధిలో వరుసగా 21 బాంబు పేలుళ్ల సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇందులో 56 మంది మరణించగా, 200 మందికిపైగా వ్యక్తులు గాయపడ్డారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించగా అక్కడ కూడా బాంబు పేలింది. ఈ పేలుళ్లపై 20 కేసులు నమోదయ్యాయి. సూరత్‌లో పలు చోట్ల బాంబులు అమర్చిన ఘటనలపై మరో 15 కేసులు పెట్టారు. వాటిని పేల్చనప్పటికీ, ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డారన్న అభియోగాలు మోపారు. వీటన్నింటిని కలిపి ప్రత్యేక కోర్టు విచారణ జరిపింది. 78 మందిని పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు. వారిలో 38 మందికి మరణశిక్ష, 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ 2022 ఫిబ్రవరిలో ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రత్యేక కోర్టు తీర్పుపై నిందితులు హైకోర్టులో అప్పీలు చేశారు. మరోవైపు ఆ శిక్షను ధ్రువీకరించాలని గుజరాత్‌ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. వాదనలు విన్న ధర్మాసనం ప్రత్యేక న్యాయస్థానం తీర్పును సమర్థించింది. మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల వంతున, గాయపడ్డ వారి కుటుంబాలకు రూ.5 లక్షల వంతున వచ్చే ఏడాది మార్చి 30లోగా పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ వార్తలు కూడా చదవండి..

సింగరేణికి తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌ కేటాయింపు.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం

రూ.15 విలువైన ఆర్డర్‌కు రూ.500 టిప్పు.. డెలివరీ బాయ్ రియాక్షన్ వీడియో వైరల్

Updated Date - Jul 08 , 2026 | 06:59 AM