Share News

ఇది ఆరంభమే

ABN , Publish Date - Jul 27 , 2026 | 06:15 AM

ఇది ఆరంభం మాత్రమేనని, చేయాల్సిన ప్రయాణం మిగిలే ఉందని కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు, జంతర్‌మంతర్‌ ఉద్యమ నేత అభిజిత్‌ దీప్కే వెల్లడించారు. విద్యావ్యవస్థలో పారదర్శకత...

ఇది ఆరంభమే

  • చేయాల్సిన ప్రయాణం మిగిలే ఉంది

  • విద్యలో పారదర్శకత, ప్రభుత్వ బడుల బలోపేతం లక్ష్యంగా పనిచేస్తాం

  • 37 రోజుల ఉద్యమంలో ఒత్తిడికి గురయ్యా

  • ప్రధాన్‌ రాజీనామాతో ప్రశాంతంగా నిద్రించా

  • నా మద్దతుదారులు, విమర్శకులకూ కృతజ్ఞతలు

  • టైఫాయిడ్‌ సోకడంతో ఇంటికి తిరిగొచ్చేశాను

  • జంతర్‌మంతర్‌ వద్ద విద్యార్థుల్ని కలవలేకపోయా: అభిజిత్‌ దీప్కే

  • ఎన్నికల్లో పాల్గొనం

  • ఉద్యమ విస్తరణపైనే దృష్టి: సౌరవ్‌ దాస్‌

న్యూఢిల్లీ, జూలై 26: ఇది ఆరంభం మాత్రమేనని, చేయాల్సిన ప్రయాణం మిగిలే ఉందని కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు, జంతర్‌మంతర్‌ ఉద్యమ నేత అభిజిత్‌ దీప్కే వెల్లడించారు. విద్యావ్యవస్థలో పారదర్శకత, స్థోమతతో నిమిత్తం లేకుండా అందరికీ అందుబాటులో చదువు, బలమైన ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీకిగాను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా కోరుతూ 37 రోజులపాటు సీజేపీ ఉద్యమించిన విషయం తెలిసిందే. ప్రధాన్‌ శనివారం రాజీనామా చేయడంతో ఉద్యమ ప్రధాన డిమాండ్‌ నెరవేరింది. దీంతో, కాక్రోచ్‌ల తదుపరి కార్యాచరణ ఏమిటనే ఆసక్తి అందరిలో నెలకొంది. దీనిపై దీప్కే ఆదివారం స్పందించారు. ఉద్యమం నడిచినన్ని రోజులూ బాగా ఒత్తిడికి గురయ్యానని, సమయం కష్టంగా గడిచేదని ‘ఎక్స్‌’లో తెలిపారు. ‘‘రాత్రి (ఆదివారం) నా గదిలో ప్రశాంతంగా నిద్రపోయాను. రేపు ఏమవుతుందో, సాయంత్రం వరకు ఎలా గడుస్తుందోననే ఆందోళన తొలగిపోయింది.’’ అని పేర్కొన్నారు. ఉద్యమకాలంలో తనకు మద్దతుగా దేశం నలమూలల నుంచి వచ్చి.. చివరిదాకా వెంట నిలబడిన మద్దతుదారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యమాన్ని విమర్శించినవారికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మరింత మెరుగ్గా పనిచేసేందుకు వారి విమర్శలు తమకు దోహదపడ్డాయన్నారు. ‘‘ఇది మనకు (మద్దతుదారులను ఉద్దేశించి) ఆరంభమే. ఉద్యమం మొదలైన నాటినుంచీ నేను మీకిదే చెబుతున్నా. కాక్రోచ్‌ జనతా పార్టీ ఇంకా చాలానే ప్రయాణం చేయాల్సి ఉంది.’’ అని తెలిపారు. ప్రధాన్‌ రాజీనామా తర్వాత జంతర్‌మంతర్‌లో తన కోసం వేచిచూసిన వారిని కలుసుకొని, కృతజ్ఞతలు తెలపలేకపోయానని, ఇందుకు తనను క్షమించాలని దీప్కే కోరారు. టైఫాయిడ్‌ సోకి, 101 డిగ్రీల జ్వరం తగలడంతో తాను ఇంటికి తిరిగొచ్చేశానని తెలిపారు.


ఎన్నికల్లో పాల్గొనబోం

  • ఉద్యమ విస్తరణపైనే ప్రస్తుతానికి దృష్టి

  • కాక్రోచ్‌ల ముఖ్యనేత సౌరవ్‌ దాస్‌ వెల్లడి

37 రోజుల ఉద్యమం కాక్రోచ్‌ల ఆశయాలను దేశవ్యాప్తం చేసింది. తొలి అడుగులోనే ప్రధాన డిమాండ్‌ను నెరవేర్చుకుంది. దీంతో.. రావడమే ‘పార్టీ’గా తెరపైకి వచ్చిన కాక్రోచ్‌లు ప్రధాన స్రవంతి రాజకీయాలపై ఇక దృష్టి పెట్టనున్నానని, వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారంటూ వార్తలు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ముఖ్యనేత, విద్యార్థుల డిమాండ్లపై కేంద్ర మంత్రులతో చర్చలు జరిపిన బృందంలో ఒకరు సౌరవ్‌ దాస్‌ సోమవారం దీనిపై స్పందించారు. ‘‘ప్రస్తుతానికి ఎన్నికల్లో పాల్గొనే ఆలోచన లేదు. మా ఉద్యమాన్ని కిందిదాకా విస్తరించడం లక్ష్యంగా పనిచేస్తాం. దీనికోసం దేశమంతా తిరుగుతాం. ఎక్కడికక్కడ యువకులతో మాట్లాడతాం. ప్రభుత్వ పెద్దలకు, యువతకు మధ్య ఎటువంటి సంబంఽధాలు లేని విషయం ఉద్యమం సందర్భంగా మేం గుర్తించారు. బాధలు చెప్పుకొందామని వచ్చే జనాలను పట్టించుకునేవారే లేరు. క్షేత్రస్థాయిదాకా ఉద్యమాన్ని విస్తరించడం ద్వారా వారి వెతలను మేం వింటాం’’ అని సౌరవ్‌ దాస్‌ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వేళ బీజేపీ ఎంపీ కుమార్తె పోస్ట్ కలకలం

అడవిలో తప్పిపోయిన 23 మంది అధికారులు.. చివరకు

Updated Date - Jul 27 , 2026 | 06:15 AM