ఆయన దీక్ష చేయకపోతే ధర్మేంద్ర రాజీనామా సాధ్యమయ్యేదే కాదు: అభిజీత్ దీప్కే
ABN , Publish Date - Jul 31 , 2026 | 04:37 PM
సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌తో తనకు విభేదాలు ఉన్నాయన్న వార్తలను కాక్రోచ్ జనతాపార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కొట్టిపారేశారు. నీట్ పేపర్ లీక్ ఉద్యమంలో ఆయన త్యాగాన్ని ఎన్నటికీ మర్చిపోలేమని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌తో తనకు విభేదాలు ఉన్నాయన్న వార్తలను కాక్రోచ్ జనతాపార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కొట్టిపారేశారు. నీట్ పేపర్ లీక్ ఉద్యమంలో ఆయన త్యాగాన్ని ఎన్నటికీ మర్చిపోలేమని అన్నారు. తమ మధ్య ఏకాభిప్రాయం ఉందని స్పష్టం చేశారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిజీత్ దీప్కే ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆందోళన ముగింపు ప్రసంగంలో సోనమ్ వాంగ్‌చుక్ గురించి తాను ప్రస్తావించకపోవడానికి విభేదాలే కారణమన్న వాదనను అభిజీత్ తోసిపుచ్చారు. తమ మధ్య ఏకాభిప్రాయం ఉందని అన్నారు. ఆయనతో ఫోన్‌లో మాట్లాడినట్టు కూడా తెలిపారు. నాటి ఆందోళన యువత చేపట్టారని, పోలీసు చర్యలను ఎదుర్కొన్నారని అన్నారు. కాబట్టి తన ప్రసంగంలో వారికి ధన్యవాదాలు తెలిపానని అభిజీత్ వివరించారు.
వాంగ్‌చుక్ దీక్షతోనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా..
‘కానీ వాంగ్‌చుక్ సర్ త్యాగాన్ని మేము ఎన్నటికీ మర్చిపోలేము. ఆయన తన ప్రాణాల్ని సైతం లెక్క చేయక 26 రోజుల పాటు ఆమరణ దీక్ష చేశారు. తన ప్రాణాల్ని పణంగా పెట్టి జాతి అంతరాత్మను జాగృతం చేశారు. యువత వీధుల్లోకి వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా చేశారు. ఆయన ఆమరణ దీక్ష చేయకుంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సాధ్యమయ్యేదే కాదు’ అని అన్నారు. ఆమరణ దీక్షను ముగించాలని తాను వ్యక్తిగతంగా ఎన్నోసార్లు చెప్పానని అన్నారు.
కేంద్ర మంత్రుల సమక్షంలో వాంగ్‌చుక్ దీక్షను విరమించడం విచారం కలిగించిందా? అన్న ప్రశ్నకు అలాంటిదేమీ లేదని అభిజీత్ బదులిచ్చారు. ఆసుపత్రిలో వాంగ్‌చుక్‌ను కలిసేందుకు తనను అనుమతించకుండా, కేంద్ర మంత్రులకు ఆ అవకాశం కల్పించినందుకు అసంతృప్తి కలిగిందని చెప్పారు. ఇతర సీజేపీ సభ్యులతో పాటు ప్రతిపక్ష నాయకులను కూడా వాంగ్‌చుక్‌ను కలిసేందుకు అనుమతించలేదని అన్నారు. ఒక రకంగా చూస్తే కేంద్రం వాంగ్‌చుక్‌ను కిడ్నాప్ చేసినట్టేనని వ్యాఖ్యానించారు. అయితే, వాంగ్‌చుక్ తన దీక్షను విరమించారని తెలిసి ఊపిరి పీల్చుకున్నట్టు దీప్కే తెలిపారు. దేశ భవిష్యత్తుకు ఆయన అవసరం ఉందని అన్నారు.
రాజకీయ పార్టీగా మారే ఉద్దేశం లేదు..
సీజేపీకి రాజకీయ పార్టీగా మారే ఉద్దేశం లేదని మరోసారి చెప్పారు. రాజకీయంగా ఒత్తిడి తెచ్చే ప్రెషర్ గ్రూప్‌గా మాత్రమే కొనసాగుతామని చెప్పారు. ప్రభుత్వంలో జవాబుదారీతనం తేవడమే తన లక్ష్యమని అన్నారు. తాను రాజకీయ నాయకుడిగా మారనని కూడా చెప్పారు. నేటి పరిస్థితుల్లో అర్థవంతమైన మార్పులు ప్రజా ఉద్యమాలతోనే సాధ్యమని అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
కావేరీ నదీ జలాల వివాదం.. కర్ణాటకలో జన నాయగన్ స్క్రీనింగ్ నిలిపివేత..
పార్లమెంట్ ప్రాంగణంలో హుండీ పెట్టిన ఎంపీలు.. రాహుల్ గాంధీ ఏం చేశారంటే..? చూడండి..