ఇంట్లోనే ఆధార్ లింక్‌డ్ మొబైల్ నంబర్‌ను మార్చుకోండి.. అదెలాగంటే..
ABN , Publish Date - Aug 17 , 2026 | 03:14 PM
మీ ఆధార్‌కు వేరే వాళ్ల మొబైల్ నంబర్ లింక్ చేసి ఉందా? మీ ఆధార్‌కు మీ మొబైల్ నంబర్ లింక్ చేయాలని అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్లకుండా.. ఇంట్లోనే ఉండి మీ ఆధార్ లింక్‌డ్ మొబైల్ నంబర్‌ను మార్చుకోవచ్చు. అదెలాగో ఈ కథనంలో తెలుసుకుందాం..
ప్రస్తుత కాలంలో ఆధార్ కార్డు చాలా కీలకం అని చెప్పాలి. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వేతర పనులు, ఆర్థిక లావాదేవీలు.. ఇలా ఒకటేమిటి.. చాలా పనులకు ఆధార్ అవసరంగా మారిపోయింది. అందుకే.. చాలా మంది ఎల్లప్పుడూ తమ వెంట ఆధార్ తీసుకెళ్తుంటారు. ఆధార్ కార్డులో సదరు వ్యక్తికి సంబంధించిన సమస్త సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. 12 అంకెలు గల ఆధార్ నంబర్‌లో వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ కూడా లింక్ చేస్తారు. ఇలా లింక్ చేయడం వలన ఆధార్ వినియోగాన్ని మరింత సురక్షితం చేసే అవకాశం ఉంటుంది. చాలా మంది తమ ఆధార్ కార్డుకు తమ మొబైల్ నంబర్ కాకుండా కుంటుంబంలో ఇతరుల మొబైల్ నెంబర్‌ను లింక్ చేస్తుంటారు. మీరు కూడా అలాగే చేశారా? మీ ఆధార్ కార్డుకు.. మీ మొబైల్ నంబర్‌ను లింక్ చేయాలనుకుంటున్నారా? ఇందుకోసం మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు. జస్ట్ ఇంట్లోనే కూర్చొని మీ ఆధార్ లింక్‌డ్ మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు. అదెలాగో స్టెప్ టు స్టెప్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఆధార్ లింక్‌డ్ మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేసే విధానం ఇలా..
స్టెప్ - 1
కొత్త ఆధార్ యాప్‌ను(mAadhaar app) ఉపయోగించి ఆధార్‌కు అనుసంధానించిన మొబైల్ నంబర్‌ను మార్చుకోవచ్చు.
ముందుగా కొత్త ఆధార్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, ఆపై ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
ఆ తరువాత ఈ యాప్‌లోకి లాగిన్ అవ్వాలి. ఇందుకోసం ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
స్టెప్ - 2
ఆ తరువాత ఫేస్ అథెంటికేషన్ ద్వారా యాప్‌లోకి లాగిన్ అవ్వొచ్చు.
లాగిన అయిన తరువాత యాప్‌లో చాలా ఆప్షన్లు కనిపిస్తాయి. సర్వీసెస్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
ఆ తర్వాత అక్కడ మొబైల్ నంబర్ అప్‌డేట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్ - 3
ఆ తర్వాత మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయడానికి కొనసాగించు (Continue) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
ఆధార్‌తో అనుసంధానం చేయాలనుకుంటున్న మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
ఇప్పుడు ఎంటర్ చేసిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది, దానిని ఇక్కడ ఎంటర్ చేయాలి.
స్టెప్ - 4
ఇప్పుడు మీరు ఫేస్ రికగ్నిషన్ (ఫేస్ ధృవీకరణ) చేసుకోవాలి.
ఆ తర్వాత రూ. 75 ఆన్‌లైన్ ఫీజు చెల్లించాలి.
ఫీజులు చెల్లించిన తర్వాత సమర్పించండి(Submit) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
15 రోజుల్లోగా మీ కొత్త మొబైల్ నంబర్ ఆధార్‌లో అప్‌డేట్ అవుతుంది.
గమనిక: ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ప్రస్తుతం ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ పని చేస్తున్నట్లయితే మీరు ఆధార్ యాప్ ద్వారా కొత్త మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ నంబర్ మనుగడలో లేకపోయినట్లయితే.. కొత్త మొబైల్ నంబర్ లింక్ చేయడం కోసం ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది.