డిజిటల్ అరెస్ట్ స్కాం.. వృద్ధురాలి నుంచి రూ.24 కోట్లు కొట్టేసిన మోసగాళ్లు..
ABN , Publish Date - May 25 , 2026 | 06:58 AM
బెంగళూరుకు చెందిన 74 ఏళ్ల ఓ వృద్ధురాలు డిజిటల్ అరెస్ట్ స్కాం బారిన పడి 24 కోట్ల రూపాయలు మోస పోయింది. కేటుగాళ్లు ఆమె నుంచి ఇంకా పెద్ద మొత్తంలో డబ్బులు దండుకోవాలని చూశారు. పోలీసుల ఎంట్రీతో కథ అడ్డం తిరిగింది. సైబర్ నేరగాళ్లు పోలీసులకు చిక్కి జైలు పాలయ్యారు.
బెంగళూరు, మే 25: 74 ఏళ్ల ఓ వృద్ధురాలు డిజిటల్ అరెస్ట్ స్కాం బారిన పడి 24 కోట్ల రూపాయలు మోస పోయింది. కేటుగాళ్లు ఆమె నుంచి ఇంకా పెద్ద మొత్తంలో డబ్బులు దండుకోవాలని చూశారు. పోలీసుల ఎంట్రీతో కథ అడ్డం తిరిగింది. సైబర్ నేరగాళ్లు పోలీసులకు చిక్కి జైలు పాలయ్యారు. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరుకు చెందిన లక్ష్మీ రామమూర్తి అనే మహిళను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. డిజిటల్ అరెస్ట్ స్కాంకు తెరతీశారు. సీబీఐ, ఈడీ అధికారులమని చెప్పి ఆమె నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు దండుకోవడం మొదలెట్టారు.
సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మిన బాధితురాలు.. భయంతో కోట్ల రూపాయల డబ్బులు వారికి ట్రాన్స్‌ఫర్ చేయటం మొదలెట్టింది. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ఏప్రిల్ 24వ తేదీ వరకు బాధితురాలు మోసగాళ్లకు ఏకంగా 24 కోట్ల రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేసింది. మొత్తం 24 వేరు వేరు ట్రాన్సాక్షన్స్ ద్వారా 23 మ్యూల్ బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు పంపింది. ఏప్రిల్ 24వ తేదీన మోసగాళ్లు బాధితురాలి నుంచి మరింత ఎక్కువ డబ్బులు దండుకోవాలని చూశారు. ఈ నేపథ్యంలోనే బ్యాంకులో 3 కోట్ల రూపాయలు గోల్డ్ లోన్ తీసుకుంది లక్ష్మీ. ఆ డబ్బులను మోసగాళ్లకు పంపడానికి సిద్ధం చేసింది.
బ్యాంక్ అధికారులకు లక్ష్మీపై అనుమానం వచ్చింది. బ్యాంకు ఖాతాను హోల్డ్‌లో పెట్టారు. వెంటనే కర్ణాటక సైబర్ కమాండ్ యూనిట్‌కు సమాచారం అందించారు. అధికారులు బాధితురాలి ఇంటి దగ్గరకు వెళ్లారు. ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. 3 కోట్ల రూపాయలు మోసగాళ్లకు చేరకుండా అడ్డుకున్నారు. లక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. స్కాం కోసం మోసగాళ్లు ఉపయోగించిన మ్యూల్ అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. దాదాపు 4 కోట్ల రూపాయలను విజయవంతంగా ఫ్రీజ్ చేశారు. కోర్టు ఆర్డర్స్ ద్వారా 1.46 కోట్లను రికవర్ చేశారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి
శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ డ్రైవర్ సజీవదహనం
మరోసారి భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..