రష్యా సైన్యంలోని 51 మంది భారతీయుల మృతి.. విదేశాంగ శాఖ సెక్రటరీ వెల్లడి
ABN , Publish Date - Sep 01 , 2026 | 09:00 AM
రష్యా సైన్యంలోని 51 మంది భారతీయులు మరణించారని విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ వెల్లడించారు.
ఇంటర్నెట్ డెస్క్: రష్యా సైన్యంలోని 51 మంది భారతీయులు మరణించారని విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ వెల్లడించారు. మొత్తం 227 మంది రష్యాలో సైన్యంలో చేరగా ఇప్పటివరకూ 139 మంది బయటకు వచ్చేశారని అన్నారు. మిగిలిన వారినీ వెనక్కు తీసుకొచ్చేందుకు రష్యాతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కిర్గిస్థాన్ పర్యటన నేపథ్యంలో సోమవారం మీడియా అడిగిన ప్రశ్నలకు విదేశాంగ శాఖ సెక్రటరీ ఈ వివరాలను వెల్లడించారు.
ఈ అంశంలో రష్యాతో వివిధ స్థాయిల్లో చర్చలు జరుగుతున్నాయని మిశ్రీ చెప్పారు. మాస్కోలోని భారతీయ ఎంబసీ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ భారతీయులను వెనక్కు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. భారతీయులు త్వరగా సైన్యం నుంచి డిశ్చార్జ్ అయ్యేలా రష్యా చర్చలు తీసుకోవాలని కోరినట్టు చెప్పారు.
రష్యా-భారత్ వాణిజ్యం గురించి కూడా మిశ్రీ మాట్లాడారు. గతేడాది భారత్‌లో రష్యన్ దిగుమతిదారుల సమావేశంలో అక్కడి సంస్థలు ఉత్సాహంగా పాల్గొన్నాయని చెప్పారు. భారత్ నుంచి దిగుమతులను పెంచేందుకు ఉత్సుకత ప్రదర్శించాయని చెప్పారు. తదుపరి రష్యాలో జరుగునున్న సమావేశంలో భారతీయ ఎగుమతిదారుల ఫోరం సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ఈ విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ సానుకూలంగా స్పందించారని అన్నారు.
షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఇటీవల కిర్గ్ రిపబ్లిక్ దేశ పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కూడా సమావేశం అయ్యారు. యుద్ధాలకు శాశ్వత ముగింపు పలికేందుకు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ వార్తలనూ చదవండి:
రైల్వే అభివృద్ధిలో తెలంగాణకు పెద్దపీట కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
మనీలాండరింగ్ కేసుల్లో ప్రతి రూ.100కు ఒక్క రూపాయే రికవరీ: సీజేఐ