రైల్వే అభివృద్ధిలో తెలంగాణకు పెద్దపీట కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
ABN , Publish Date - Sep 01 , 2026 | 06:46 AM
కేంద్ర ప్రభుత్వం రైల్వేల అభివృద్ధిలో తెలంగాణకు పెద్దపీట వేస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఏడాదికి సగటున రూ. 5,454 కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. పదేళ్లతో కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, స్టేషన్ల అభివృద్ధితో పాటు 100 కొత్త రైళ్లను ప్రవేశపెట్టిందని తెలిపారు.
గద్వాల/అలంపూరు చౌరస్తా/మహబూబ్‌నగర్ విద్యావిభాగం, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం రైల్వేల అభివృద్ధిలో తెలంగాణకు పెద్దపీట వేస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఏడాదికి సగటున రూ. 5,454 కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. పదేళ్లతో కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, స్టేషన్ల అభివృద్ధితో పాటు 100 కొత్త రైళ్లను ప్రవేశపెట్టిందని తెలిపారు. ఐదు వందే భారత్ రైళ్లను కేటాయించిందని చెప్పారు. అమృత్ భారత్ కింద ఏకకాలంలో 42 స్టేషన్ల అభివృద్ధి చేపట్టామన్నారు. సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో జోగుళాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. జోగుళాంబ, గద్వాల, మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. 2014కు ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఏడాదికి సగటున రూ.886 కోట్లు ఖర్చు చేస్తే 2025-26లో ఒక్క తెలంగాణలోనే రూ.5,454 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. 2009-14 మధ్య ఏడాదికి 87 కిలోమీటర్ల రైల్వే లైన్ల నిర్మాణం జరిగితే 2014 తర్వాత అది 880 కిలోమీటర్లకు పెరిగిందన్నారు.