Share News

గల్ఫ్‌లో తీవ్ర ఉద్రిక్తతలు.. చిక్కుల్లో 23 వేల మంది భారతీయులు

ABN , Publish Date - Mar 05 , 2026 | 05:36 PM

హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా నిలిచిపోయిన నౌకల్లో సుమారు 1074 మంది నావికులు ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

గల్ఫ్‌లో తీవ్ర ఉద్రిక్తతలు.. చిక్కుల్లో 23 వేల మంది భారతీయులు
Indians stranded Gulf crisis

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతంలో 23 వేల మంది భారతీయులు చిక్కుకుపోయినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ ఇజ్రాయెల్, అమెరికా దేశాలు దాడులకు దిగడంతో మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసి వేసింది. ఆ జలాల్లో ప్రయాణించే నౌకలపై దాడులు తప్పవని హెచ్చరించింది. దీంతో, ముడి చమురు రవాణాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి.

ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న పలు ఆయిల్ ట్యాంకర్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆయిల్ ట్యాంకర్‌లపై జరిగిన దాడుల్లో కొందరు మరణించారు. వీరిలో ఇద్దరు భారతీయులు ఉన్నట్టు కూడా వెలుగులోకి వచ్చింది. ఇక భారత్ జెండాలతో ప్రయాణిస్తున్న 36 నౌకలు కూడా అక్కడి జలాల్లో నిలిచిపోయాయి. వీటిల్లో అధిక శాతం ముడి చమురు రవాణా నౌకలేనని తెలుస్తోంది. వీటితో పాటు కొన్ని కమర్షియల్ కార్గో, ఎల్‌పీజీ గ్యాస్‌ను తరలించే నౌకలు కూడా ఉన్నాయి.


ఏడు నౌకలను స్వయంగా ప్రభుత్వ రంగ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్నట్టు సమాచారం. హోర్ముజ్ జలసంధికి పశ్చిమాన ఉన్న పర్షియన్ గల్ఫ్ జలాల్లో భారత్ జెండాలు ఉన్న 12 నౌకలు, తూర్పు వైపున ఉన్న గల్ఫ్ ఆఫ్ ఒమాన్ జలాల్లో మరో 24 నౌకలు ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు, సౌదీ అరేబియాకు సమీపంలోని ఎర్రసముద్రంలో భారత జెండాలున్న నౌకలు లేవని సమాచారం. రెండు నౌకలు మాత్రం ప్రస్తుతం గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌ జలాలను దాటుతున్నాయట. ఈ నౌకల్లో సుమారు 1,074 మంది భారతీయులు ఉన్నారట.

యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రాంతాల్లో పరిస్థితిని భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. ఆయా ప్రాంతాల్లోని నౌకలను జాగ్రత్తగా గమనిస్తోంది. అక్కడ ఇరుక్కుపోయిన భారతీయ సిబ్బందితో చర్చిస్తోంది. భారతీయ జెండాలు, సిబ్బంది ఉన్న నౌకల భద్రత కోసం పలు చర్యలు తీసుకుంటోంది. ఈ దిశగా మంగళవారం కేంద్ర షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ సమీక్షా సమావేశం నిర్వహించారు.


ఈ వార్తలూ చదవండి:

యుద్ధం కాదు.. చర్చలే పరిష్కారం: ప్రధాని మోదీ

బిహార్ సీఎం సంచలన ప్రకటన.. నేడే రాజ్యసభకు నామినేషన్!

Updated Date - Mar 05 , 2026 | 06:39 PM