ఈసీ చేయలేని పని చేసిన ఎథికల్ హ్యాకర్
ABN , Publish Date - Nov 26 , 2026 | 06:23 AM
సీబీఎస్ఈ ప్రవేశపెట్టిన ఆన్‌స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్‌ను పరిశీలించి 12వ తరగతి పరీక్షల్లో తన మార్కుల్లో లోపాలపై ప్రశ్నించిన ఎథికల్ హ్యాకర్ 18 ఏళ్ల సార్థక్ సిద్దాంత్ గుర్తున్నాడా.
సర్ జాబితాను సులువుగా సెర్చ్ చేసేలా చేసిన 18 ఏళ్ల సార్థక్ సిద్దాంత్..
యూపీలో ఓటరు జాబితా డిజిటలైజేషన్
న్యూఢిల్లీ, నవంబరు 25: సీబీఎస్ఈ ప్రవేశపెట్టిన ఆన్‌స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్‌ను పరిశీలించి 12వ తరగతి పరీక్షల్లో తన మార్కుల్లో లోపాలపై ప్రశ్నించిన ఎథికల్ హ్యాకర్ 18 ఏళ్ల సార్థక్ సిద్దాంత్ గుర్తున్నాడా.. నాడు సీబీఎస్ఈ అంశంలో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ టీనేజర్ ఇప్పుడు భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) చేయాల్సిన పనిని తాను చేసి మరోసారి వార్తల్లోకెక్కాడు. ఉత్తరప్రదేశ్ సర్ ప్రక్రియకు సంబంధించిన ఓటరు జాబితాలను సులభంగా సెర్చ్ చేసేలా సార్థక్ సిద్దాంత్ ఏకంగా ఓ డేటా బేస్ రూపొందించాడు. ఈసీ ఓటర్ల సమాచారాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే.. సార్థక్ ఆ సమాచారాన్ని ప్రజలు సులభంగా వినియోగించుకునేలా చేశాడు. సాధారణంగా ఈసీఐ ఓటరు జాబితాలను పీడీఎఫ్‌ల రూపంలో ఆన్‌లైన్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచుతుంది. స్కాన్ చేసిన ఫొటోల ఇమేజ్‌లు ఈ పీడీఎఫ్ ఫైల్స్‌లో ఉంటాయి. ప్రజలు ఈ పీడీఎఫ్ ఫైల్స్‌లో తమ పేర్లను వెతికిపట్టుకోవడం అంత సులువు కాదు.
ప్రజలకు తలకు మించిన భారంగా మారిన ఈ ప్రక్రియను సార్థక్ సిద్దాంత్ తన బృందంతో కలిసి సులభతరం చేశాడు. యూపీ 2024 లోక్‌సభ ఎన్నికల ఓటరు జాబితా, సర్ ముసాయిదా, తుది జాబితాలు, 2027 ముసాయిదా ఓటరు జాబితాలను తన ప్రాజెక్టులో చేర్చాడు. ఆయా ఓటరు జాబితాలకు సంబంధించిన 6.8 లక్షల పీడీఎఫ్ ఫైల్స్‌లో ఉన్న సమాచారాన్ని డిజిటైజేషన్ చేశాడు. 403 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 54.8 కోట్ల ఓటరు రికార్డులను ఒక్క చోటుకు చేర్చాడు. ఓసీఆర్(ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్) అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడి పీడీఎఫ్ ఫైల్స్‌లోని సమాచారాన్ని డిజిటల్ సమాచారంగా మార్చాడు. దీంతో వేల పేజీల్లో ఉన్న సమాచారాన్ని క్షణాల్లో సెర్చ్ చేయడం, వేర్వేరు జాబితాలతో సరిపోల్చడాన్ని సులువు చేశాడు. సార్దక్ చేసిన ఈ పనికి విపక్ష నేతలతోపాటు ప్రజలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు
ఈ వార్తలు కూడా చదవండి...
మత్స్యకారుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించాలి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి