వీసా కోసం మోసాలు!
ABN , Publish Date - Mar 15 , 2026 | 07:04 AM
అమెరికాలో వీసా నిబంధనలు కఠినతరం కావడంతో దొడ్డిదారిలో కుట్రపూరితంగా అయినా వీసాలు పొందేందుకు ప్రయత్నించిన 12మంది భారతీయులను ఎ్‌ఫబీఐ అధికారులు అరెస్టు చేశారు. శుక్రవారం ఒక్కరోజే...
దోపిడీలు చేసేది వాళ్లే.. బాధితులమని చెప్తూ వీసాలకు దరఖాస్తు చేసేదీ వాళ్లే
అమెరికాలో 12మంది భారతీయుల అరెస్టు
న్యూఢిల్లీ, మార్చి 14: అమెరికాలో వీసా నిబంధనలు కఠినతరం కావడంతో దొడ్డిదారిలో కుట్రపూరితంగా అయినా వీసాలు పొందేందుకు ప్రయత్నించిన 12మంది భారతీయులను ఎ్‌ఫబీఐ అధికారులు అరెస్టు చేశారు. శుక్రవారం ఒక్కరోజే 10మందిని అరెస్టు చేశారు. మస్సాచుసెట్స్‌లో వీరంతా 2023, మార్చి నుంచి ‘యూ-నాన్ ఇమ్మిగ్రేషన్’(యూ-వీసా) కోసం పలు కుట్రపూరిత నేరాలకు పాల్పడ్డారని అమెరికా న్యాయవిభాగం తెలిపింది. నేరాలకు పాల్పడిన వారిలో అమెరికా నుంచి బహిష్కరణకు గురైన దీపికాబెన్ పటేల్ ఉన్నట్టు తెలిపారు. ఈ మొత్తం కుట్రకు రాంభాయ్‌పటేల్ సూత్రధారి అని, 2023, మార్చిలో జరిగిన ఆరు దోపిడీలకు నేతృత్వం వహించినట్టు వివరించారు. అరెస్టు చేసిన వారిలో జితేంద్రకుమార్ పటేల్, మహేశ్‌కుమార్ పటేల్, సంజయ్‌కుమార్ పటేల్, రమేశ్‌భాయ్ పటేల్, అమితాబహెన్ పటేల్, రోణక్‌కుమార్ పటేల్, సంగీతాబెన్ పటేల్, మిన్‌కేశ్ పటేల్, సొనాల్ పటేల్, మితుల్ పటేల్, రాంభాయ్ పటేల్, బల్వీందర్‌సింగ్ ఉన్నారు.
బాలీవుడ్‌ను తలపించే స్ర్కిప్ట్
దొంగలూ వారే.. బాధితులూ వారే. అమెరికా వీసా కుట్రలో సారాంశం ఇదే!. మస్సాచుసెట్స్‌లోని పలు లిక్కర్ దుకాణాలు సహా ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలో కొందరు ఓనర్లుగా, గుమస్తాలుగా చేరుతారు. అనంతరం.. ఓ సరైన సమయం చూసుకుని ఈ బృందంలోని కొందరు.. ఆయా దుకాణాలపై నకిలీ తుపాకులతో దాడులు చేసి.. యజమానిని, గుమస్తాలను బెదిరిస్తారు. అదేవిధంగా కొంత సొమ్మును దోచుకున్నట్టు నటిస్తారు. ఈ ఘటన సీసీ టీవీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యేలా చూసుకుంటారు. దొంగలు వెళ్లిపోయాక దుకాణ యజమాని, గుమాస్తాలు పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. తమపై దాడులు జరిగాయని విలపిస్తూ సీసీటీవీ ఫుటేజీని కూడా ఇస్తారు. అనంతరం..యూ-వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటారు. ఇదంతా పక్కా ప్రణాళికతో బాలీవుడ్ సినిమా స్ర్కిప్టును తలపించేలా చేయడం విశేషం. ఇలా, 2023లో దోపిడీ బాధితులుగా పేర్కొంటూ ఇద్దరు వ్యక్తులు యూ-వీసా కోసం దరఖాస్తు చేసుకున్నట్టు ఎఫ్‌బీఐ గుర్తించింది. అంతేకాదు.. ఓ దుకాణాన్ని వినియోగించుకున్నందుకు రాంభాయ్ పటేల్ 20 వేల డాలర్లు చెల్లించినట్టు విచారణలో తేలింది. దీంతో అప్పట్లోనే పటేల్‌ను అరెస్టు చేశారు.
ఏమిటీ యూ-వీసా?
కొన్ని కొన్ని నేర ఘటనలకు సంబంధించి బాధితులుగా ఉన్న వారికి అమెరికాలో యూ-వీసా లభిస్తుంది. ఆయా ఘటనల కారణంగా శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు పడుతున్నవారు కొన్నాళ్లపాటు అమెరికాలో ఉండేందుకు యూ-వీసా దోహదపడుతుంది. అదేవిధంగా ఈ కేసుల విచారణ సాగినంత కాలం, తీర్పు వచ్చేంతవరకు కూడా బాధితులు అమెరికాలో ఉండొచ్చు.
ఇవి కూడా చదవండి...
గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు ఫోకస్.. మంత్రులతో చర్చ
కేంద్రమంత్రి అన్నపూర్ణా దేవితో మంత్రి సీతక్క భేటీ.. చర్చించిన అంశాలివే