Share News

10 టన్నుల స్టీల్‌ బ్రిడ్జిని తెల్లవారేసరికి మాయం చేశారు!

ABN , Publish Date - Jan 25 , 2026 | 02:52 AM

అక్కడ 40 ఏళ్లుగా ఓ స్టీల్‌ బ్రిడ్జి ఉంది... దాని పొడవు 70 అడుగులు.. బరువు 10 టన్నులకు పైనే...! దానిపై చోరుల కన్ను పడింది. అంతే...

10 టన్నుల స్టీల్‌ బ్రిడ్జిని తెల్లవారేసరికి మాయం చేశారు!

  • తుక్కుగా అమ్ముకునేందుకు దొంగల లాఘవం

కోర్బా, జనవరి 24 : అక్కడ 40 ఏళ్లుగా ఓ స్టీల్‌ బ్రిడ్జి ఉంది... దాని పొడవు 70 అడుగులు.. బరువు 10 టన్నులకు పైనే...! దానిపై చోరుల కన్ను పడింది. అంతే... తెల్లవారేసరికి దాన్ని మాయం చేశారు...! తెల్లవారాక బ్రిడ్జి కనిపించక స్థానికులు బిత్తరపోయారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం కోర్బా నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కోర్బా నగరంలో ఓ కాలువపై నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జి అక్కడి ధోదిపర ఏరియా 17వ వార్డు వాసులకు నడక దారిగా ఉంది. ఈ నెల 18న తెల్లవారాక చూడగా స్థానికులకు ఆ బ్రిడ్జి కనిపించలేదు. దీంతో స్థానిక కార్పొరేటర్‌ లక్ష్మణ్‌ శ్రివాస్‌ స్థానిక సీఎస్‌ఈబీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని కోర్బా అదనపు ఎస్పీ లఖన్‌ పాట్లే విలేకరులకు చెప్పారు.


కేసు విచారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విచారణలో గ్యాస్‌ కట్టర్లు ఉపయోగించి బ్రిడ్జిని కట్‌ చేసినట్లు తేలిందన్నారు. తుక్కుగా అమ్ముకొనేందుకు దాన్ని ముక్కలు చేసి చోరీ చేశారని వివరించారు. మొత్తం 15 మంది ఈ పని చేయగా... వారిలో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన 10 మంది కోసం గాలిస్తున్నారు. నిందితులు కాలువలో దాచిన 7టన్నుల బ్రిడ్జి ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన స్టీల్‌ను తరలించిన వాహనాన్ని కూడా సీజ్‌ చేశారు. మిగిలిన స్టీల్‌ను ఎక్కడ అమ్మారనే విషయంపై విచారిస్తున్నారు.

Updated Date - Jan 25 , 2026 | 08:43 AM