మెరుగైన వైద్యం కోసమే భద్రాచలం తరలించాం
ABN , Publish Date - Oct 06 , 2026 | 05:57 AM
ఆంధ్రప్రదేశలో మలేరియా నివారణ మాత్రలు వికటించి ఒక చిన్నారి మృతి చెందిన ఘటనలో మెరుగైన వైద్యం కోసమే తెలంగాణలోని భద్రాచలం ఆస్పత్రికి తరలించామని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది.
70 మందికి మలేరియా మాత్రలు ఇస్తే ఒక చిన్నారి మృతి
మిగిలిన మాత్రలను ల్యాబ్ పరీక్షలకు పంపించాం
చిన్నారి జమున మృతి కేసులో సుప్రీంలో ఏపీ ప్రభుత్వం
హైకోర్టు పర్యవేక్షణే సమంజసం.. విచారణకు స్వీకరించండి
ఎటపాక ఘటనపై ఏపీ హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచన
న్యూఢిల్లీ, ఎటపాక, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశలో మలేరియా నివారణ మాత్రలు వికటించి ఒక చిన్నారి మృతి చెందిన ఘటనలో మెరుగైన వైద్యం కోసమే తెలంగాణలోని భద్రాచలం ఆస్పత్రికి తరలించామని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. పోలవరం జిల్లా ఎటపాక మండలం, విస్సాపురం పంచాయతీలోని గొల్లగుప్ప వలస ఆదివాసీ గ్రామంలో గతనెల 1న యాంటీ మలేరియా మాత్రలు వికటించి మడివి జమున(7) మృతి చెందగా మరో 52 మంది అస్వస్థతకు గురైన ఘటనపై సుప్రీంకోర్టు సోమవారం సుమోటోగా విచారణ జరిపింది. ఈ ఘటన అత్యంత తీవ్రమైనదని, పూర్తిస్థాయి దర్యాప్తుతో పాటు పర్యవేక్షణ అత్యవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్ వి.మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. దర్యాప్తు పురోగతిని, పరిణామాలను నిశితంగా పరిశీలించేందుకు రాష్ట్ర హైకోర్టే సరైన వేదికంటూ కేసును ఏపీ హైకోర్టు పర్యవేక్షణకు బదిలీ చేస్తూ తీర్పునిచ్చింది. తొలుత.. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ.. ఘటనపై అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టిందన్నారు. బాలిక పోస్టుమార్టం పూర్తయిందని, మరణానికి కచ్చితమైన కారణాలు తేలేందుకు విస్రా నివేదిక కోసం వేచి చూస్తున్నామని తెలిపారు. ‘గ్రామంలో మొత్తం 70 మందికి మలేరియా మాత్రలు పంపిణీ చేయగా ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆ బ్యాచ్‌కు చెందిన మిగిలిన మాత్రలను వెంటనే పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించాం.
కానీ ఆ మాత్రల్లో ఎలాంటి లోపాలు లేనట్టు పరీక్షల అనంతరం నిర్ధారణ అయింది. బాధిత చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతోనే తెలంగాణలోని భద్రాచలం ఆసుపత్రికి తరలించాం’ అని లూథ్రా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ఈ కేసుకు సంబంధించిన న్యాయ ప్రక్రియలన్నింటినీ ఏపీ హైకోర్టుకు బదిలీ చేస్తున్నట్లు ప్రకటించింది. బాధితుల ఆరోగ్య భద్రత, దర్యాప్తు పురోగతి దృష్ట్యా ఈ కేసును ప్రాధాన్యతా క్రమంలో విచారణకు స్వీకరించాలని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సుప్రీంకోర్టు సూచించింది.
ఈ వార్తలనూ చదవండి:
ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్
ఏపీలో నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం