వేసవిలో కుక్కలు రెచ్చిపోయి కరుస్తాయి.. ఎందుకో తెలుసా..?
ABN , Publish Date - Apr 07 , 2026 | 05:55 PM
తెలుగు రాష్ట్రాల్లో కుక్క కాట్ల ఘటనలు అధికంగా ఉన్నాయి. ఏడాదిలో లక్షల సంఖ్యలో ఈ ఘటనలు ఉన్నాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వేసవిలో కుక్కలు మరింత రెచ్చిపోతాయి.
వేసవి కాలంలో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఇవి మనుషులపైనే కాదు.. జంతువుల మీద కూడా తీవ్ర ఒత్తిడిని పెంచుతాయి. ఇంట్లో కుక్కలే కాదు.. వీధి కుక్కలు సైతం అధిక ఉష్ణోగ్రతల ప్రభావానికి గురవుతాయి. దీంతో కుక్కల ప్రవర్తనలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకుంటాయి. దాంతో కుక్కలు మనుషులపై దాడి చేసే ఘటనలు గణనీయంగా పెరుగుతున్నాయని అధ్యయనాలు సైతం సూచిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఏటా ఈ కుక్క కాట్ల ఘటనల సంఖ్య భారీగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏటా 4 లక్షలు ఉండగా.. తెలంగాణలో 3.33 లక్షల కుక్క గాట్ల సంఘటనలు చోటు చేసుకుంటున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ కుక్క కాట్ల వల్ల మరణాలు సైతం భారీగా ఉంటున్నాయి. వేసవి సమయంలో పిల్లలను కుక్కలకు సాధ్యమైనంత దూరంగా ఉంచాలని పశు వైద్యులు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.
వేడి ప్రభావం కారణంగా..
మనుషుల్లో వలే కుక్కలకు చెమట గ్రంథులు తక్కువగా ఉంటాయి. అవి శరీర ఉష్ణోగ్రతను సులభంగా నియంత్రించుకోలేవు. దాంతో వేసవిలో కుక్కలు వేడితో కూడిన ఒత్తిడికి గురవుతాయి. వేసవిలో నీటి కొరత అధికంగా ఉంటుంది. అలాగే విధి కుక్కలకు ఆహారం కూడా లభించదు. ఈ నేపథ్యంలో కుక్కల్లో అధిక ఒత్తిడిని ప్రేరేపిస్తాయి. అలాంటి పరిస్థితుల్లో కుక్కల్లో చిరాకు, అసహనం పెరుగుతుంది.
వేసవిలో వేడి అధికంగా ఉండడంతో.. త్వరగా ఆగ్రహానికి లోనవుతాయి. ఆకలి, దాహం తదితర అంశాలు వాటిలో దాడి స్వభావాన్ని పెంచుతాయి. కొన్ని సార్లు ఎవరు ఏమి అనకపోయినా.. కుక్కలు వాతంతటికి అవే మనుషులపై దాడి చేస్తాయి.
ఈ వేసవిలో ఆహారం, నీరు దొరకక పోవడంతో.. ఇతర ప్రాంతాలకు కుక్కలు వెళ్లతాయి. ఆ సమయంలో అక్కడ నివసిస్తున్న కుక్కలతో ఘర్షణ జరుగుతుంది. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న మనుషులపై సైతం దాడికి కుక్కలు దిగుతాయి.
ఈ జాగ్రత్తలు పాటించాలి..
కుక్క కళ్లలోకి నేరుగా చూడకూడదు. అది సవాల్‌గా భావిస్తుంది.
రాళ్లు విసరడం, చేతులు ఎత్తడం వంటి చర్యలు వాటిని రెచ్చగొడతాయి.
కుక్క దగ్గరకు వస్తే పరిగెత్తకుండా నెమ్మదిగా ఆగాలి.
కుక్కలు ఘర్షణ పడుతున్నప్పుడు వాటి వద్దకు వెళ్ల కూడదు.
పెంపుడు కుక్కలను తలపై కాకుండా నడుంపై నిమరాలి.
కుక్క కరిస్తే తక్షణమే ఇలా చేయండి..
కుక్క కరిచిన వెంటనే.. గాయాన్ని సబ్బు, మంచి నీటితో కనీసం 10 నుంచి 15 నిమిషాలు కడగాలి. అలా చేయడం వల్ల రేబిస్ వైరస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
గాయాన్ని శుభ్రం చేసిన తర్వాత.. దానిపై యాంటిసెప్టిక్ క్రీమ్ లేదా లోషన్ రాయాలి.
ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. వైద్యుడి సలహా మేరకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలి.
కుక్క కరిచిన రోజుతోపాటు 3,7,14, 28వ రోజుల్లో వ్యాక్సిన్ వైద్యుని సలహాతో తీసుకోవాలి.
కుక్క చిన్నగా కరిచినా.. చర్మంపైన గీ పడినా కూడా వ్యాక్సిన్ తీసుకోవాలి. ఎందుకంటే రేబిస్ ప్రాణాంతకమైంది.
కుక్క కరవడం వల్ల గాయం తీవ్రంగా ఉంటే.. కుట్లు వేయవద్దు. అలా చేస్తే రేబిస్ వైరస్ గాయం లోపలే ఉండిపోయే ప్రమాదం ఉంది.
అసలు ఇలా చేయకండి..
గాయంపై కారం, ఉప్పు, పసుపు తదితర పదార్థాలు పెట్టవద్దు.
గాయాన్ని గట్టిగా కట్టకూడదు.