రైలులో ఈ సమస్యలు వస్తే వెంటనే ఫిర్యాదు చేయొచ్చు
ABN , Publish Date - Jul 12 , 2026 | 12:03 PM
రైలు ప్రయాణంలో సమస్యలు ఎదురైనా చాలామంది మౌనంగా భరిస్తుంటారు. అయితే భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం ప్రతి ప్రయాణికుడికి పలు చట్టపరమైన హక్కులు ఉన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా రోజూ కోట్లాది మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. ముఖ్యంగా సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు ఎక్కువ మంది రైలునే ఎంచుకుంటారు. అయితే ప్రయాణ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను చాలామంది మౌనంగా భరిస్తుంటారు. కానీ భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం.. ప్రయాణికులకు కొన్ని ముఖ్యమైన హక్కులు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవడం ప్రతి ప్రయాణికుడికి అవసరం.
ఫిర్యాదు చేసే హక్కు
స్లీపర్ లేదా ఏసీ కోచ్‌లో రిజర్వేషన్‌తో ప్రయాణిస్తున్న ప్రయాణికుడిని సరైన కారణం లేకుండా ఎవరూ కోచ్ నుంచి దించలేరు. టీటీఈ కూడా అనుచితంగా ప్రవర్తించే హక్కు లేదు. అలాంటి పరిస్థితి ఎదురైతే వెంటనే రైల్వే హెల్ప్‌లైన్ 139కు కాల్ చేయవచ్చు లేదా రైల్ మదద్ (Rail Madad) యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
కోచ్‌లో సౌకర్యాలు సరిగా లేకపోతే
సీటు విరిగిపోవడం, కోచ్ పరిశుభ్రంగా లేకపోవడం, ఏసీ పనిచేయకపోవడం, ఛార్జింగ్ పాయింట్ పనిచేయకపోవడం, దుప్పట్లు లేదా బెడ్‌రోల్స్ సరిగా లేకపోవడం, ఆహారం నాణ్యత బాగోలేకపోవడం వంటి సమస్యలపై కూడా రైల్వే అధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.
తోటి ప్రయాణికులు ఇబ్బంది పెడితే
ఎవరైనా మద్యం సేవించడం, ధూమపానం చేయడం, పెద్ద శబ్దంతో పాటలు పెట్టడం లేదా ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే వెంటనే 139కు ఫిర్యాదు చేయవచ్చు. అవసరమైతే రైల్వే రక్షణ దళం (RPF) లేదా రైల్వే పోలీసులను కూడా సంప్రదించవచ్చు.
టీటీఈపై కూడా ఫిర్యాదు చేయొచ్చు
రైల్వే నిబంధనల ప్రకారం.. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు స్లీపర్, ఏసీ కోచ్‌లలో ప్రయాణికులను నిద్రలేపి టికెట్ తనిఖీ చేయరాదు. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే టీటీఈపై కూడా ఫిర్యాదు చేసే హక్కు ఉంటుంది. అయితే రాత్రి 10 గంటల తర్వాత రైలు ఎక్కిన ప్రయాణికులకు ఈ మినహాయింపు వర్తించదు.
ప్రయాణంలో అనారోగ్యం వస్తే
ప్రయాణ సమయంలో ఆరోగ్య సమస్య తలెత్తితే వెంటనే టీటీఈ లేదా స్టేషన్ అధికారులకు సమాచారం ఇవ్వాలి. అవసరమైతే రైల్వే వైద్యులు ప్రథమ చికిత్స అందిస్తారు. పరిస్థితి తీవ్రంగా ఉంటే సమీప ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు కూడా చేస్తారు.
లగేజీ భద్రపరిచే సౌకర్యం
ప్రధాన రైల్వే స్టేషన్లలో క్లాక్‌రూమ్, లాకర్ సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. నిర్ణీత రుసుము చెల్లించి ప్రయాణికులు తమ సామానును గరిష్ఠంగా ఒక నెల వరకు భద్రపరచుకోవచ్చు.
రైలులో ప్రయాణించే ప్రతి ఒక్కరూ ఈ హక్కుల గురించి తెలుసుకుని అవసరమైనప్పుడు వినియోగించుకోవడం ద్వారా సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ఫ్రిజ్ లేకుండానే టమోటాలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా?
ఈ తేదీల్లో పుట్టినవారిది రాజసమైన వ్యక్తిత్వం..!