Share News

అక్కడ అసలైన ఆనందం కనిపించింది.. రావి రమేశ్ భూటాన్ యాత్ర విశేషాలు

ABN , Publish Date - May 10 , 2026 | 11:41 AM

ఇటీవల భూటాన్‌లో పర్యటించిన కృష్ణా జిల్లా వాస్తవ్యులు రావి రమేశ్ బాబు అక్కడి విశేషాలను చూసి ఆశ్చర్యపోయారు. మరి ఆ అనుభవాలు ఏమిటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

అక్కడ అసలైన ఆనందం కనిపించింది.. రావి రమేశ్ భూటాన్ యాత్ర విశేషాలు
Ravi Ramesh Babu Bhutan Tour

ఇంటర్నె్ట్ డెస్క్: వీల్‌చైర్‌కే పరిమితం కావాల్సి వస్తుందన్న డాక్టర్ల అంచనాలను తలకిందులు చేస్తూ తన జీవితాన్ని మేలి మలుపు తిప్పుకున్న వ్యక్తి కృష్ణాజిల్లాకు చెందిన రావి రమేశ్ బాబు. కాలు, వెన్నెపూస బలహీనపడి నడవలేని స్థితికి చేరుకున్న ఆయన ఆ తరువాత పట్టుదలతో మారథాన్‌లల్లో పాల్గొనే స్థాయికి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నారు. యువతతో పోటీ పడుతూ సైకిల్‌పై యాత్రలు చేశారు. తాజాగా భూటాన్ పర్యటనకు వెళ్లిన ఆయన అక్కడి విశేషాలను చూసి ఆశ్చర్యపోయారు. మరి ఆ అనుభవాలు ఏమిటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం పదండి..

భూటాన్‌లో నా పర్యటన..

భూటాన్ యాత్ర అంటే కొత్త ప్రదేశాన్ని సందర్శించడమే కాదు.. అది కనువిప్పు కలిగించే ఒక అద్భుత అనుభవం. ఈ యాత్ర ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చింది. సమాజం, జీవితానికి సంబంధించి ఎన్నో గొప్ప పాఠాలను తెలియజేసింది.

భూటాన్ ప్రజల జీవనశైలిని చూసి ఎన్నో కొత్త విషయాలను నేర్చుకోవచ్చు. అక్కడి జీవన విధానంలో నిరాడంబరత, సమతౌల్యం, ఆత్మసంతృప్తి, అసలైన ఆనందం కనిపిస్తుంటాయి. భూటాన్ వాస్తవానికి చిన్న దేశమే. జనాభా దాదాపు పది లక్షలు. ఆర్థిక వనరులూ పరిమితమే. కానీ వారి సంస్కృతి మాత్రం సుసంపన్నం. ప్రజల క్రమశిక్షణ, ఆ మైండ్‌సెట్ అద్భుతంగా అనిపిస్తాయి. నిత్యం సంతృప్తిగా, ఆనందంతో కనిపించే అక్కడి జనాలను చూశాక ఆ లక్షణాలు భూటాన్‌కు వెళ్లిన వారికీ అలవడతాయని చెప్పకతప్పదు.

Bhutan Tour 3.jpg


పరిశుభ్రతకు, ప్రకృతి పరిరక్షణకు వారు ఇచ్చే ప్రాధాన్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ విషయంలో ప్రతిఒక్కరూ వారి నుంచి ఎన్నో అమూల్యమైన విషయాలను నేర్చుకోవచ్చు. 70 శాతం అటవీ ప్రాంతం ఉన్న ఆ దేశంలో ప్రజలకు ప్రకృతిపై ఉన్న గౌరవం ఎంతో గొప్పది. ప్రతి పౌరుడు తమ దేశం పట్ల ఎంతో బాధ్యతతో ఉన్నట్టు కనిపిస్తారు. అక్కడి ప్రజలకు తమ రాజు అంటే ఎంతో గౌరవం. వారికి తమ దేశ వ్యవస్థలపై నమ్మకం కూడా ఎక్కువే. ఇవన్నీ వారి నడవడికలో కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. తమ దేశంలోని పరిస్థితులు, రాజకీయ నాయకులపై అసంతృప్తితో ఉండేవారు మాకు దాదాపుగా కనిపించలేదనే చెప్పాలి. దేశంపై ప్రజలందరికీ సమిష్టి బాధ్యత ఉందన్న భావనలో వారిలో కనిపించింది.

అసలైన ప్రజల అవసరాలపైనే అక్కడి ప్రభుత్వం కూడా దృష్టి పెడుతోంది. అక్కడి ప్రజలకు విద్య, వైద్యం ఉచితమే. ఇంతకుమించిన ప్రచార ఆర్భాటాలు, అవధులు దాటిన ఆశలు కనిపించవు. తమకున్న పరిమిత వనరులతోనే వారు సమర్థత కనబరుస్తూ అద్భుతమైన ప్రగతిని సాధించారు. పరిశుభ్రమైన వీధులు, పార్కులు, భద్రత, మౌలిక వసతులు వంటివన్నీ ఏర్పాటు చేసుకున్నారు.

Bhutan Tour 2.jpg


అక్కడ కుల వ్యవస్థ లేకపోవడంతో ప్రజలందరూ ఐకమత్యంతో ఉంటారు. చిన్న చిన్న సమూహాలుగా విడిపోకుండా తామంతా ఒక్కటే అన్న భావన వారిలో కనిపిస్తుంది. బౌద్ధమత విలువలనూ పాటిస్తూ అక్కడి ప్రజలు కేవలం స్వలాభమే పరమావధిగా కాకుండా సర్వమానవ కల్యాణం కోసం ప్రార్థిస్తారు.

ఒక దేశం విజయం సాధించిందనడానికి కొలమానం ఏమిటి? బిలియన్ డాలర్ల బడ్జెట్టా? భారీ స్థాయిలో మౌలిక వసతులా? అంటే ఇవేమీ కాదని భూటాన్ చెబుతోంది. ప్రజలు ప్రశాంతంగా గౌరవంగా నివసించేందుకు కావాల్సిన వ్యవస్థను భూటాన్ రూపొందించుకుంది. ప్రపంచానికి ఆ దేశం చెప్పదలుచుకున్న అదిపెద్ద గుణపాఠం అదే. నిరాడంబర జీవనానికి మించిన అభివృద్ధి మరొకటి ఉండదేమోనని భూటాన్‌ను చూస్తే అనిపిస్తుంది.

Bhutan Tour 4.jpg


ఈ వార్తలనూ చదవండి:

అడ్వెంచర్ ప్రేమికులకు బెస్ట్ డెస్టినేషన్ లావోస్

జాగ్రత్త.. పడవ ఎక్కే ముందు ఈ విషయాలు గుర్తించుకోండి

Updated Date - May 10 , 2026 | 12:11 PM