Kadamakudy Travel Guide: కేరళ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గ్రామాన్ని చూడకుండా తిరిగి రావొద్దు
ABN , Publish Date - Jan 15 , 2026 | 06:45 PM
కేరళ ట్రిప్ ప్లాన్ చేసేవారు అక్కడి వాటర్ విలేజస్‌ను తప్పక సందర్శించి రావాలని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ గ్రామాల విశిష్టత ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: భూలోకస్వర్గాన్ని తలపించే ప్రదేశం భారత్‌లో ఏదైనా ఉందీ అంటే అది కేరళ రాష్ట్రమే. కేరళను సందర్శించిన ప్రతి ఒక్కరూ చెప్పేమాట ఇది. అక్కడి సరస్సులు, సముద్రతీర అందాలు, పచ్చని పొలాలు, ప్రశాంతమైన జీవనశైలి.. ఇలా కేరళ గొప్పదనం గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. అయితే, కేరళకు వెళ్లే ప్రతి ఒక్కరూ తప్పకుండా అక్కడి వాటర్ విలేజెస్‌ను సందర్శించాలని అనుభవజ్ఞులు చెబుతారు.
ఏమిటీ వాటర్ విలేజెస్
అలెప్పీకి సమీపంలో ఉండే కొన్ని గ్రామాలు వాటర్ విలేజెస్‌గా ప్రసిద్ధి చెందాయి. అంటే నీటిపై తేలియాడుతున్నట్టు కనిపించే గ్రామాలన్న మాట. ఇక్కడ రోడ్లకు బదులు కాలవలు కనిపిస్తుంటాయి. జనాలు పడవల్లో ఒక చోట నుంచి మరొకచోటకు ప్రయాణిస్తుంటారు. కొత్త వారికి మాత్రం ఈ దృశ్యాలు అద్భుతంగా ఉంటాయని అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇక్కడి మార్కెట్‌లు, స్కూళ్లు కూడా నీటిపై తేలియాడుతున్నట్టు కనిపిస్తాయి. దీంతో, ఈ గ్రామీణ జీవితాన్ని సందర్శించేందుకు టూరిస్టులకు క్యూకడుతుంటారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కదమకుడి అనే వాటర్ విలేజ్ వీడియో తెగ వైరల్ అవుతోంది. కొచ్చీకి కొద్ది దూరంలో ఉన్న 14 చిన్న ద్వీపాల సముదాయమే ఈ గ్రామం. ఈ ప్రాంతాన్ని కచ్చితంగా ఒక్కసారైనా చూడాలనేది నిపుణులు చెప్పేమాట.
కదమకుడికి వెళ్లాలంటే..
కదమకుడి గ్రామానికి కార్లు, బస్సులు లేదా నావల్లో చేరుకోవచ్చు. కారులో వెళ్లే వారు కొచ్చీ నుంచి ఎన్‌హెచ్ 66 హైవే ద్వారా కదమకుడి వరకూ వెళ్లొచ్చు. ఎన్‌హెచ్996ఏ రోడ్డు మీదుగా ఎడపల్లి జంక్షన్ నుంచి కూడా కదమకుడికి చేరుకోవచ్చు.
కదమకుడికి నేరుగా ఆర్‌టీసీ బస్సులు లేకపోయినప్పటికీ నార్త్ పరావుర్ వరకూ వెళ్లే బస్సు ఎక్కి వరపుళ వద్ద దిగి అక్కడి నుంచి ఆటోల్లో వెళ్లొచ్చు. ఇక ఎర్ణాకులం హైకోర్టు వద్ద జెట్టీ ఎక్కి కదమకుడికి కూడా చేరుకోవచ్చు. కదమకుడితో పాటు ఆ చుట్టపక్కల ఉన్న ఇతర వాటర్ విలేజస్‌ను కూడా సందర్శించాలని కూడా అనుభవజ్ఞులు చెబుతున్నారు.
ఇవీ చదవండి:
వ్యాయామం వ్యసనంగా మారడంతో యువతికి షాక్.. 23 ఏళ్ల వయసులోనే..
ఉదయం పూట ఇలా చేస్తారా.. చిన్నతనంలోనే వార్ధక్య లక్షణాలు వస్తాయి జాగ్రత్త!