Share News

కాశీ నుంచి అయోధ్య వరకు.. IRCTC 6 రోజుల ఆధ్యాత్మిక యాత్ర..

ABN , Publish Date - Aug 28 , 2026 | 05:31 PM

ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లాలనుకునే తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను కవర్‌ చేసే 6 రోజుల 'హోలీ ఉత్తరప్రదేశ్‌' టూర్‌ ప్యాకేజీని సికింద్రాబాద్‌ నుంచి అందిస్తోంది.

కాశీ నుంచి అయోధ్య వరకు.. IRCTC 6 రోజుల ఆధ్యాత్మిక యాత్ర..
IRCTC Holy Uttar Pradesh Tour

ఇంటర్నెట్ డెస్క్: ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ఇష్టపడే వారికి ఐఆర్‌సీటీసీ మరో ఆకర్షణీయమైన యాత్రను అందుబాటులోకి తీసుకొచ్చింది. 'హోలీ ఉత్తరప్రదేశ్' పేరుతో రూపొందించిన ఈ టూర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌లను సందర్శించవచ్చు. సికింద్రాబాద్‌ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రయాణం మొత్తం 5 రాత్రులు, 6 రోజుల పాటు కొనసాగుతుంది.

సికింద్రాబాద్‌ నుంచి రైలు ప్రయాణం

ఈ టూర్‌లో భాగంగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ప్రయాణం మొదలవుతుంది. ప్రతి ఆదివారం, శుక్రవారం ఈ ప్యాకేజీని అందుబాటులో ఉంచారు. ఉదయం 9:25 గంటలకు 12791 నంబర్‌ దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో 3AC తరగతిలో ప్రయాణం ఉంటుంది.

కాశీలో పుణ్యక్షేత్రాల దర్శనం

ప్రయాణంలో రెండో రోజు మధ్యాహ్నం 1:25 గంటలకు వారణాసికి చేరుకుంటారు. అక్కడి నుంచి హోటల్‌కు వెళ్లిన తర్వాత కాశీ విశ్వనాథ ఆలయ దర్శనంతో పాటు సాయంత్రం గంగా హారతిని వీక్షించే అవకాశం ఉంటుంది. మూడో రోజు వారణాసిలోని మరిన్ని ప్రముఖ ఆలయాలను సందర్శిస్తారు. కాశీ విశ్వనాథ ఆలయం, కాలభైరవ ఆలయం, బిర్లా మందిరం వంటి ప్రదేశాలను దర్శించవచ్చు. ఈ సమయంలో షాపింగ్, వ్యక్తిగత అవసరాల కోసం కూడా కొంత సమయం కేటాయించారు.


అయోధ్యలో ప్రముఖ ఆలయాల సందర్శన

నాలుగో రోజు వారణాసి నుంచి అయోధ్యకు బయలుదేరుతారు. దాదాపు 220 కిలోమీటర్ల ప్రయాణం అనంతరం అయోధ్యకు చేరుకుంటారు. అక్కడ అయోధ్య ఆలయం, హనుమాన్‌గఢి, దశరథ్‌ మహల్‌ తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. సాయంత్రం సరయూ ఘాట్‌ వద్దకు వెళ్లే అవకాశం ఉంటుంది.

ప్రయాగ్‌రాజ్‌ నుంచి తిరుగు ప్రయాణం

ఐదో రోజు అయోధ్య నుంచి ప్రయాగ్‌రాజ్‌కు ప్రయాణం కొనసాగుతుంది. సుమారు 170 కిలోమీటర్లు ప్రయాణించి అక్కడికి చేరుకున్న తర్వాత త్రివేణి సంగమం, అలోపీ దేవి ఆలయం వంటి ముఖ్యమైన ప్రదేశాలను సందర్శిస్తారు. ఆ రోజు రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌లో తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. ఆరో రోజు రాత్రి 9:30 గంటల సమయంలో సికింద్రాబాద్‌కు చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.


ఎంత ఖర్చవుతుంది?

3AC కంఫర్ట్‌ కేటగిరీలో ప్యాకేజీ ధరలు గ్రూప్‌ సభ్యుల సంఖ్యను బట్టి మారుతాయి.

  • 1 నుంచి 2 మంది గ్రూప్‌: ట్విన్‌ షేరింగ్‌ ఒక్కొక్కరికి రూ.22,860

  • 1 నుంచి 3 మంది గ్రూప్‌: ట్రిపుల్‌ షేరింగ్‌ ఒక్కొక్కరికి రూ.18,170

  • 4 నుంచి 6 మంది గ్రూప్‌: ట్విన్‌ షేరింగ్‌ ఒక్కొక్కరికి రూ.19,650

  • 4 నుంచి 6 మంది గ్రూప్‌: ట్రిపుల్‌ షేరింగ్‌ ఒక్కొక్కరికి రూ.16,930

  • పిల్లలు (బెడ్‌తో): రూ.15,260

  • పిల్లలు (బెడ్‌ లేకుండా): రూ.13,640

ప్యాకేజీలో ఏం ఉంటాయి?

టూర్‌ ఛార్జీలో 3AC రైలు ప్రయాణం, AC హోటల్‌ వసతి, షేరింగ్‌ ప్రాతిపదికన AC వాహన సదుపాయం, మూడు బ్రేక్‌ఫాస్ట్‌లు, మూడు డిన్నర్లు, ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌, స్థానిక సందర్శనా ప్రయాణాలు, వర్తించే పన్నులు ఉన్నాయి. అయితే ఆలయాల్లో దర్శనానికి సంబంధించిన టికెట్లు, గైడ్‌ ఛార్జీలు, రైల్లో తీసుకునే ఆహారం, వ్యక్తిగత అవసరాల కోసం చేసే అదనపు ఖర్చులు ప్యాకేజీలో చేర్చలేదు. కాబట్టి యాత్రకు వెళ్లే ముందు ఈ అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం మంచిది.

Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

రక్షాబంధన్‌ 2026.. రాఖీ కట్టే సంప్రదాయం వెనుక ఉన్న పురాణ కథలు

దానం చేసేటప్పుడు ఈ 5 తప్పులు చేయొద్దు

Updated Date - Aug 28 , 2026 | 05:59 PM