అనుమతి లేకుండా టూరిస్టుల ఫొటోలు తీస్తే.. గోవా పోలీస్ వార్నింగ్
ABN , Publish Date - Feb 08 , 2026 | 03:58 PM
అనుమతి లేకుండా గోవాలో టూరిస్టుల ఫొటోలు, వీడియోలు తీస్తే నిందితులను 24 గంటలపాటు జైల్లో పెట్టాల్సి వస్తుందని స్థానిక పోలీసులు తాజాగా హెచ్చరించారు. రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలిగించే పనులు చేయొద్దని హెచ్చరించారు.
ఇంటర్నెట్ డెస్క్: గోవాలో (Goa) విదేశీ మహిళా టూరిస్టులు వేధింపులు ఎదుర్కొన్న పలు ఘటనలు ఇటీవల వెలుగులోకి రావడంతో స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. టూరిస్టుల అనుమతి లేకుండా వారి ఫొటోలు, వీడియోలు తీస్తే 24 గంటలపాటు పోలీస్ కస్టడీలో ఉండాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు (Preventive Detention). కట్టు తప్పే భారతీయులతోపాటు విదేశీయులనూ ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు (Selfies Without Consent).
గోవా ప్రతిష్టకు భంగం కలిగించేలా పలువురు టూరిస్టులు, విదేశీయులను ఇబ్బంది పెట్టిన ఘటనలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో బీచ్‌ల్లో పోలీసులు గస్తీ పెంచారు. శుక్రవారం నాడు తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులను ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అదుపులోకి తీసుకున్నారు. వారు బీచ్‌లో కొందరు టూరిస్టుల ఫొటోలను అనుమతి లేకుండా తీసి నెట్టింట పంచుకున్నారని చెప్పారు. భారతీయ నాగరిక సురక్షా సంహిత సెక్షన్ 170 ప్రకారం వారిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఈ సెక్షన్ ప్రకారం పోలీసులకు వారెంట్ లేకుండా వ్యక్తులను అదుపులోకి తీసుకునే హక్కు ఉంటుందని చెప్పారు.
గురువారం నాడు ఓ బీచ్‌లో రష్యా మహిళ ఈత కొడుతుండగా అలిస్టో లోబో అనే వ్యక్తి వీడియో తీసి నెట్టింట పంచుకున్నాడు. అతడిపైనా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరో రష్యా మహిళను వేధించినందుకు ఇద్దరు ఒడిశా వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
‘ఇతర రాష్ట్రాలకు చెందిన కొందరు టూరిస్టులు విదేశీ మహిళలను సెల్ఫీల కోసం ఇబ్బంది పెట్టి, వీడియోలను నెట్టింట షేర్ చేసినట్టు మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించాము. ఇలాంటి ఘటనలు పెరిగితే రాష్ట్రానికి అప్రదిష్ట కలిగే ముప్పు ఉంది’ అని స్థానిక పోలీసు ఉన్నతాధికారి ఒకరు మీడియాతో వ్యాఖ్యానించారు.
ఈ వార్తలూ చదవండి:
భారత్ యాత్ర కార్డు గురించి తెలుసా? దీంతో ఎన్ని బెనిఫిట్స్ అంటే..
ప్రయాణాల్లో వెంట ఉండాల్సిన 8 గ్యాడ్జెట్స్