మరకలు, దుర్వాసనకు చెక్.. స్టీల్ బాటిల్ క్లీనింగ్‌కు బెస్ట్ చిట్కాలు ఇవే
ABN , Publish Date - Sep 15 , 2026 | 12:56 PM
ఎక్కడికి వెళ్లినా వాటర్ బాటిల్ ఉండాల్సిందే. దాహార్తిని తీర్చుకోవడానికి నీళ్ల బాటిల్‌ను వెంట తీసుకెళ్తుంటాం. వాటర్ బాటిళ్లలో స్టెయిన్‌లెస్ స్టీల్ బాటిళ్లకు ప్రత్యేక ఆదరణ ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: ఎక్కడికి వెళ్లినా వాటర్ బాటిల్ ఉండాల్సిందే. దాహార్తిని తీర్చుకోవడానికి నీళ్ల బాటిల్‌ను వెంట తీసుకెళ్తుంటాం. వాటర్ బాటిళ్లలో స్టెయిన్‌లెస్ స్టీల్ బాటిళ్లకు ప్రత్యేక ఆదరణ ఉంది. ఈ మధ్య కాలంలో చాలా మంది స్టీల్ బాటిళ్లనే వాడుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఈ స్టీల్ బాటిళ్లను ఉపయోగిస్తున్నారు. స్కూల్, ఆఫీస్, సుదూర ప్రాంతాలు ఇలా ఎక్కడికి వెళ్లినా స్టీల్ బాటిళ్లను తీసుకెళ్లడం కామన్. ఎందుకంటే ఈ బాటిళ్లలో నీటితో పాటు టీ, కాఫీతో పాటు వేడి, చల్లటి పానీయాలను కూడా నిల్వ చేసుకోవచ్చు. అయితే వీటిని తరచూ వినియోగించడం వల్ల బాటిల్ అడుగున మరకలు ఉండిపోవడంతో పాటు దుర్వాసన వస్తుంది. దీంతో తరచుగా బాటిళ్లను శుభ్రం చేయాల్సిందే. బాటిల్ పై భాగాన్ని, లోపలి భాగాన్ని శుభ్రం చేయడం ఈజీనే కానీ బాటిల్ అడుగున ఉన్న మరకలను శుభ్రం చేయడం కష్టమే. కొన్ని చిట్కాలతో ఈజీగా వాటిని క్లీన్ చేసుకోవచ్చు.
తెల్ల వెనిగర్‌తో బెస్ట్ క్లీనింగ్
మొండి మరకలను తొలగించడంలో తెల్ల వెనిగర్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. వెనిగర్‌తో గోరువెచ్చని నీటిని సమాన మోతాదులో తీసుకుని బాటిల్‌లో పోయాలి. ఆపై అరగంట పాటు ఉంచి శుభ్రం చేసుకోవాలి.
నిమ్మరసం, ఉప్పు..
నిమ్మరసం, ఉప్పు మిశ్రమం కూడా బాటిల్‌ను శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ రెండింటిని కలిపి బాటిల్‌లో వేసి షేక్ చేయాలి. ఆపై నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల బాటిల్‌లోని మరకలు తొలగడంతో పాటు దుర్వాసన కూడా తొలగిపోతుంది.
బేకింగ్ సోడాతో శుభ్రం చేస్తే..
స్టీల్ బాటిల్‌లో అడుగున ఉన్న మరకలను తొలగించేందుకు బేకింగ్ సోడాను ఉపయోగించవచ్చు. ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను గోరువెచ్చని నీటిలో కలిపి బాటిల్‌లో పోసి కొన్ని గంటలు ఉంచాలి. ఆ తరువాత బాటిల్‌ను శుభ్రం చేస్తే మరకలు, దుర్వాసన తొలగిపోతుంది.
మూతను విడిగా కడగాల్సిందే..
బాటిల్‌తో పాటు బాటిల్ మూత కూడా శుభ్రం చేసుకోవాలి. బాటిల్ మూతలో ఉండే చిన్న గీతలు, రబ్బర్ సీల్ దగ్గర తేమ, మురికి పేరుకుపోతుంది. దీనిని తొలగించేందుకు బాటిల్ మూతను కూడా గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.
బాటిల్ కడిగిన వెంటనే ఇలా చేయొద్దు..
బాటిల్‌ను కడిగిన వెంటనే మూత పెట్టవొద్దు. అలా చేస్తే దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది. బాటిల్‌ను శుభ్రం చేసిన తరువాత.. మూత, బాటిల్‌ను వేరు వేరుగా, గాలి తగిలేలా ఆరబెట్టాలి.
ఇవి కూడా చదవండి...
ఎరుపు-తెలుపు డ్రాగన్ ఫ్రూట్‌లో ఏది బెస్ట్?
మధ్యాహ్నం ఎక్కువసేపు నిద్రపోతే రాత్రి ఎందుకు నిద్రపట్టదు? కారణం ఇదే!