Share News

బ్రేక్‌ఫాస్ట్‌కు బెస్ట్ ఆప్షన్ కట్టె పొంగలి.. తయారీ విధానం ఇలా

ABN , Publish Date - Jun 10 , 2026 | 08:55 AM

వెన్నలా కరిగిపోయే మృదువైన కట్టె పొంగలి సౌత్ ఇండియాలో ఎంతో ప్రసిద్ధి చెందిన సంప్రదాయ వంటకం. బియ్యం, పెసరపప్పు, నెయ్యి కలయికతో తయారయ్యే ఈ వంటకం రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

బ్రేక్‌ఫాస్ట్‌కు బెస్ట్ ఆప్షన్ కట్టె పొంగలి.. తయారీ విధానం ఇలా
Katte Pongali Recipe

ఇంటర్నెట్ డెస్క్: వెన్నలా కరిగిపోయే కమ్మని కట్టె పొంగలి సౌత్ ఇండియాలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన సంప్రదాయ వంటకం. దీనిని సాధారణంగా ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా లేదా పండుగల సమయంలో దేవుడికి నైవేద్యంగా తయారు చేస్తారు. రుచికరంగా ఉండటమే కాకుండా ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇప్పుడు ఇంట్లోనే సులభంగా కట్టె పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.


కావలసిన పదార్థాలు:

బియ్యం, పెసరపప్పు, ఉప్పు, పచ్చిమిర్చి, నెయ్యి, నూనె, మిరియాలు, జీలకర్ర, అల్లం, జీడిపప్పు, కరివేపాకు, ఇంగువ

తయారీ విధానం:

  • ముందుగా ఒక పాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టండి. అందులో 1 కప్పు (సుమారు 180 గ్రాములు) పెసరపప్పు వేసి తక్కువ మంటపై బాగా వేయించాలి. పప్పు రంగు కొద్దిగా మారిన వెంటనే స్టవ్ ఆపేయండి.

  • తర్వాత కుక్కర్‌లో 1 కప్పు బియ్యం, వేయించిన పెసరపప్పు వేసి బాగా కడగాలి. అందులో 3 కప్పుల నీళ్లు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1½ టీస్పూన్ ఉప్పు వేసి మూత పెట్టి పెద్ద మంటపై 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.

  • ఇదే సమయంలో మరో గిన్నెలో 3 కప్పుల నీళ్లు వేడి చేయండి. కుక్కర్‌లో విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఆవిరి పూర్తిగా తగ్గిన తర్వాత మూత తీసి అన్నాన్ని గరిటతో బాగా కలపాలి. తరువాత వేడి చేసిన 3 కప్పుల నీళ్లు కలిపి 2 నిమిషాలు మరిగించాలి.

  • ఇప్పుడు తాలింపు సిద్ధం చేసేందుకు ఒక పాన్‌లో 1 టేబుల్ స్పూన్ నూనె, అరకప్పు నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో జీలకర్ర, తరిగిన అల్లం, మిరియాలు వేసి వేయించాలి. తర్వాత జీడిపప్పు వేసి స్వల్పంగా రంగు మారే వరకు ఫ్రై చేయాలి. అనంతరం పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఇంగువ వేసి బాగా కలపాలి.

  • ఈ తాలింపును సిద్ధమైన పొంగలిలో వేసి బాగా కలపాలి. అంతే..రుచికరమైన, మృదువైన కట్టె పొంగలి సిద్ధం.


Also Read:

విండ్ చైమ్.. ఈ ప్రదేశాల్లో అస్సలు పెట్టకండి

ఫిట్‌నెస్ కోసం భోజనం మానేస్తున్నారా? జాగ్రత్త..

Updated Date - Jun 10 , 2026 | 08:55 AM