Share News

ఉపవాసాలు ఉంటారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ABN , Publish Date - Mar 26 , 2026 | 04:12 PM

ఉపవాసాలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ వీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ఉపవాసాలు ఉంటారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Fasting Tips

ఇంటర్నెట్ డెస్క్: ఉపవాసాలతో ఆధ్యాత్మికతను అలవర్చుకోవడంతో పాటు ఆరోగ్యాన్నీ మెరుగుపరుచుకోవచ్చు. అయితే, శరీరంలో ప్రతికూల మార్పులు కనిపించిన వెంటనే ఉపవాసాన్ని ముగించే విజ్ఞత కూడా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉపవాసాన్ని భరించలేని స్థితికి శరీరం చేరుకునప్పుడు స్పష్టమైన మార్పులు కనిపిస్తాయని అంటున్నారు. ఇలాంటప్పుడు ఉపవాసాన్ని ముగిస్తే ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు (When to Stop Fasting).

నిపుణులు చెప్పేదాని ప్రకారం, ఉపవాసం కారణంగా శరీరంలో పోషకాలు తగ్గినప్పుడు ఇబ్బందులు మొదలవుతాయి. కొందరిలో తలతిరిగినట్టు అనిపిస్తుంది. మరికొందరిలో నీరసం, తలనొప్పి మొదలవుతుంది. ఏకాగ్రత కూడా తగ్గుతుంది. ఉపవాసం కారణంగా శరీరం ఒత్తిడికి లోనవుతోందనేందుకు ఇవి ప్రధాన సంకేతాలని నిపుణులు చెబుతున్నారు.


ఇక ఉపవాసం కారణంగా కొందరిలో కడుపులో తిప్పడం, భరించలేని నీరసం, చికాకు వంటివి కలుగుతాయి. ఒంట్లో గ్లైకోజన్ నిల్వలు తగ్గినప్పుడు, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ తప్పినప్పుడు ఈ మార్పులు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యవంతుల్లో చక్కెర స్థాయిలు ప్రమాదకరస్థాయిలో పడిపోయే అవకాశం తక్కువైనప్పటికీ ముందు జాగ్రత్తతో వ్యవహరించడం మంచిదని సూచిస్తున్నారు.

ఇక డయాబెటిస్ రోగులు, హార్మోనల్ సమస్యలు ఉన్న వారు ఉపవాసం చేసేటప్పుడు మరింత అలర్ట్‌గా ఉండాలి. ఓ మోస్తరు అసౌకర్యం కలిగినా వెంటనే ఉపవాసాన్ని కట్టిపెట్టి ఆహారాన్ని తీసుకోవాలి.

ఉపవాసం సమయంలో డీహైడ్రేషన్ రాకుండా జాగ్రత్త వహించాలని కూడా నిపుణులు చెబుతున్నారు. నీరు తగినంత తాగుతున్నా డీహైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తున్నాయంటే వెంటనే ఆహారం తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఉపవాసం అనేది శరీరం పరిమితులు తెలుసుకోవడానికి కాదన్న విషయాన్ని మర్చిపోవద్దని నిపుణులు చెబుతున్నారు.


ఈ వార్తలూ చదవండి:

పలుచని కనుబొమ్మలకు సహజ పరిష్కారం

కాల్చిన మొక్కజొన్న లేదా ఉడికించిన మొక్కజొన్న.. ఏది ఆరోగ్యానికి మంచిది?

Updated Date - Mar 26 , 2026 | 04:23 PM