Fasting : పొట్టకు రెస్ట్
ABN , Publish Date - Mar 18 , 2024 | 11:08 PM
ఎలాంటి యంత్రానికైనా విశ్రాంతి అవసరం. అలాగే మన పొట్టకు కూడా! అందుకోసం ఉపవాసం ఉండడం మంచి లక్షణం. అయితే ఏ కారణంతో ఉపవాసం చేసినా, దాంతో ఆరోగ్య ఫలాలు
ఎలాంటి యంత్రానికైనా విశ్రాంతి
అవసరం. అలాగే మన పొట్టకు కూడా! అందుకోసం
ఉపవాసం ఉండడం మంచి లక్షణం.
అయితే ఏ కారణంతో ఉపవాసం చేసినా, దాంతో ఆరోగ్య ఫలాలు దక్కాలంటే,
కొన్ని నియమాలు తప్పక పాటించాలి అంటున్నారు వైద్యులు!
ఉపవాసం కచ్చితంగా పరమౌషథమే! తెరిపి లేకుండా పని చేసే జీర్ణ వ్యవస్థకు విరామం ఇవ్వడం అవసరం. కాబట్టే అన్ని మతాలు, సంస్కృతుల్లో ఉపవాసం ఒక తప్పనిసరి సంప్రదాయంగా మారింది. ఉపవాసంతో జీర్ణశక్తి మెరుగవుతుంది. శరీరం శక్తిని ఖర్చు చేసే వేగం పెరుగుతుంది. పోషక శోషణ కూడా పెరుగుతుంది. అలాగే ఉపవాసంతో అధిక బరువు తగ్గే అదనపు ప్రయోజనం కూడా పొందవచ్చు. అయితే ఉపవాసం ప్రయోజనం దక్కాలంటే, అనుసరించే ఉపవాసం క్రమం తప్పకుండా, ఒక పద్ధతి ప్రకారం కొనసాగాలి. రాత్రి హెవీగా బిరియానీ తినేసి, మరుసటి రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మానేసే వాళ్లుంటారు. లేదంటే కొన్ని రోజులు రెండు పూటలు లేదా ఒక్క పూట భోజనానికే పరిమితమైపోయేవాళ్లూ ఉంటారు. కానీ ఇలా నచ్చినట్టు, నచ్చినప్పుడు ఉపవాసాలు ఉండడం వల్ల శరీరం అల్లకల్లోలానికి గురవుతుంది. ఎప్పుడు ఆహారం అందుతుందో, ఎప్పుడు ఆహార కొరతను ఎదుర్కోవాలో ఊహించలేక శరీరం అయోమయానికి లోనవుతుంది. అస్తవ్యస్థ ఉపవాసాల ఫలితంగా కొన్ని దష్ప్రభావాలను కూడా భరించవలసి వస్తుంది.
అస్తవ్యస్థ ఉపవాసంతో...
సమయానికి తినకపోవడం మూలంగా గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తవచ్చు. కడుపు ఉబ్బరం, అసిడిటీ వేధించవచ్చు. అలాగే బలహీనత, మానసిక సంతులనం కోల్పోవడం లాంటి లక్షణాలు కూడా వేధిస్తాయి. బరువు తగ్గడం కోసం ఉపవాసాన్ని ఆశ్రయించేవాళ్లు, అవగాహన లేమితో కొనసాగించే అస్తవ్యస్థ ఉపవాసాల వల్ల బరువు తగ్గకపోగా, పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలాంటి ఉపవాసాలతో మెటబాలిజం దెబ్బతిని బరువు అదుపు తప్పుతుంది. అలాగే ఉపవాసంతో కడుపు నకనకలాడుతూ గంటల తరబడి ఆకలితో అల్లాడిపోయిన తర్వాత, ఒకేసారి ఎక్కువ పరిమాణంలో ఆహారం తినేస్తూ ఉంటారు. బరువు పెరగడానికి ఇదీ ఒక కారణమే! మరీ ముఖ్యంగా ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ చేసే వాళ్లు ఆహారం తీసుకునే విండో టైమ్‌లో నచ్చినవన్నీ తినేస్తూ ఉంటారు. రోజంతా తినడం లేదు కాబట్టి విండో టైమ్‌లో ఏం తిన్నా ఫర్వాలేదు అని సర్దిచెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు.
వారానికో రోజు
వారంలో ఒక రోజు లేదా పక్షంలో ఒక రోజు ఉపవాసం ఉండడం ఆరోగ్యకరం. ఇలాంటి ఉపవాసంతో శరీరానికి పూర్తి విశ్రాంతి దక్కి, మెటబాలిజం పెరుగుతుంది. శరీరం డిటాక్సిఫై అవడంతో పాటు, కొత్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది. అయితే ఉపవాసం చేయడం కంటే, అందుకోసం శరీరాన్ని సిద్ధం చేయడం అంతకంటే ముఖ్యం. మరుసటి రోజు ఉపవాసం చేయబోతున్నప్పుడు, ముందు రోజు శరీరానికి తేలికపాటి ఆహారాన్ని అందించాలి. మరీముఖ్యంగా శరీరంలో పిహెచ్ విలువలు తగ్గకుండా చూసుకోవాలి. సాధారణంగా మనం ఉడికించిన పదార్థాలనే తింటూ ఉంటాం. ఇలా వండడం వల్ల ఆ పదార్థాలన్నీ ఆమ్లత్వాన్ని సంతరించుకుంటాయి. మన పొట్టలో ఉండే హైడ్రోక్లోరిక్ యాసిడ్ కూడా జీర్ణక్రియకు తోడ్పడుతుందనే విషయం అందరికీ తెలిసిందే! అయితే ఉపవాసంలో ఉన్నప్పుడు ఈ ఆమ్లం ఉత్తత్తి కాకుండా ఆపడం కోసం ముందు రోజు నుంచే క్షార గుణం కలిగిన ద్రవాలను, పదార్థాలనూ తీసుకోవడం అవసరం. అందుకోసం కొబ్బరినీళ్లు, పళ్లు, సలాడ్లు తీసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండాలి. ఈ నియమాలు పాటించడం వల్ల ఉపవాసానికి శరీరం చక్కగా సహకరించి, నీరసించిపోకుండా ఉంటుంది. ఇలా వారంలో లేదా పక్షంలో ఒక రోజు ఉపవాసం ఉండడం ఆరోగ్యకరం.
ఉపవాసం డైట్ ఫ్యాడ్ కాదు
ఉపవాసం రోజు శక్తి నిల్వలకు తగినట్టు మన దైనందిన జీవితాన్ని కొనసాగించాలి. ఉపవాసం చేసే సమయంలో కదలకుండా ఇంట్లో ఉంటే ఎనర్జీ లెవల్స్ సమంగా ఉండి, నీరసించిపోకుండా ఉంటాం. విశ్రాంత స్థితిలో ఎనర్జీ మెటబాలిజం నెమ్మదించి, శరీరం డిటాక్సిఫై అవుతుంది. అలా కాకుండా, ఉపవాసాన్ని ఒక డైట్ టెక్నిక్‌గా అనుసరిస్తూ, అన్ని పనులు చేసుకుంటూపోతే, ఆ ప్రభావం శరీరం మీద కచ్చితంగా పడుతుంది. మరీ ముఖ్యంగా ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్‌ను అనుసరించేవాళ్లు ఇదే పొరపాటు చేస్తూ ఉంటారు. ఒకవేళ ఈ ఉపవాస ప్రక్రియతో ప్రతిఫలం పొందాలనుకుంటే, ఇదే ప్రక్రియను జీవితాంతం కొనసాగించగలిగేలా ఉండాలి. రెండు, మూడు నెలల పాటు ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ చేసేసి, బరువు తగ్గిన తర్వాత అన్నీ తినేద్దాం అనుకోవడం పొరపాటు. మన శరీరం ఒక లయతో పని చేస్తుంది. ఆ సర్కేడియం రిథమ్‌ను మనం జీవితాంతం మెయింటెయిన్ చేసుకోవాలి. నిద్ర లేవడం, తినడం, పడుకోవడం.. ఇలాంటి పనులన్నిటికీ మనం నియమిత వేళలను అనుసరించాలి.
బదులుగా ఈ వేళలన్నీ మార్చేసి, నచ్చిన సమయానికి తింటానంటే శరీరం అందుకు సహకరించకపోవచ్చు. గ్యాస్ట్రిక్ సమస్యలే వేధించవచ్చు. కాబట్టి మన దైనందిన జీవితానికి తగిన దీర్ఘకాల ఉపవాస ప్రక్రియను అలవాటు చేసుకోవాలి. ఒకవేళ బరువు తగ్గడం లక్ష్యమైతే ఉపవాసానికి బదులుగా, తీసుకునే పదార్థ పరిమాణాలను, కొవ్వులు, పిండి పదార్థాలనూ తగ్గించుకోవాలి.
ఇవీ ఉపవాసాలే!
ఏమీ తినకుండా కడుపు ఖాళీగా ఉంచడం ఒక్కటే ఉపవాసం కాదు. ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలకు దూరంగా ఉండడం కూడా ఉపవాసమే! జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండడం, తీపి పదార్థాలను దరి చేరనివ్వకపోవడం.. ఇవి కూడా ఉపవాసాలే! వీటితో కూడా బరువు తగ్గవచ్చు. ఆరోగ్యాన్ని మెరుగు చేసుకోవచ్చు. వారంలో లేదా పక్షంలో ఒక రోజు వండిన పదార్థాలకు బదులుగా పండ్లు, పచ్చికూరగాయలను తినడం కూడా ఒక రకమైన ఉపవాసమే! ఇలా ఫ్రూట్ ఫాస్టింగ్ ఉండాలనుకునప్పుడు మూడు పూటలా సలాడ్ లేదా పళ్లు తీసుకోవచ్చు. మజ్జిగ, పళ్ల రసం, లేదా నిమ్మరసం తాగవచ్చు.
ఎనిమిది గంటల విరామం
తిన్న ఆహారం పూర్తిగా జీర్ణమైన తర్వాతే రెండోసారి ఆహారం తీసుకోవడం ఆరోగ్యకరం. ఇందుకు మీల్‌కూ మీల్‌కూ మధ్య 8 నుంచి 12 గంటల విరామం సరిపోతుంది. దీన్ని కూడా ఉపవాసంగా పరిగణించవచ్చు. ఇన్ని గంటల విరామం పాటించగలిగితే, మునుపు తిన్న ఆహారమంతా పూర్తిగా జీర్ణమై, మరుసటి భోజనానికి శరీరం సన్నద్ధమవుతుంది. ఇలాంటి పద్ధతిని పాటించగలిగితే, స్వతఃసిద్ధంగా కొవ్వును కరిగించుకునే శరీర స్వభావం మెరుగువుతుంది. అలాగే జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. తగినంత పీచు తీసుకోకపోవడం మూలంగా పెద్ద పేగుల్లో ఇరుక్కుపోయిన విసర్జకాలు కూడా ఈ విరామ సమయంలో క్లియర్ అయిపోతాయి.
వీళ్లకు ఉపవాసం వద్దు
ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్నవాళ్లు, కాలేయ సమస్యలున్న వాళ్లు, బరువు తగ్గాలనుకునేవాళ్లకు ఉపవాసం సత్ఫలితాన్నిస్తుంది. పెద్ద పేగు, చిన్న పేగు కేన్సర్ల నుంచి రక్షణ పొందడం కోసం కూడా ఉపవాసం ఉంటూ శరీరాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండాలి. అయితే ఉపవాసం చేయకూడని వాళ్లు కూడా ఉంటారు.
మధుమేహుల్లో చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గులకు గురవుతూ ఉంటాయి. కాబట్టి వీళ్లు ఉపవాసానికి బదులుగా ఆహార పరిమాణాన్ని తగ్గించి తినాలి.
సర్జరీ నుంచి కోలుకుంటున్న వాళ్లు ఉపవాసాలు చేయకూడదు
మూత్రపిండాలు, ఇతరత్రా తీవ్ర ఆరోగ్య సమస్యలున్న వాళ్లు ఉపవాసం చేయకూడదు.
ఉపవాస విరమణ ఇలా
ఉపవాసాన్ని భారీ భోజనానికి బదులుగా ద్రవాలతో విరమించాలి. కొబ్బరినీళ్లు, మజ్జిగ లేదా నిమ్మరసాలు తీసుకోవచ్చు. తీపి పదార్థాలు, ఉప్పు, నూనెలు ఎక్కువగా ఉండే పదార్థాలతో ఉపవాసాన్ని విరమించకూడదు. విశ్రాంత స్థితిలో ఉన్న శరీరం సాధారణ స్థితికి రావడం కోసం శరీరానికి మొదట ద్రవ పదార్థాలు, తర్వాత పండ్లు తిని, ఆ తర్వాతే భోజనం తినాలి.
సరైన ఆహారాన్ని సరైన పద్ధతిలో తినకపోవడం మన దేశంలో పెద్ద పేగు కేన్సర్లు పెరగడానికి ఒక ప్రధాన కారణం. ఆహార వేళలు పాటించకపోవడం, నిల్వ పదార్థాలు, కృత్రిమ రంగులు, రసాయనాలు జోడించిన పదార్థాలు తినడం వల్ల కూడా కోలన్ కేన్సర్లు పెరుగుతున్నాయి. శరీరంలో పేరుకుపోయే టాక్సిన్లను తొలగించుకోకపోవడం వల్ల కాలేయం పనితీరు నెమ్మదించి కొలెస్ట్రాల్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇది చివరకు గుండె జబ్బులకు దారి తీయవచ్చు. కాబట్టి ఆహారశైలి క్రమం తప్పకుండా చూసుకోవాలి.

డాక్టర్ సుజాత స్టీఫెన్
క్లినికల్ న్యూట్రిషనిస్ట్,
యశోద హాస్పిటల్స్,
మలక్ పేట, హైదరాబాద్.