Fasting Drink these : ఉపవాసమా? ఇవి తాగండి
ABN , First Publish Date - 2023-08-26T00:34:47+05:30 IST
శ్రావణ మాసంలో కొందరు ఏకభుక్తం చేస్తూ ఉంటారు. పూర్తిగా ఉపవాసం ఉండేవాళ్లు కూడా ఉన్నారు. వీరిలో కొందరు సరైన ఆహారం లేక నీరసించిపోతూ ఉంటారు. అలా నీరసించిపోకుండా
శ్రావణ మాసంలో కొందరు ఏకభుక్తం చేస్తూ ఉంటారు. పూర్తిగా ఉపవాసం ఉండేవాళ్లు కూడా ఉన్నారు. వీరిలో కొందరు సరైన ఆహారం లేక నీరసించిపోతూ ఉంటారు. అలా నీరసించిపోకుండా శరీరానికి తగిన శక్తిని ఇచ్చే పానీయాలు అందిస్తున్నాం... సేవించండి.
అరటి దూట మజ్జిగ
కావాల్సిన పదార్థాలు: అరిటి దూట- 2 కప్పులు (సన్నగా తరగాలి), మజ్జిగ- కప్పు, నీళ్లు- అరకప్పు, వేయించిన జీలకర్ర- అర టీస్పూన్, మిరియాల పొడి (తగినంత), అల్లం (తగినంత), ఉప్పు(తగినంత), తరిగిన కొత్తిమీర- ఒక టీస్పూన్
తయారీ విధానం: ఒక గిన్నెలోకి అరిటిదూటను తీసుకోవాలి. దీనికి మజ్జిగ, నీళ్లు, జీలకర్ర, మిరియాల పొడి, అల్లం, ఉప్పు వేసి మిక్సీ జార్‌లో వేసి బాగా తిప్పాలి. వడబోయటానికి ఒక గుడ్డను తీసుకొని.. ఈ మిశ్రమాన్ని పోయాలి. వడపోసిన తర్వాత వచ్చిన అరిటిదూట మజ్జిగలో కొత్తిమీర వేసుకోవాలి.
లాభాలు: ఈ పానీయం తాగటం వల్ల అలసట ఉండదు. శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.
మోరు కచియాత్
కావాల్సిన పదార్థాలు: పెరుగు- ఒక కప్పు, నీళ్లు- రెండు కప్పులు, జీలకర్ర- ఒక టీస్పూన్, పసుపు- పావు టీస్పూన్, కరివేపాకు- పది ఆకులు, ఉప్పు- రుచికి తగినంత
తయారీ విధానం: మిక్సీ జార్‌లో పెరుగు, నీళ్లు పోసి బాగా తిప్పాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో ఈ మజ్జిగను పోసి- జీలకర్ర, పసుపు, కరివేపాకులు వేసి వేడి చేయాలి. ఇలా తయా రయిన మిశ్రమాన్ని చల్లార్చి.. ఆ తర్వాత తగినంత ఉప్పు వేసి తాగాలి.
లాభాలు: అన్నం తినకపోవటం వల్ల శరీరానికి తగినన్ని పోషకాలు అందవు. ఈ మోరు కచియాత్ (ఉడకబెట్టిన మజ్జిగ)ను తాగితే ఆ పోషకాలు చాలా వరకూ లభిస్తాయి.
యాపిల్- క్యాప్సికమ్ డ్రింక్
కావాల్సిన పదార్థాలు: గ్రీన్ యాపిల్స్- 4, క్యాప్సికం- 4, తరిగిన అల్లం ముక్క- తగినంత , నీళ్లు- అరకప్పు, జీలకర్ర పౌడర్- అరటీస్పూన్ (వేయించిన తర్వాత పొడిచేసుకోవాలి), నీళ్లు- తగినన్ని
తయారీ విధానం: గ్రీన్ యాపిల్స్‌ను శుభ్రంగా కడిగిన తర్వాత విత్తనాలు తీసేసి చిన్న ముక్కలుగా తరగాలి. క్యాప్సికమ్‌ను శుభ్రం చేశాక చిన్నటి ముక్కలుగా తరగాలి. అల్లంను సన్నగా తరగాలి. వీటన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి మిక్సీ జ్యూసర్‌లో వేసి బాగా తిప్పాలి. ఈ మిశ్రమానికి కొన్ని నీళ్లు కలపాలి. అలా తయారయిన డ్రింక్‌లో జీలకర్ర పొడి వేసుకోవాలి.
లాభాలు: కొందరికి ఉపవాసం ఉంటే తేనుపులు వస్తాయి. కొందరికి గ్యాస్ సమస్య ఏర్పడుతుంది.
ఈ డ్రింక్‌ను తాగితే ఈ సమస్యలు పోతాయి.
టమోటా-క్యారెట్ జ్యూస్
టమోటా-క్యారెట్ జ్యూస్ అంటే చాలా మంది ఈ రెండింటినీ జ్యూసర్‌లో వేసి తిప్పేయటం అనుకుంటారు. కానీ వీటికి అదనపు పదార్థాలు కలిపితే మరింత రుచిగా తయారవుతుంది. శరీరానికి తగినంత విటమిన్-సి కూడా లభిస్తుంది.
కావాల్సిన పదార్థాలు: టమోటాలు- 4 (మీడియం సైజు), క్యారెట్స్- 4 (మీడియమ్ సైజు), స్టార్ ఫ్రూట్స్-4, నల్ల మిరియాలు- 4 (పొడి చేసుకోవాలి), నీళ్లు- నాలుగు కప్పులు, ఉప్పు- తగినంత
తయారీ విధానం: ముందుగా నీళ్లలో ఉప్పు వేసి కరగనివ్వాలి. టమోటాలు, క్యారెట్స్, స్టార్ ఫ్రూట్స్‌ను శుభ్రం చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. ఈ ముక్కలను మిక్సి జ్యూసర్‌లో వేసి బాగా తిప్పాలి. ఆ మిశ్రమంలో ఉప్ప నీళ్లను కలపాలి. మళ్లీ మిక్స్ చేసిన తర్వాత వడగొట్టుకొని దానిలో మిరియాల పొడి వేయాలి.
లాభాలు: క్యారెట్స్, టమోటాలు, స్టార్‌ఫ్రూట్స్‌లో ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. ఇది మనను త్వరగా అలసిపోనివ్వకుండా చేస్తుంది.