ఈ విషయాలను యవ్వనంలోనే తెలుసుకోవాలి
ABN , Publish Date - Jul 02 , 2026 | 03:06 PM
యవ్వనంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును ప్రభావితం చేస్తాయని ఆచార్య చాణక్యుడు పేర్కొన్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వంటి అలవాట్లను చిన్న వయసులోనే అలవరచుకుంటే జీవితంలో విజయం సాధించడం సులభమవుతుందని వివరించారు.
ఇంటర్నెట్ డెస్క్: యవ్వనం.. జీవితంలో అత్యంత కీలకమైన దశ. ఈ సమయంలో అలవర్చుకునే మంచి అలవాట్లు, తీసుకునే సరైన నిర్ణయాలే మన భవిష్యత్తుకు బలమైన పునాది అవుతాయి. అందుకే ఈ వయసులో కొన్ని ముఖ్యమైన విషయాలను తప్పనిసరిగా నేర్చుకోవాలని ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో పేర్కొన్నారు.
ఆచార్య చాణక్యుడి ప్రకారం, 20 నుంచి 30 సంవత్సరాల మధ్య కాలం.. జీవితాన్ని మలిచే దశ. ఈ సమయంలో చేసే పనులు, ఏర్పరుచుకునే అలవాట్లు, తీసుకునే నిర్ణయాలే భవిష్యత్తులో విజయాన్ని లేదా అపజయాన్ని నిర్ణయిస్తాయి. కాబట్టి ఈ వయసులో నేర్చుకోవాల్సిన ముఖ్యమైన జీవిత పాఠాలు ఏమిటో తెలుసుకుందాం..
మంచి స్నేహితులను ఎంచుకోండి
మనతో ఉండే స్నేహితుల ప్రభావం మన జీవితంపై ఎక్కువగా ఉంటుంది. చెడు అలవాట్లు ఉన్నవారితో స్నేహం చేస్తే మనం కూడా అదే దారిలో వెళ్లే ప్రమాదం ఉంటుంది. అందుకే మంచి ఆలోచనలు చెప్పే, అవసరమైనప్పుడు సరైన సలహా ఇచ్చే వారినే స్నేహితులుగా ఎంచుకోవాలని చాణక్యుడు సూచించారు.
డబ్బు విలువ తెలుసుకోండి
యవ్వనంలో సంపాదించిన డబ్బును ఆడంబరాలకు ఖర్చు చేయకుండా, పొదుపు చేయడం, తెలివిగా పెట్టుబడులు పెట్టడం నేర్చుకోవాలి. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, దానిని సరిగ్గా ఉపయోగించడం కూడా అంతే ముఖ్యమని చాణక్యుడు చెప్పారు.
వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచండి
ప్రతి విషయాన్ని అందరితో పంచుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా జీవిత లక్ష్యాలు, భవిష్యత్తు ప్రణాళికలు, బలహీనతలు ఇతరులకు చెప్పకుండా గోప్యంగా ఉంచుకోవాలి. లేకపోతే కొందరు వాటిని తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.
సాహసంగా ముందడుగు వేయండి
కొత్త పనులు ప్రారంభించేటప్పుడు వైఫల్యం వస్తుందేమో అనే భయాన్ని వదిలేయాలి. భయపడే వారు పెద్ద విజయాలు సాధించలేరు. తప్పులు జరిగినా వాటి నుంచి నేర్చుకుంటూ ముందుకు సాగితేనే విజయం సాధించవచ్చు.
అందరినీ గుడ్డిగా నమ్మవద్దు
ప్రతి ఒక్కరినీ పూర్తిగా నమ్మడం మంచిది కాదు. కొందరు తమ స్వలాభం కోసం దగ్గరవుతారు. అందుకే ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. భావోద్వేగాల కంటే వివేకానికి ప్రాధాన్యం ఇవ్వాలని చాణక్యుడు సూచించారు.
సమయానికి విలువ ఇవ్వండి
జీవితంలో అత్యంత విలువైన సంపద.. సమయం. యవ్వనంలో సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందవచ్చు. సోమరితనం, అనవసర వినోదాలతో సమయాన్ని వృథా చేయకుండా లక్ష్యాల సాధనకు వినియోగించాలి.
ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు
విజయం, డబ్బు కోసం పరుగులు తీస్తూ ఆరోగ్యాన్ని విస్మరించకూడదు. మంచి ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, తగిన నిద్ర, మానసిక ప్రశాంతతపై శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్యం బాగుంటేనే జీవితంలో సాధించిన విజయాలను ఆనందంగా ఆస్వాదించగలుగుతాం.
Also Read:
పని ఒత్తిడి సంతానోత్పత్తిని తగ్గిస్తుందా? నిపుణులు ఏమంటున్నారంటే..
వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆహారాలకు దూరంగా ఉండండి