Share News

ఎలాంటి ముందస్తు హెచ్చరికలూ ఉండట్లేదు.. జెలెన్‌స్కీ ఆవేదన

ABN , Publish Date - Oct 20 , 2026 | 01:29 PM

రష్యా దాడులకు సంబంధించి తమకు అమెరికా, ఇతర మిత్ర దేశాల నుంచి రావాల్సిన ముందస్తు హెచ్చరికల్లో అంతరాయాలు చోటుచేసుకుంటున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ విచారం వ్యక్తం చేశారు.

ఎలాంటి ముందస్తు హెచ్చరికలూ ఉండట్లేదు.. జెలెన్‌స్కీ ఆవేదన
Volodymyr Zelensky

ఇంటర్నెట్ డెస్క్: రష్యా దాడులకు సంబంధించి తమకు అమెరికా, ఇతర మిత్ర దేశాల నుంచి రావాల్సిన ముందస్తు హెచ్చరికల్లో అంతరాయాలు చోటుచేసుకుంటున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ తాజాగా విచారం వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి బాలిస్టిక్ క్షిపణులతో రష్యా దాడులకు దిగిన నేపథ్యంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. నిఘాసమాచార లోపం ఎందుకు తలెత్తిందనే విషయంలో మిత్రదేశాల నుంచి కనీసం వివరణ కూడా లేదని ఆక్రోశం వ్యక్తం చేశారు.

‘మా వ్యూహాత్మక భాగస్వాముల నుంచి ఎలాంటి వివరణ ఇప్పటివరకూ అందలేదు. అసలు ఎందుకు ఇలా జరుగుతోందనే దానిపై నావద్ద సమాధానం లేదు. క్షిపణి దాడులపై ఎలాంటి ముందస్తు హెచ్చరికలూ అందకపోవడం ఈ వారంలో ఇది మూడోసారి’ అని జెలెన్‌స్కీ విలేకరుల వద్ద విచారం వ్యక్తం చేశారు.


ఉక్రెయిన్‌ వాదనలను యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే పలుమార్లు తోసిపుచ్చారు. జెలెన్‌స్కీ వ్యాఖ్యలపై సోమవారం ట్రంప్ మాట్లాడుతూ తాము ఉక్రెయిన్‌కు ఎంతో చేశామని అన్నారు. ‘ఉక్రెయిన్ గురించి నాతో మాట్లాడవద్దు. మేము ఉక్రెయిన్‌కు ఎంతో చేశాము. కానీ మాకు వాళ్ల నుంచి ఎలాంటి ప్రతిఫలం దక్కలేదు’ అని అసంతృప్తి వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా యూఎస్, ఉక్రెయిన్ అధ్యక్షుల మధ్య ఎడం పెరుగుతున్న విషయం తెలిసిందే. ట్రంప్ చారిత్రక తప్పు చేస్తున్నారని జెలెన్‌స్కీ ఇటీవల పేర్కొనగా యుద్ధం కొనసాగాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు కోరుకుంటున్నారని ట్రంప్ ఆరోపించారు.

క్షిపణి దాడులకు సంబంధించి అమెరికా కావాలనే ముందస్తు హెచ్చరికలను నిలిపివేస్తోందని ఉక్రెయిన్ అధికారులు అనుమానిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. తమకు నిఘా సమాచారం అందకుండా యూఎస్ కావాలనే తొక్కిపెడుతోందని ఉక్రెయిన్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కారణంగానే ఆదివారం తమపై రష్యా దాడులు చేయగలిగిందని చెప్పాయి. ఆ తరువాత ముందస్తు హెచ్చరికల వ్యవస్థను యాక్టివేట్ చేయడంతో రెండో సారి జరిగిన రష్యా దాడిని తట్టుకోగలిగామని పేర్కొన్నాయి.


ఈ వార్తలనూ చదవండి:

ట్రేడ్ డీల్‌ వల్ల భారత్‌కు సుంకాల నుంచి మినహాయింపు: మార్కో రూబియో

ఎన్నికల్లో మోసం.. యూఎస్ గ్రీన్‌ కార్డు ఉన్న భారతీయులపై కేసు

Updated Date - Oct 20 , 2026 | 02:18 PM