ఎప్‌స్టీన్‌తో సంబంధాలు.. WEF సీఈఓ పదవికి బోర్జ్ బ్రెండే రాజీనామా..
ABN , Publish Date - Feb 26 , 2026 | 06:30 PM
బోర్జ్ బ్రెండే సంచలన నిర్ణయం తీసుకున్నారు. గురువారం వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సీఈఓ పదవికి రాజీనామా చేశారు. జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత.. తాను వరల్డ్ ఎకనామిక్ ఫోరం సీఈఓ పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు.
ఇంటర్‌నెట్ డెస్క్: ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఫైల్స్‌లో ప్రపంచ ప్రముఖుల పేర్లు ఉండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సీఈఓ బోర్జ్ బ్రెండేకు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. అమెరికా న్యాయ శాఖ చెబుతున్న దాని ప్రకారం బోర్జ్ బ్రెండే మూడు సార్లు ఎప్‌స్టీన్‌తో కలిసి డిన్నర్ చేశారు. అంతేకాదు.. పలుమార్లు మెయిల్, టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా ఎప్‌స్టీన్స్‌తో సంప్రదింపులు జరిపారు. ఈ ఆరోపణలపై ఫోరమ్ దర్యాప్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో బోర్జ్ బ్రెండే సంచలన నిర్ణయం తీసుకున్నారు.
గురువారం వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సీఈఓ పదవికి రాజీనామా చేశారు. రాజీనామాపై బోర్జ్ బ్రెండే స్పందిస్తూ.. ‘జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత.. నేను వరల్డ్ ఎకనామిక్ ఫోరం సీఈఓ పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. 8-1/2 ఏళ్ల కాలంలో నేను ఎంతో నేర్చుకున్నాను. నా సహచరులు, భాగస్వాములు, ఇతర సభ్యులతో కలిసి పని చేయటం గౌరవంగా భావిస్తున్నా. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఫోరమ్ తన ముఖ్యమైన పనిని కొనసాగించడానికి ఇది సరైన సమయం అని భావిస్తున్నా’ అని చెప్పుకొచ్చారు.
ఆయన ఎక్కడా కూడా జెఫ్రీ ఎప్‌స్టీన్ ప్రస్తావన తీసుకురాలేదు. ఇక, ఇప్పటికే జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో బోర్జ్ బ్రెండే సంబంధాలపై అవుట్‌సైడ్ కౌన్సిల్ స్వతంత్ర దర్యాప్తు పూర్తయింది. ఈ దర్యాప్తులో అమెరికా న్యాయ శాఖ బయట పెట్టిన విషయాలు మాత్రమే ఉన్నాయి. కొత్తగా ఏమీ బయటపడలేదు. ఈ విషయాన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సహ అధ్యక్షులు ఆండ్రే హాఫ్‌మ్యాన్, ల్యారీ ఫింక్ ఓ ప్రత్యేక ప్రకటనలో మీడియాకు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
టీ20 ప్రపంచ కప్ సూపర్ 8: భారత్-జింబాబ్వే మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్
చిన్నారుల భద్రత కోసం పటిష్ట చర్యలు: డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా