Share News

నివురుగప్పిన నిప్పు!

ABN , Publish Date - Apr 11 , 2026 | 04:28 AM

పశ్చిమాసియాలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇరాన్‌, అమెరికా, ఇజ్రాయెల్‌, గల్ఫ్‌ దేశాలపై దాడులు ఆగినా ఉద్రిక్తత మాత్రం కొనసాగుతోంది. లెబనాన్‌పై దాడుల నిలిపివేతపై...

నివురుగప్పిన నిప్పు!

  • కాల్పుల విరమణ ఉన్నా పశ్చిమాసియాలో తగ్గని ఉద్రిక్తత

దుబాయ్‌/టెహ్రాన్‌/వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 10: పశ్చిమాసియాలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇరాన్‌, అమెరికా, ఇజ్రాయెల్‌, గల్ఫ్‌ దేశాలపై దాడులు ఆగినా ఉద్రిక్తత మాత్రం కొనసాగుతోంది. లెబనాన్‌పై దాడుల నిలిపివేతపై చిక్కుముడి మరింత బిగుసుకుంది. మరికొన్ని గంటల్లో ఇస్లామాబాద్‌ వేదికగా చర్చలు జరగాల్సి ఉండగా.. ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన కొనసాగుతోంది. లెబనాన్‌పై దాడులను తగ్గించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్వయంగా సూచించినా ఇజ్రాయెల్‌ మాత్రం వెనక్కి తగ్గలేదు. శుక్రవారం కూడా భారీ స్థాయిలో దాడులు చేసింది. లెబనాన్‌లో దాడులు ఆపేదాకా చర్చల ప్రసక్తే లేదని ఇరాన్‌ స్పష్టం చేసింది. ఇక చర్చలు సఫలం కాకపోతే భారీ స్థాయిలో దాడులకు సిద్ధమని అమెరికా హెచ్చరిస్తే.. తమ వేలు ట్రిగ్గర్‌పై సిద్ధంగా ఉందని ఇరాన్‌ తేల్చిచెప్పింది. దీంతో శనివారం పాకిస్థాన్‌లో చర్చలు ఎలా సాగుతాయనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.

లెబనాన్‌పై దాడులు

లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు శుక్రవారం కూడా కొనసాగాయి. దక్షిణ లెబనాన్‌లోని నబతియే, టైర్‌, బెక్కా, అల్‌టైరీ, సహ్మారీ, బింట్‌ జబేల్‌, అల్‌ అన్సార్‌, బేట్‌ యహోన్‌ పట్టణాలపై వైమానిక దాడులు జరిగాయి. 12 మంది భద్రతా సిబ్బంది మృతిచెందారని లెబనాన్‌ జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. జబా పట్టణంలో ఆరుగురు, సహ్మారీలో ఇద్దరు మృతిచెందారని తెలిపింది. దేర్‌ ఖనౌన్‌ రాస్‌ అలిన్‌ పట్టణంలో పలు అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలను ఇజ్రాయెల్‌ ధ్వంసం చేసిందని పేర్కొంది. మొత్తంగా హెజ్బొల్లాకు చెందిన 4,300 ప్రాంతాలపై దాడులు చేసి, 1,400 మందికిపైగా ఆ గ్రూపు మెంబర్లను హతం చేసినట్టు ఇజ్రాయెల్‌ మిలిటరీ ప్రకటించింది. మరోవైపు ఇజ్రాయెల్‌లోని ఆష్దోద్‌ నౌకాదళ స్థావరం, హైఫా ప్రాంతాలపై హెజ్బొల్లా రాకెట్‌ దాడులు చేసింది. ఉత్తర ఇజ్రాయెల్‌లోని కిర్యత్‌ షిమోనా, మెటులా, మార్గలియత్‌, మిస్గావ్‌ పట్టణాలపైకి డ్రోన్లను ప్రయోగించింది. కాగా, తమ ఊపిరి ఉన్నంత వరకు ఇజ్రాయెల్‌తో పోరాడుతామని హెజ్బొల్లా చీఫ్‌ నయీమ్‌ ఖసేమ్‌ శుక్రవారం ప్రకటించారు. ఇజ్రాయెల్‌ దాడులతో లెబనాన్‌లో 10 లక్షల మందికిపైగా నిరాశ్రయులయ్యారని.. వేలాది మంది గాయపడ్డారని ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఈపీ) విభాగం పేర్కొంది. లెబనాన్‌లో దారుణమైన మానవతా సంక్షోభం పొంచి ఉందని హెచ్చరించింది. బాధిత ప్రజలకు అత్యవసర సాయం అందించేందుకు కూడా వీలవని పరిస్థితి నెలకొందని డబ్ల్యూఈపీ లెబనాన్‌ డైరెక్టర్‌ అలిసన్‌ లావి పేర్కొన్నారు.


నేడే ఇస్లామాబాద్‌లో చర్చలు

అమెరికా-ఇరాన్‌ చర్చల కోసం పాకిస్థాన్‌ ఇస్లామాబాద్‌లో ఏర్పాట్లు పూర్తి చేసింది. నగరంలో ప్రభుత్వ భవనాలు, దౌత్యకార్యాలయాలు ఉన్న రెడ్‌ జోన్‌ ప్రాంతంలో 10 వేల మంది మిలిటరీ, పోలీసు సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. నగరంలో శుక్ర, శని, ఆదివారాల్లో సెలవులు ప్రకటించింది. రెడ్‌ జోన్‌ వైపు ఎవరూ రాకుండా ఆంక్షలు విధించింది. అమెరికా, ఇరాన్‌ కీలక నేతలు వస్తుండటంతో ముందుగానే ఆయా దేశాల ప్రతినిధులు చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. కాగా, ఇరాన్‌ బృందం సురక్షితంగా ఇస్లామాబాద్‌కు చేరుకునేలా పాకిస్థాన్‌ యుద్ధ విమానాలను రక్షణగా ఏర్పాటు చేసిందని.. ఈ మేరకు ఇరాన్‌లోని బందర్‌ అబ్బాస్‌ విమానాశ్రయానికి చేరుకున్నాయని కథనాలు వెలువడ్డాయి. ఇరాన్‌ బృందంపై ఇజ్రాయెల్‌ దాడి చేయవచ్చనే అనుమానాల మేరకు ఈ రక్షణ ఏర్పాట్లు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇరాన్‌కు చెందిన 10 మంది ప్రతినిధి బృందం ఇస్లామాబాద్‌కు పాకిస్థాన్‌లోని ఇరాన్‌ రాయబారి రెజా అమీర్‌ మొఘదమ్‌ ‘ఎక్స్‌’లో ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే, తర్వాత పోస్టును డిలీట్‌ చేశారు.

4-National.jpg

ఇజ్రాయెల్‌-లెబనాన్‌ చర్చలు!

అంతర్జాతీయంగా వస్తున్న తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో లెబనాన్‌తో ప్రత్యక్ష చర్చలు చేపడతామని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చర్చలు అమెరికాలోని వాషింగ్టన్‌ వేదికగా జరిగే అవకాశం ఉందని ఆ దేశ విదేశాంగ శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

మోసం చేయడానికి ప్రయత్నించొద్దు: వాన్స్‌

కాల్పుల విమరణ, శాంతి ఒప్పందం కోసం ఇరాన్‌ నిజాయతీగా చర్చలకు రావాలని, మోసం చేయడానికి ప్రయత్నించవద్దని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ వ్యాఖ్యానించారు. ఇస్లామాబాద్‌లో జరిగే చర్చల కోసం పాకిస్థాన్‌కు బయల్దేరిన సందర్భంగా విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఇరాన్‌ మాతో నిజాయతీగా చర్చలు జరిపితే.. స్నేహ హస్తం చాపడానికి మేం సిద్ధం. ఒకవేళ వాళ్లు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తే కష్టమే. చర్చల బృందం ఏమాత్రం సానుకూలంగా స్పందించే అవకాశం ఉండదు’’ అని జేడీ వాన్స్‌ చెప్పారు. ఇరాన్‌తో చర్చలను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై ట్రంప్‌ తమకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారని వెల్లడించారు.


ఆ రెండూ తేలాకే చర్చలు!

ఇరాన్‌ పార్లమెంటు స్పీకర్‌ గలీబఫ్‌

ముందుగా ఇచ్చిన హామీ మేరకు రెండు డిమాండ్లను నెరవేర్చాకే ఇస్లామాబాద్‌లో కాల్పుల విరమణ చర్చలు మొదలవుతాయని ఇరాన్‌ పార్లమెంటు స్పీకర్‌ మొహమ్మద్‌ బఘర్‌ గలీబఫ్‌ స్పష్టం చేశారు. ‘‘చర్చల కోసం అన్ని వర్గాలు పరస్పరం అంగీకరించిన రెండు అంశాలు ఇంకా అమల్లోకి రావాల్సి ఉంది. ఒకటి లెబనాన్‌లో కాల్పుల విరమణ, రెండోది విదేశాల్లో స్తంభింపజేసిన ఇరాన్‌ ఆస్తుల విడుదల. ఈ రెండూ చర్చలు మొదలవడానికి ముందే జరగాలి..’’ అని పేర్కొన్నారు.

ఈ వార్తలూ చదవండి:

200 మిలియన్ డాలర్ల అమెరికన్ డ్రోన్ అదృశ్యం!

ఇజ్రాయెల్ ఆగ్రహం! పాక్ మంత్రి ట్వీట్‌ను డిలీట్ చేయించిన ఆర్మీ చీఫ్

Updated Date - Apr 11 , 2026 | 04:29 AM